Informer
-
మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. గడ్చిరోలిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. భమ్రాగడ్ తహసీల్‌లో ఉన్న కియర్ గ్రామంలో సామన్య పౌరుడు సుఖ్రామ్ మాడవిని హత్య చేశారు. అనంతరం, అతడి మృతదేహం వద్ద లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఈ లేఖలో మాడవిని పోలీసుల ఇన్ఫార్మర్ని అని తెలిపారు. పెంగుండ ప్రాంతంలో పోలీసు క్యాంప్ ఏర్పాటుకు అతడు సహకరించాడని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. మావోయిస్టుల చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరుడైన సుఖ్రామ్ మాడవిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. కాగా, ఈ ఏడాదిలో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేయడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్ల కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. -
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
చర్ల: పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా బైరంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశముండిపారా గ్రామానికి చెందిన సోడి భద్రు(45) ఇంటికి ఆదివారం రాత్రి 7 గంటలకు వచ్చిన మావోయిస్టులు భద్రును బయటకు లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య, కుటుంబసభ్యులను పక్కకు నెట్టి ఇంటి ఆవరణలోనే గొడ్డలితో తల, నుదిటిపై నరికారు. దీంతో భద్రు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న బైరంఘడ్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బైరంఘడ్ తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. కాగా, పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందునే హతమార్చామని, ఇలా ఎవరు వ్యవహరించినా ఇదే శిక్ష పడుతుందని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ వదిలారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య
వాజేడు: పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నారనే నెపంతో మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు గిరిజనులను గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు పోలీసు స్టేషన్‌కు సుమారు అరకిలో మీటరు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాజేడు మండల పరిధి బాలలక్ష్మీపురం (పెనుగోలు కాలనీ) గ్రామంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉయిక అర్జున్ (38) ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. వారు అర్జున్ను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఆరుబయట గొడ్డళ్లతో నరికారు.అదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టులు ఉయిక రమేశ్ (38) ఇంటికి వెళ్లి మంచంపై పడుకున్న రమేశ్‌ను గొడ్డళ్లతో నరికి వెళ్లిపోయారు. రమేశ్ కొన ఊపిరితో ఉండగా స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగానే అతను చనిపోయాడు. పేరూ రు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమేశ్‌కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా, అర్జున్‌కు భార్య సావిత్రి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశువులు కాయడానికి అడవుల్లోకి వస్తున్న అర్జున్ తమ దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, ఇతనితోపాటే ఉయిక రమేశ్ కూడా పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నాడని వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఘటనాస్థలంలో వదిలిన రెండు లేఖల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. అమాయకులను హత్య చేశారుఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన ఉయిక రమేశ్, ఉయిక అర్జున్ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి వాజేడు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు, గిరిజనులు, గ్రామ పంచాయతీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసుకు వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుగా పెట్టి పెనుగోలు కాలనీకి వెళ్లే దారి వద్ద వాజేడు, వెంకటాపురం(కె) రహదారిపై ధర్నాకు దిగారు.ఇన్ఫార్మర్ ముద్ర వేసి అమాయక గిరిజనులను మావోయిస్టులు అన్యాయంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రమేశ్ భార్యకు నెలరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు ఏటూరునాగారం ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. -
