పురలో పైచేయి
మూడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం
- రెండు చోట్ల టీడీపీ, బీజేపీలు కలిస్తే అవకాశం
- 210 వార్డుల్లో .. కాంగ్రెస్ ఖాతాలో104 వార్డులు
- 42 వార్డులకు పరిమితమైన టీడీపీ
- హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు దక్కని స్పష్టమైన మెజారిటీ
- కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఖాతా తెరిచిన వైఎస్సార్ కాంగ్రెస్
సాక్షిప్రతినిధి, నల్లగొండ,పుర జాతకం తేలింది. కాంగ్రెస్ తన పట్టు నిరూపించుకుంది. నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలు, దేవరకొండ నగర పంచాయతీలను, హుజూర్‌నగర్ నగర పంచాయతీని సీపీఐతో కలిసి కాంగ్రెస్ సొంతం చేసుకుంది. భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీల్లో టీడీపీ, బీజేపీలు కలిస్తే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక, కోదాడలో కాంగ్రెస్‌కు 14 వార్డుల్లో విజయం లభించినా పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 2 స్థానాలతో వెనుకబడింది. ఇక్కడ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంలు కలిసినా, మరో స్థానం తక్కువగా ఉండడంతో ఉన్నొక్క ఇండిపెండెంటు, సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయే ఎమ్మెల్యే (ఎక్స్ అఫీషియో మెంబరు)ఓటు కీలకం కానున్నాయి.
మొత్తంగా మున్సిపాలిటీల ఫలితాలను విశ్లేషిస్తే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని స్థానాల్లో ఆయా పార్టీలు బొక్కబోర్లా పడ్డాయి. సూర్యాపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించగా, ఇక్కడ 36 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. అదే మాదిరిగా మిర్యాలగూడ ఎమ్మెల్యేగా సీపీఎంకు చెందిన జూలకంటి రంగారెడ్డి, 36 వార్డులున్న మిర్యాలగూడ మున్సిపాలిటీలో కేవలం రెండువార్డులు మాత్రమే సీపీఎం ఖాతాలో వేయగలిగారు. ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 30 స్థానాలను సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
నల్లగొండ మున్సిపాలిటీలో 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 22 వార్డుల్లో గెలిచి మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హుజూర్‌నగర్‌లో రెండు వార్డులు, కోదాడ ఒక వార్డు గెలుచుకుని ఖాతా తెరిచింది. ఇక, భువనగిరి, సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. హుజూర్‌నగర్‌లో మాత్రం మిత్రపక్షమైన సీపీఐ సాయం లేకుండా కాంగ్రెస్ గట్టేక్కే పరిస్థితి లేదు. చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికకు జూన్ 2వ తేదీ తర్వాతనే అవకాశం ఉండడంతో ఈ రెండు వారాలకు పైగా గెలిచిన తమ అభ్యర్థులను కాపాడుకోవడం ఆయా పార్టీలకు తలకు మించిన భారమే కానుంది. దీంతో క్యాంపు రాజకీయాలు నడపాల్సిన అగత్యమూ కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు క్యాంపు రాజకీయాలపై స్పష్టమైన సమాచారమేదీ లేకున్నా, ఈమూడు చోట్లా క్యాంపు రాజకీయాలు నడవడం కచ్చితమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.