మనీ.. మనీ
- పోలీసుల తనిఖీల్లో భారీగా దొరుకుతున్న నగదు
- ఆధారాలు చూపించకపోవడంతో సీజ్
- ఐటీ అధికారులకూ అప్పగింత
గోల్కొండ,బంజారాహిల్స్,న్యూస్‌లైన్: మున్సిపాలిటీ, స్థానిక, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగర పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. అయితే ఆయా పనుల మీద, బ్యాంకుల్లో జమ చేసేందుకు, సొంత పనులకు తీసుకెళ్తున్న నగదు కట్టలు పోలీసులకు పట్టుబడుతున్నాయి. ఆధారాలు చూపిస్తుండడంతో అక్కడికక్కడే ఇచ్చేస్తుండగా..ఆధారాలు లేని నగదును సీజ్ చేస్తున్నారు.
శనివారం ఎన్‌ఎండీసీ చౌరస్తా వద్ద హుమాయున్‌నగర్ పోలీసుల తనిఖీల్లో కారులో తీసుకెళ్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.7.80 లక్షలు పట్టుకున్నారు. ఆధారాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. కృష్ణకాంత్ పార్కు వద్ద జూబ్లీహిల్స్ పోలీసుల తనిఖీల్లో ఓ వ్యాపారి నుంచి రూ.5.50 లక్షలు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సాగర్ సొసైటీ వద్ద..
బంజారాహిల్స్ సాగర్‌సొసైటీ చౌరస్తాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి నుంచి రూ.8.50 లక్షలు పట్టుకున్నారు. సరైన పత్రాలు చూపించడంతో తిరిగి అప్పగించారు.
రూ.9.24 లక్షలు స్వాధీనం
మియాపూర్: మియాపూర్ హైవేపై పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి నుంచి రూ.8.24 లక్షలు పట్టుకున్నారు. అలాగే చందానగర్‌లో కారులో వెళుతున్న ప్రసాద్ సుమంత్‌జైన్ వద్ద రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు.
ఉల్లంఘన కేసులు 270
సిటీబ్యూరో: ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేసేందుకు పక్షంరోజులుగా నగరంలో చేస్తున్న పోలీసుల తనిఖీల్లో శనివారం వరకు సుమారు రూ.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్రమంగా తరలుతున్న రూ.55 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, రూ.16 లక్షల విలువైన వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు లెసైన్స్ కలిగిన సుమారు 80శాతం ఆయుధాలను స్వాధీనపర్చుకున్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్‌లు జారీఅయి పరారీలో ఉన్న 470 మంది నిందితులను అరె స్టు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై సుమారు 270 కేసులు నమోదు చేశారు. రూ.3 లక్షల విలువగల లిక్కర్ పోలీసులకు చిక్కింది.
ఏటీఎంలకు తీసుకెళ్తుండగా పట్టివేత
దత్తాత్రేయనగర్: గుడిమల్కాపూర్ డివిజన్ యాదవ్‌భవన్ చౌరస్తాలో టప్పాచబుత్ర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సెక్యూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ ఆయా ఏటీఎంలలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ.1.26 కోట్ల నగదు పట్టుకున్నారు. వాహనంతోపాటు నగదును తరలిస్తున్న జగదీష్‌కుమార్, శివశంకర్‌లను పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పూర్తి వివరాలు చూపించినప్పటికీ ఆధారాలు సరిగ్గా లేవని నగదును పోలీసుస్టేషన్‌కు తరలించడం దారుణమని సంస్థ ఉద్యోగులు వాపోయారు.