విభేదాలే రాధ ప్రాణాలు తీశాయా!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫార్మర్ అన్న ముద్రతో హత్యకు గురైన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో ఉదంతం ఇప్పుడు మాజీలు..ప్రస్తుత మావోయిస్టుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2017 డిసెంబర్ నెలలో ఉద్యోగం వచ్చి0దని రాధ తన తల్లిదండ్రులకు సమాచారమిచ్చి చైతన్య మహిళా సంఘం సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లింది. అక్కడ నుంచి ఏవోబీ బో ర్డర్ మీదుగా దళంలో చేరింది. అక్కడే ఆమె పేరును నీల్సోగా మార్చారు. సాంకేతిక విద్యావంతురాలు కావడంతో ఆమెను తొలుత సిగ్నల్ ఆపరేటర్‌గా నియమించి ఒక సెల్‌ఫోన్ ఇచ్చారు. అడవి నుంచి జనావాస ప్రాంతాలకు వచ్చి.. నేతలు చెప్పిన వారికి సమాచారం (ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్) చేరవేసి, ఫోన్ స్విచాఫ్ చేసి, సిమ్‌కార్డు తీసేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయేది. అప్పటికే అడవిలో ఉన్న అగ్రనేతలకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.వారందరూ షుగర్, బీపీ, గుండె ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్, పరీక్షలు, మందు లు, చికిత్స మొత్తం రాధ అలియాస్ నీల్సోనే చూసుకునేది. అలా నీల్సో అనతికాలంలో అగ్ర నాయకత్వానికి దగ్గర అ య్యింది. అందుకే ఆమె సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్Œ ఫోర్స్ క మాండర్‌గా ఎదిగింది. ఆమెను లేడీ చేగువేరాగా పిలిచేవారు.కరోనా సమయంలో వైద్యసేవలు కరోనా ఫస్ట్ వేవ్‌లో మావోయిస్టులకు పెద్దగా నష్టం వాటి ల్లలేదు. కానీ..సెకండ్ వేవ్‌లో చాలామంది అగ్రనేతలు వరుసగా మరణించడం మొదలైంది. మందుల కోసం బయటకు వచ్చే కొరియర్లపై పోలీసు నిఘా తీవ్రమైంది. ఆ సమయంలో నీల్సోనే చాలా మంది దళ సభ్యులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడింది.అయితే కరోనా తగ్గుముఖం పట్టాక.. ఓ అగ్రనేతతో నీల్సోకు విభేదాలు మొదలై.. తారస్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో నీల్సో దళం వదిలి ఇంటికి వద్దామనుకుంది. కానీ, సదరు నేత తీరు, సిద్ధాంతాలు ఉల్లంఘిస్తున్న వైనాన్ని వివరిస్తూ.. మూడునెలల క్రితం అగ్ర నాయకత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ పార్టీలో తీవ్ర అలజడి రేపగా, దీనిపై నిజనిర్ధారణ చేయాలంటూ ఓ కీలకనేతకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో దళానికి వరుస ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నీల్సోతో ఘర్షణ పడిన నేత నిజ నిర్ధారణకు వచ్చిన నేతకు రాధ ఇన్ఫార్మర్ అంటూ ఫిర్యాదు చేశాడు. అసలే పోలీసుల నుంచి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్న క్రమంలో అతని మాటలను అగ్రనేత సైతం విశ్వసించాడు. చివరికి నీల్సోకు మరణశిక్ష విధించారు. లొంగుబాటులో మావోలు రాధ హత్య దళంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము రాధ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భయంతో ప్రస్తుతం దళంలోని కొందరు సభ్యులు తెలంగాణ పోలీ సులను సంప్రదించినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు సెంట్ర ల్ కమిటీ మెంబర్లు కొద్ది రోజుల్లో సరెండర్ అవుతామంటూ సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. కరోనాకు ముందు మావోయిస్టులు ఫిట్టర్, ఎల్రక్టీషియన్, మెకానికల్ డిప్లొమా చదువుకున్న గిరిజన యువతను భారీగా రిక్రూట్ చేసుకున్నారు. ఐఈడీల తయారీ కోసమేనని అప్పుడే తెలంగాణ పోలీసులు అనుమానించారు. వెళ్లిన వారిలో చాలామంది అక్కడ ఉండలేకపోయారు. మెజారిటీ యువకులు అప్పటి కొత్తగూడెం ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. -
మావోయిస్టుల ఘాతుకం.. హత్య చేసి టీఆర్ఎస్పై షాకింగ్ వ్యాఖ్యలు
