కట్టే... ‘కీ’లకం
అందరూ కలిసి సునాయాసంగా ‘సార్వత్రిక’ బరినుంచి గట్టెక్కే ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు భావిస్తున్నారు. భారాన్ని అందరూ పంచుకొని ముందుకెళ్తే ఖర్చు తగ్గుతుందనీ యోచిస్తున్నారు. దీనికోసం సంయుక్త ప్రచారం చేద్దామని భేటీలు జరుపుతున్నారు. ఇలా వర్గాలు, విభేదాలు అధిగమించి జనం ముందు కూడా అంతా ఒక్కటేనని చెప్పవచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు అటు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇటు ఎంపీ బరిలో ఉన్నవారు వ్యూహరచన చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రచార పర్వం పట్టాలెక్కుతుండటంతో సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అంతర్గత సమన్వయం కోసం కసరత్తు చేస్తున్నారు. ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తున్న లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించడంపై దృష్టి సారించారు. పొత్తులు, గ్రూపులు తదితరాల మూలంగా విభేదాలు ఉన్న చోట అడ్డంకులను అధిగమించడంపైనా దృష్టి సారించారు. కాంగ్రెస్‌లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎంపీ అభ్యర్థి జైపాల్‌రెడ్డి ప్రచార భారాన్ని, సమన్వయ బాధ్యతలను భుజాలకెత్తుకోనున్నారు.
నాగర్‌కర్నూలు లోక్‌సభ అభ్యర్థి నంది ఎల్లయ్యకు నియోజకవర్గ రాజకీయాలు పూర్తిగా కొత్త కావడంతో మాజీ మంత్రి డీకే అరుణపై సమన్వయ బాధ్యతలు మోపినట్లు భారం. టీఆర్‌ఎస్‌లో వివిధ నేపథ్యం, పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో అందరినీ ఏకతాటిపైకి తేవడం ఎంపీ అభ్యర్థులకు కత్తి మీద సాములా కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ పొత్తుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రచారం సాఫీగా సాగడం అనుమానంగానే కనిపిస్తోంది.
గతంలో టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి కొంత మేర చొరవ తీసుకుని ఇరు పార్టీలను సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ అభ్యర్థులతో ఇప్పటికే సమన్వయం కోసం పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నారు.
వెంటాడుతున్న ‘ఖర్చు’ భయం
అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీ ఉండటం, తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల్లో గట్టెక్కేందుకు అభ్యర్థులు సర్వ శక్తులు ఒడ్డేందుకు సిద్దమవుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులే సొంతంగా నిధులు సమకూర్చుకుని ప్రచార పర్వంపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థుల వైపు సాయం కోసం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత తిరిగి జిల్లా రాజకీయాల్లో అడుగు పెట్టిన ఎంపీ అభ్యర్థి అందించే సాయంపై ఆ పార్టీ నేతలు గంపెడాశలతో ఉన్నారు. సదరు నేతకు గెలుపు కీలకం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ అవసరాలను సదరు నేత ఎదుట ఏకరువు పెట్టినట్లు సమాచారం.
నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి మాత్రం అధిష్టానం నిదులు కొంత మేర సమకూర్చుతున్నట్లు తెలిసింది. అటు టీడీపీ, బీజేపీలోనూ ఎంపీ అభ్యర్థులపై కొంత ఆర్దిక భారం మోపేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్దమవుతున్నారు. టీఆర్‌ఎస్‌లోనూ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు, పార్టీ సమకూర్చే నిధులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు.
చాలా మంది చివరి నిముషంలో పార్టీలో చేరి టికెట్ దక్కించుకోవడంతో సొంతంగా ఖర్చు చేసుకోవాల్సిందిగా పార్టీ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవారం పాటు ప్రచారాన్ని సాదా సీదాగా మొదలు పెట్టి ఎన్నికల సమీపించే కొద్దీ దూకుడు పెంచేలా ప్రచార వ్యూహాన్ని అభ్యర్థులు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే దూకుడుగా వెళ్తే ప్రచార వ్యయం తడిసి మోపెడవుతుందని అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు.