11 ఏళ్ల తర్వాత.. బ్రహ్మోత్సవాలకు బాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బ్రహ్మాండనాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించేందు కు 11 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో ఎన్.చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుమలకు రానున్నారు. 2003 అక్టోబరు 1న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళుతున్న చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోయిస్టులు క్లెమోర్‌మైన్‌తో దాడిచేసిన విషయం విదితమే. ఆ కేసులో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి తిరుపతి కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ను ఇవ్వడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను సమర్పించేవారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టేదాకా ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ.. గరుడసేవ సం దర్భంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తారని, ఇదే సమయంలో సీఎం వస్తే భక్తులు ఇబ్బంది పడతారని అర్చకులు, వేద పండితులు వైఎస్ దృష్టికి తీసుకెళ్లారు. భక్తులను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం రోజునే శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీకి 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తెరతీశారు.
ఆ ఆనవాయితీని కొనసాగించాలని చం ద్రబాబు నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడుకొండలస్వామికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు చంద్రబాబు తిరుమలకు వస్తున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి సరిగ్గా 11 ఏళ్లు అవుతోంది. అక్టోబరు 1, 2003న అలిపిరి వద్ద చంద్రబాబుపై మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేశారు.
ఆ సానుభూతిని ఓట్ల రూపంలో మల్చుకుని.. మరో సారి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనం ముందు సానుభూతిపై చంద్రబాబు పెంచుకున్న ఆశలు నిలబడలేకపోయాయి. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరింది. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైంది. నాలుగు నెలల క్రితం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబూ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
అప్పటికే అలిపిరి దాడి కేసు విచారణ కూడా తుదిదశకు చేరుకుంది. ఈలోగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరానికి తెరలేచింది. ధ్వ జారోహణం సందర్భంలోనే వేంకటేశ్వరునికి పట్టువస్త్రాలను సమర్పించడానికి శుక్రవారం తిరుమలకు చేరుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు పర్యటనకు సరిగ్గా 24 గంటల ముందు అలిపిరి దాడి కేసుపై తిరుపతి కోర్టు తీర్పు వెలువరించింది. ఆ కేసులో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి శిక్షను విధిస్తూ తీర్పును ఇవ్వడం గమనార్హం.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రానున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.50 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిథి భవనానికి చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8.45 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. 9 గంటలకు తిరుమల నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్తారని కలెక్టర్ తెలిపారు.