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వెంకటాపురం మండలంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలోనే ఇన్ఫార్మర్గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు. వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గోపాల్ ఇంట్లో ఉన్న సమయంలో ఐదుగురు అనుమానితులు రావడంతో వారిని గమనించిన గోపాల్ బయటికి పరుగెత్తగా వెంబడించి పట్టుకున్నారు. గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి చంపేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న గోపాల్ మృతి చెందినట్లు నిర్ధారించుకుని లాల్‌సలామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చాలా మందిని కాల్చి చంపారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఇన్ఫార్మర్గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 20 రోజుల క్రితం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పర్యటించి పోలీసులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఇలా హత్య జరగడం ఏజెన్సీలో కలకలం సృష్టించింది. -
పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో దాడి, చనిపోయాడని వదిలి వెళ్లారు.. చివరికి
సాక్షి, వరంగల్: పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓప్రైవేట్ ఉద్యోగిపై అదే కులానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. అతను చనిపోయాడని భావించి ప్రత్యర్థి వర్గంవారు అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ ఘటన హసన్‌పర్తి మండలం వంగపహాడ్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడి తండ్రి హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి జరిగిందని ప్రత్యర్థి వర్గం వారు కూడా కౌంటర్ పిటిషన్ ఇచ్చారు. వివరాలు.. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన ముస్కు శ్యాంరావు ప్రశాంత్ పైవేట్ ఉద్యోగి. అయితే శ్యాంరావు ప్రశాంత్ పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తూ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నాడని అదే కులానికి చెందిన పెద్ద మనుషులకు అనుమానం. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా, గురువారం రాత్రి శ్యాంరావు ప్రశాంత్‌పై ఇదే గ్రామానికి చెందిన ముస్కు దేవేందర్, ముస్కు చంద్రకాంత్, శ్యాంరావు చందు, రంగుల శివ, ముస్కు ప్రసాద్, ముస్కు శేఖర్, ముస్కు రాము, ముస్కు శ్రీనివాస్, ముస్కు రాజమౌళి, ప్రేమ్‌తో పాటు మరికొంతమంది వ్యక్తులు, కర్రలతోదాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ దాడిలో ప్రశాంత్ ఆస్పత్రిలో చేరాడని బాధితుడి తండ్రి శ్యాంరావు రఘు తెలిపాడు. ఇదిలా ఉండగా, కుల పెద్ద మనిషి రాజమౌళిపై శ్యాంరావు ప్రశాంత్, సాయిలు దాడి చేస్తున్నారని సమాచారం మేరకు అక్కడికి చేరినట్లు దొమ్మరికుల సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో దొమ్మరికుల సంఘానికి చెందిన ముగ్గురికి గాయాలైనట్లు వారు పేర్కొన్నారు. శ్యాంరావు ప్రశాంత్, అతని కుటుంబసభ్యుల నుంచి ప్రాణ హానీ ఉందని ఆ ఫిర్యాదులో వివరించారు. -
మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
రాయపూర్: దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. ఉమేష్ మర్కం గత కొంత కాలంగా 'గోప్నియా సైనిక్' (రహస్య పోలీసు ఇన్ఫార్మర్)గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన స్వగ్రామమైన కాటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటం గ్రామం నుంచి దంతెవాడ పట్టణానికి వెళ్తుండగా మావోయిస్టులు కొందరు మార్కంపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో మార్కం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.రాజధాని రాయ్‌పూర్‌కు 400 కి.మీ దూరంలో ఉన్న తేటమ్ గ్రామంలో గత ఏడాది పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులకు మద్దతు ఇవ్వడంలో మార్కం కీలకపాత్ర పోషించారు. గత సంవత్సరం డిసెంబర్లో నుంచి అతను 'గోప్నియా సైనిక్'గా పని చేయడం ప్రారంభించాడు. ఈ రహస్య ఇన్ఫార్మర్లను నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం, ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను సేకరించడం కోసం స్థానిక స్థాయిలో జిల్లా పోలీసులు నియమిస్తారు. నిందితుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: శ్రీకి లీలలు!!.. జన్ ధన్ అకౌంట్ల నుంచి 6వేల కోట్ల సొమ్ము మాయమైందన్న కుమారస్వామి -
