సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ముందుంది మొసళ్ల పండుగ’.... జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ సామెతను తలపింపచేస్తోంది. సాధారణ ఎన్నికలకు టికెట్ల కేటాయింపు ఖరారు దశకు వచ్చే కొద్దీ తెలుగుతమ్ముళ్లలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా రెండు గ్రూపులుగా విడిపోయి టికెట్ తమకు కావాలంటే తమకు కావాలని పట్టుపడుతూ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఏదో ఒక వర్గానికి చెందిన అభ్యర్థి పేరు ఖరారు చేసే సమయంలో మరో వర్గం నేతలు మెలికలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వద్దంటూ పట్టుపడుతున్నారు. ఏపట్టు ఎలా ఉన్నా.... మొత్తంగా జిల్లా పార్టీలో ఎంపీ నామా నాగేశ్వరరావు హవానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదు.
తుమ్మలను ఖమ్మం అసెంబ్లీ నుంచి పాలేరుకు మార్పించి, ఆ స్థానంలో తన వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి నాగప్రసాద్‌కు టికెట్ ఇప్పిం చేలా నామా చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని, ఈ మేరకు పార్టీ అధినాయకుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి నాగప్రసాద్‌ల పేర్లు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే వార్తలు కొందరు తమ్ముళ్లలో గుబులు రేపుతున్నాయి. దీంతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నేతలు త్వరలో నే పార్టీని వదిలిపెట్టబోతున్నారని సమాచారం.
ఇద్దరికే అవకాశం
ఈసారి సాధారణ ఎన్నికలలో తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి ఆయనతో పాటు ఆయన అనుచరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు మాత్రమే టికెట్ ద క్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు జనరల్ స్థానాలతో పాటు పార్లమెంటు టికెట్, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలో నామా వర్గానికే టికెట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తుమ్మల వర్గం గుర్రుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమే నిజమైతే ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని వారంటున్నారు.
పార్టీని మొదటి నుంచీ కాపాడుతున్న తుమ్మల వర్గానికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 30 ఏళ్లుగా పార్టీని పట్టుకుని వేలాడుతున్నా తమకు ఒనగూరినదేమీ లేదని అంటున్న ఓ మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నేతలు అధికారికంగా టికెట్లు ప్రకటించిన మరుసటిరోజునే పార్టీని వీడివెళ్లి పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
బీసీ పేరుతోనూ వ్యూహం
జిల్లాలో ఏదో ఒక జనరల్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలనే డిమాండ్ జిల్లా టీడీపీలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అందులో భాగంగా ఖమ్మం లేదా పాలేరు స్థానాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు అవకాశం రావచ్చని భావించారు. అయితే, ఈయన విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. బీసీ కోటాలోనే మరికొందరు నాయకులు టికెట్ ఆశించారు. రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇవ్వడంతో పాటు డీసీసీబీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించారని, మళ్లీ టికెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
అయితే, వర్గపోరు దృష్ట్యా బాలసానికి టికెట్ ఇప్పించడం తుమ్మల వర్గానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో నామా వ్యూహం ఫలించింది. బీసీకి టికెట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా బాలసానికి టికెట్ వస్తుందనే ఆలోచనతో ఆయన ముందు జాగ్రత్తగా ల్యాంకో ఉన్నతోద్యోగి నాగప్రసాద్‌ను తెరపైకి తెచ్చి తుమ్మల గ్రూప్‌నకు చెక్ పెట్టారు. పార్టీలోనికి వచ్చిన వెంటనే పెద్ద పదవి ఇప్పించడంతో పాటు ఇటీవల ఖమ్మంలో జరిగిన ప్రజాగర్జన సభలోనూ ఆయనకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా నాగప్రసాద్‌కు తానున్నానని చెప్పారు. చంద్రబాబు వద్ద తనకున్న లాబీయింగ్‌తో బాలసానికి కాకుండా టికెట్ నాగప్రసాద్‌కే ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది.
నామా వైపే బాబు మొగ్గు!
Published Sun, Mar 30 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM
Advertisement
Advertisement