టీడీపీ, బీజేపీలదే విభజన పాపం
- ఆ పార్టీలకు ప్రజలే బుద్ధిచెబుతారు
- శోభానాగిరెడ్డి మృతి బాధించింది
- ఎన్నికల ప్రచారంలో భూమా నాగిరెడ్డి
నంద్యాల రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం టీడీపీ, బీజేపీలదేనని.. విభజనకు సహకరించిన ఆ రెండు పార్టీలకు సీమాంధ్ర ఓటర్లు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నంద్యాల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమానాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని చాపిరేవుల, సుబ్బారెడ్డిపాలెం, పొన్నాపురం, భీమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. వైఎస్సార్సీపీ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ, బీజేపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని ఆరోపించారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట చెబుతూ టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని, ఆ పార్టీకి రెండు కళ్లు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కష్టనష్టాలు భరించి తనను ఓదార్చే శోభానాగిరెడ్డి మృతి బాధించిందని, జీవితంలో ఇంతటి బాధను అనుభవించిన సందర్భం లేదని భూమా అన్నారు. శోభా మృతితో తన బాధ్యతలు పెరిగాయన్నారు. తాను గెలిస్తే గ్రామాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిర్మిస్తానని, సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపడుతానని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.
అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట చాపిరేవుల నాయకులు సూర్యచంద్రారెడ్డి, పాపిరెడ్డి, యశోదర్‌రెడ్డి, రాజు, జీవరత్నం, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, సుబ్బారెడ్డిపాలెం నాయకులు శేషిరెడ్డి, పిచ్చిరెడ్డి, పొన్నాపురం గ్రామ నాయకులు గిరిధర్‌గౌడ్, మనోహర్‌గౌడ్, కుమారిస్వామిగౌడ్, పి.మద్దిలేటి, దుర్గాప్రసాద్, జనార్దన్, నాగేశ్వరరావు, రమణ, భీమవరం గ్రామ నాయకులు రామచంద్రారెడ్డి, శివకుమార్‌రెడ్డి, రాజారెడ్డి, బొజ్జారెడ్డి పాల్గొన్నారు.