ఇన్ఫార్మర్ నెపంతో హత్య
రాయగడ: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గ్రామ రక్షకుని మావోయిస్టులు హత్య చేసిన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో మనిగుడ సమితి టికరపడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు సంతోష్ దండసేన(27)గా పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపన వివరాల ప్రకారం... సాయుధలైన మావోయిస్టులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దండసేన ఇంటికి వెళ్లి, అతనిని బయటకు తీసుకు వెళ్లారు. ఊరికి కొంతదూరంలో అతనిని హత్య చేసి, మృతదేహం వద్ద ఒక పోస్టర్‌ను విడిచిపెట్టి వెళ్లారు. గ్రామ రక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న దండసేన గత కొన్నాళ్లుగా పోలీసులకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నాడని అందులో పేర్కొన్నారు. చదవండి: మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలే.. చివరికి గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులను కూడా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించాలని ప్రలోభ పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ మారకపోవడంతో హత్య చేయాల్సి వచ్చిందని వంశధార–గుముసుర–నాగావళి డివిజన్ కమిటీ పోస్టర్లో వివరించింది. ఎవరైనా ఈ తరహా వ్యవహారాలకు పాల్పడితే ఇదే దుస్థితి తప్పదని హెచ్చరించారు. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న మునిగుడ పోలీసులు.. టికరపొడ గ్రామానికి సమీపంలో మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టర్‌ను స్వాధీనం చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రోడ్డు లేని ఊరు.. దారేది బాబు..! -
ఇంట్లోకి దూరి కత్తులతో రియల్టర్ దారుణహత్య
బనశంకరి: నగరంలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో రియల్టర్ హత్యకు గురయ్యాడు. ఇట్టిమడు మెయిన్‌రోడ్డు బేకరి సమీపంలో మంజునాథ్ అలియాస్ దడియా మంజు (37) అనే రియల్ఎస్టేట్ వ్యాపారి నివసిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనిపై కత్తులు, కొడవళ్లతో తల, పొట్ట, ఇతర భాగాలపై నరికి చంపి ఉడాయించారు. ఇది తెలియగానే పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మంజునాద్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గానూ పనిచేసేవాడు. తమ గురించి ఖాకీలకు సమాచారం ఇస్తున్నాడని కక్షతో ఎవరైనా నేరగాళ్లు హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హంతకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో ఇట్టిమడు చుట్టుపక్కల భయాందోళన వ్యక్తమైంది. -
పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
జి.మాడుగుల: తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో ఆదిమజాతి గిరిజనుడిని (పీవీటీజీ) మావోయిస్టులు గొంతుకోసి హతమార్చారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వాకపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుడు గెమ్మెలి కృష్ణారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన ఇంటిలో కుటుంబంతో సహా నిద్రిస్తున్న సమయంలో సీపీఐ (మావోయిస్టు) పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 30మంది సాయుధులైన మావోయిస్టులు వచ్చి మాట్లాడి పంపుతామని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సమీప అంగన్వాడీ భవనం వద్ద అతి క్రూరంగా గొంతుకోసి హతమార్చారు. కృష్ణారావు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని, పోలీసులకు ఎప్పటికప్పుడు మావోల సమాచారం అందిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోనందునే హతమారుస్తున్నామని ఘటనా స్థలంలో విడిచివెళ్లిన లేఖలో పేర్కొన్నారు. మరికొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే వారికీ శిక్ష తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. కృష్ణారావు మృతదేహాన్ని నుర్మతి ఔట్‌పోస్టు పోలీసులు శవ పంచనామా నిమిత్తం అంబులెన్సులో తరలించారు. -
మన్యంలో మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని సింహాచలం ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించి గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జి.మాడుగుల మండలం వాక పల్లె గ్రామం సోమవారం జరిగింది. కృష్ణారావును హత్య చేసి మావోయిస్టులు అక్కడ ఒక లేఖనును వదిలి వెళ్లారు. ఏ పాపం ఎరుగని తన భర్తను ఈ తెల్లవారుజామున ఇంటి నుంచి ఇద్దరు మావోయిస్టులు లాక్కెళ్లి, చంపేశారని మృతుని భార్య భోరున విలపించింది. ముక్కుపచ్చలారని తన ముగ్గురు పిల్లలు, తాను అనాధగా మిగిలిపోయామని కన్నీరుమున్నీరైంది. కాగా, ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు హతమార్చిన గంటల వ్యవధిలోనే ఇన్ఫార్మర్ పేరిట గిరిజనుడిని హతమార్చడంతో మన్యంలో అలజడి మొదలైంది. పోలీసు ఇన్ఫార్మర్లుగా ఉంటూ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారని, కృష్ణారావు వైఖరిపై మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ఊచకోత
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్ తాలూకాలోని తాడ్‌గావ్ పోలీస్‌స్టేషన్ దగ్గర్లో మావోయిస్టులు ముగ్గురిని హత్య చేశారు. బాంబ్రాగాడ్ తాలూకా కసన్సూర్ గ్రామానికి చెందిన ఆరుగురిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో శుక్రవారం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ముగ్గురిని సోమవారం అర్ధరాత్రి దారుణంగా చంపి నడిరోడ్డుపై పడేశారు. ఘటనాస్థలిలో ఎర్రరంగు బ్యానర్లతోపాటు మావోల పేరుతో లేఖలను వదిలేశారు. గత ఏడాది ఏప్రిల్ 22న బాంబ్రాగాడ్ తాలూకా పరిధి బోరియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తాము చంపేసిన ఆ ముగ్గురు ఇన్ఫార్మర్ల కారణంగానే గత ఏప్రిల్‌లో మావోల జాడ పోలీసులకు తెలిసిందని, మావోల మరణానికి ఈ ముగ్గురు ఇన్ఫార్మర్లే కారణమని బ్యానర్లు, లేఖలో మావోలు పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన మిగతా ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యల నేపథ్యంలో కసన్సూర్ గ్రామంలో భయానకవాతావరణం నెలకొంది. -
పరిహారంలో ‘పచ్చ’పాతం!
సాక్షి, విశాఖపట్నం/పెదబయలు/కొయ్యూరు: మావోల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అడవిబిడ్డల కుటుంబాలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉద్యోగాలిస్తాం.. ఉపాధి కల్పిస్తాం.. ఆర్థికంగా ఆదుకుంటామని వారికి ఇస్తున్న హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని పోలీసు వ్యవస్థ వారిని ఇన్ఫార్మర్లుగా వాడుకుంటూ తమ లక్ష్యాలను సాధించుకుంటోందే తప్ప వారు మరణిస్తే ఆయా కుటుంబాలను మాత్రం ఆదుకోవడంలేదని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి మావోల కదలికలు, సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే వీరికి ప్రభుత్వం రిక్తహస్తమే చూపుతోంది. కొన్ని సందర్భాల్లో అరకొర సాయమే అందిస్తోంది. మరోవైపు.. తమ లక్ష్యం దెబ్బతింటోందన్న భావనతో మావోలు వీరిని దొరికినప్పుడల్లా పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మట్టుపెడుతుంటారు. వీరి కుటుంబాలను ఆదుకోవడంలో గత ప్రభుత్వాలతో పోలీస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పరిహారంపై విధివిధానాల్లేవు.. మావోల దాడుల్లో మృత్యువాతపడిన వారిలో ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతలేదు. పరిహారం, సాయంపై ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి విధివిధానాలు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారుతోంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు తమ వారైతే ఒకలా.. సామాన్యులైతే మరోలా వ్యవహరిస్తున్నాయి. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా చనిపోతే వారి హోదాలు, స్థాయిని బట్టి గతంలో రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకు చెల్లిస్తున్నారు. అదే సాధారణ పౌరులైతే ఐదు లక్షల వరకు పరిహారం.. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి చిన్నపాటి కొలువు ఇస్తున్నారు. 20 ఏళ్లలో 94 మంది మృత్యువాత 1998–2018 మధ్య ఏఒబీ పరిధిలో మొత్తం 89 ఘటనలు జరిగాయి. వీటిలో 94మంది అమాయక గిరిజన పౌరులు మావోల తూటాలకు బలయ్యారు. 2014కు ముందు వరకు ఇన్ఫార్మర్లు, సామాన్యులు చనిపోతే వారికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం మంజూరు చేసేవారు. కానీ, గడిచిన నాలుగున్నరేళ్లలో చనిపోయిన ఏ ఒక్కరికీ పరిహారం పంపిణీ చేయడమే కాదు కనీసం ప్రతిపాదనలు పంపిన దాఖలాలు కూడా లేవు. అంతేకాదు.. 2014కు ముందు చనిపోయిన వారికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం సైతం నేటికీ అందించలేని దుస్థితి నెలకొంది. గడిచిన నాలుగున్నరేళ్లలో ఏఒబీ పరిధిలో సుమారు 20 మందికి పైగా చనిపోతే ఇప్పటివరకు ఒక్కపైసా పరిహారం అందని పరిస్థితి నెలకొంది. వారికోలా.. వీరికోలా.. అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద గత నెల 23న మావోలు మట్టుబెట్టారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ ఉన్నతాధికారికి ఇవ్వనంత పరిహారం ఈ ఇరువురికీ ప్రభుత్వం ప్రకటించింది. కిడారి కుటుంబానికి రూ.1.20కోట్ల పరిహారంతో పాటు ఆయన చిన్న కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం, సోమ కుటుంబానికి రూ.1.05కోట్ల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇరువురికి విశాఖలో ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. ఉద్యోగాలు కాకుండా వీరివురురికి దాదాపు రూ.3కోట్లకు పైగా సాయం ప్రకటించడంపై విమర్శలు వచ్చినా ఎవరూ తప్పుపట్టలేదు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మృత్యువాతపడగానే అనూహ్యంగా స్పందించిన ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో మృతిచెందిన పోలీస్ ఇన్ఫార్మర్లు, ఇతరులపట్ల ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. వారికి కోట్లల్లో పరిహారం ఇస్తున్న ప్రభుత్వం వీరికి కనీసం లక్షల్లో కూడా పరిహారం ఇవ్వకపోతే ఎలా గిరిజన సంఘాల నేతలు నిలదీస్తున్నారు. మంజూరైనా పంపిణీకాని పరిహారం ఇదిలా ఉంటే.. 2013–14లో మావోల చేతిలో తొమ్మిది మంది ప్రాణాలొదిలారు. వారికి 2015లో రూ.27.8 లక్షలు విడుదలైంది. చింతపల్లి మండలం బలపం గ్రామానికి చెందిన గబ్బాడి చిట్టిదొరకు రూ.14లక్షలు, చీకటిమామిడి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావుకు రూ.40వేలు, జీకేవీధి మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన ఎం.మత్స్య రాజుకు రూ.1.25లక్షలు, కుంకుంపూడికి చెందిన కొర్రా సన్యాసిరావుకు రూ.2.25 లక్షలు, కొయ్యూరు మండలం ఎండకోట గ్రామానికి చెందిన ఎం.రాజుకు రూ.5 లక్షలు, రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన యలమంచలి రమణకు రూ.2.5 లక్షలు, జి.మాడుగులకు చెందిన సింహాచలానికి రూ.5లక్షలు విడుదలయ్యాయి. అలాగే, మైదాన ప్రాంతానికి చెంది ఏజెన్సీలో ఆస్తి నష్టం జరిగిన నర్సీపట్నానికి చెందిన పి.సుజాతకు రూ.5లక్షలు, ఏలూరుకు చెందిన గంటా శివప్రసాద్‌కు రూ.5లక్షలు విడుదలై బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. కానీ, నేటికీ ఈ పరిహారం పంపిణీకి నోచుకోలేదు. ఇక గడిచిన నాలుగున్నరేళ్లలో మృత్యువాతపడిన పోలీస్ ఇన్ఫార్మర్లు, ఇతరులకు ఒక్కపైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. మాజీ మంత్రికే అందని సాయం సామాన్యులకే కాదు.. టీడీపీకే చెందిన మాజీమంత్రి మత్స్యరాజ మణికుమారికే పరిహారం అందకపోవడం గమనార్హం. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 2003లో ఆమె భర్త వెంకట్రాజును మావోలు హతమార్చారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, మణికుమారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మణికుమారి పిల్లల్ని చదివించి వారికి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెకు ప్రకటించిన రూ.5లక్షల పరిహారం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇక పిల్లల్ని చదివించేందుకు ఆర్థిక సహాయం చేస్తానన్న మాట కూడా నీటిమూటగానే మిగిలింది. ఒక పాపకు మాత్రమే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.25వేల వరకు ఆర్థిక సహాయం చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాక్సైట్ తవ్వకాల కోసం టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో బాక్సైట్ గనులున్న జెర్రెల పంచాయతీ సర్పంచ్ సాగిన వెంకటరమణను మావోలు మట్టుబెట్టారు. ఆయన కుటుంబానికి నేటికీ సాయం అందలేదు. ఇలా చెప్పుకుంటూపోతే చాలామందే ఉన్నారు. కూలీపని చేసుకుని పిల్లల్ని పోషిస్తున్నాను ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరిపడ గ్రామానికి చెందిన నా భర్త పాంగి రామన్నను 2015లో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. అలాగే, మమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. నాకు ముగ్గురు సంతానం. ఊరికాని ఊరిలో వారిని పోషించడం చాలా కష్టంగా ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులు వంటపాత్రలు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం, పోలీసులు ఆదుకోవాలి. – పాంగి రాశి,పాంగి రామన్న భార్య పాతికేళ్లవుతున్నా అందని పరిహారం శరభన్నపాలేనికి చెందిన సుబ్బారావును మావోయిస్టులు 1994లో పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామంలో కాల్చి చంపేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతని భార్య కొండమ్మకు పైసా కూడా పరిహారం దక్కలేదు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల చుట్టూ ఆమె ఎన్నిసార్లు తిరిగినా ఇస్తామన్న రూ.ఐదు లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదు. వారసత్వ సర్టిఫికెట్లో తప్పు ఉందన్న కారణంతో జాప్యం చేస్తున్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో పోస్ట్‌మాస్టర్ హత్య
మల్కన్‌గిరి ఒరిస్సా : జిల్లాలోని చిత్రకొండ సమితి పప్పులూర్ పంచాయతీ కమల పొదర్ గ్రామంలో నివాసముంటున్న పోస్ట్‌మాస్టర్ నారాయణ పోలాకిని ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి కొంతమంది మావోయిస్టులు గ్రామానికి వచ్చి పోస్ట్‌మాస్టర్‌ను పిలిచి తమవెంట అడవిలోకి తీసుకువెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి నీవు పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నావు. గతంలో పలుమార్లు హెచ్చరించినా నీ ధోరణి మార్చుకోలేదు. అందుకే నీకు మరణదండన విధిస్తున్నామని చెప్పి కాల్చి చంపారు. గురువారం తెల్లవారు జామున పోస్ట్‌మాస్టర్ మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు. మృతదేహం పక్కన ఓ లేఖను కూడా మావోయిస్టులు విడిచిపెట్టారు. తెల్లవారిన తరువాత అటుగా వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచార మిచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అంతా పరిశీలించారు. పోస్ట్‌మాస్టర్ నారాయణ ఎటువంటి ఇన్ఫార్మర్ కాదు. మాకు ఎటువంటి సమాచారం అందించడం లేదు. ఇటువంటి అమాయకుల్ని హత్య చేస్తూ మావోయిస్టులు వారి ఉనికిని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నారని ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా ఈ సందర్భంగా అన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. -
ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి హత్య
జయపురం : ఒడిశా–ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులలో మావోయిస్టులు వారి కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి కాదు, మందుపాతరలు పెట్టి భద్రతా దళాలను ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్లను మావోయిస్టులు టార్గెట్ చేస్తూ పులువురిని హత మారుస్తుండగా కూంబింగ్ ఆపరేషన్లు, ఎన్కౌంటర్ల ద్వారా జవాన్లు మావోలను మట్టుపెడుతున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఫారెస్టు డిపోలను తగుల బెట్టడం, రోడ్లు వేయకుండా నిరోధించడంతో పాటు పోలీస్ ఇన్ఫార్మర్లుగా అనుమానించి ప్రజలను చంపుతున్నారు. అటువంటి సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమ జిల్లా దోరణపాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక యువకుడిని మావోయిస్టులు కొట్టి చంపారు. హత్యకు గురైన వ్యక్తిని దొరణపాయి పోలీస్‌స్టేషన్ పరిధి పూనమపల్లి గ్రామవాసి బంజమ సుజడగా గుర్తించారు. దాదాసు 15మంది నుంచి 20 మంది మావోయిస్టులు ఆ గ్రామానికి వచ్చి బంజమ సుజడను ఇంటినుంచి పిలిపించి ప్రజల సమక్షంలో పెట్టారు. అనంతరం పోలీస్ఇన్ఫార్మర్ అని ఆరోపించి కొట్టి చంపారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ముఖ్యంగా పోలీస్ఇన్ఫార్మర్లకు ఇదే గతి పడుతుందని గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చంచినట్లు సమాచారం. ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. -
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
తూర్పుగోదావరి, నెల్లిపాక (రంపచోడవరం): మావోయిస్టులకు కొరియర్‌గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తిని ఎటపాక మండల పరిధిలోని పిచుకలపాడు సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవివరాలను సోమవారం డీఎస్పీ దిలీప్‌కిరణ్, ఎటపాక సీఐ రవికుమార్ వెల్లడించారు. మావోయిస్టులకు సరుకులు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు చర్ల రోడ్డులోని పిచుకలపాడు టి.జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా బావనపల్లి పంచాయతీలోని ఎంవీ 59 గ్రామానికి చెందిన సంజిత్ మండల్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. అతడి వద్ద నుంచి 204.6 మీటర్ల ఆలీవ్‌గ్రీన్ యూనిఫాం క్లాత్, 50 మీటర్ల రెగ్జిన్ క్లాత్, రూ.68వేల నగదు, ద్విచక్రవాహనం, నాలుగు మావోయిస్టుల లెటర్‌హెడ్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సంజిత్ 2006 నుంచి మావోయిస్టులతో పరిచయాలు ఏర్పరచుకుని వారికి దుస్తులు, సామగ్రి చేరవేస్తున్నాడని, 2011లో మావోల వద్ద డబ్బులు తీసుకుని ల్యాండ్ మైన్స్ పెట్టడం, సామగ్రి కొని ఇవ్వటం వంటి కార్యకలాపాలు చేశాడని తెలిపారు. ఈనెల 25న విజయవాడలో మావోయిస్టులకు దుస్తులు, ఇతర సామగ్రి, కరపత్రాలు కొనుగోలు చేసి బీజాపూర్ జిల్లా అంపూర్ మావోయిస్టులకు తీసుకువెళుతుండగా ఎటపాక సీఐకి పట్టుబడినట్టు తెలిపారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ఒకరి హత్య
హైదరాబాద్: పోలీసులకు తమ రహస్యాలు చేరవేస్తూ.. ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనున్ని మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. సుమారు 50 మంది వరకు మావోయిస్టులు అతని ఇంటిని చుట్టుముట్టి ఇంట్లోనే దారుణంగా కాల్చిచంపారు. ఈ సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బందే పోలీస్‌స్టేషన్ పరిధిలోని తారేహుర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బబూల్ దాస్(40) ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడనే నెపంతో.. మావోయిస్టులు అతన్ని కాల్చి చంపారు. సంఘటన జరిగిన స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో బీఎస్ఎఫ్ క్యాంప్ ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో.. స్థానికులు తమ భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య
వేమనపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత తీరం వెంట మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని కాల్చి చంపారు. జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ధనోరా తాలూకా మర్దమిలేంగా గ్రామానికి చెందిన శరత్ కురస్‌మిలా(38)ను మూడు రోజుల క్రితం మావోయిస్టులు అపహరించుకుపోయారు. అతడిని బుధవారం రాత్రి కాల్చి చంపారు. మృతదేహాన్ని మల్లపోదూర్ కుక్కమెట్టా గ్రామాల మధ్యనున్నరోడ్డుపై పడవేశారు. పోలీస్ ఇన్‌ఫ్మార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే అతడిని హతమార్చినట్లు అక్కడ వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. వారం రోజుల అహెరి తాలూకా కాండ్లరాజారంలో ఆత్రం వెంకటేశ్ అనే గిరిజనుడిని కూడా ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు. -
లొంగిపోయిన మావోలకు రూ.35లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: లొంగిపోయిన నలుగురు మావోయిస్టులకు రూ.35 లక్షల రివార్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మావోయిస్టు కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు, కోల్‌కతాకు చెందిన భాస్కర్ చక్రవర్తి(45)కి రూ.20 లక్షలు, మధ్య జోనల్ కమిటీ సభ్యుడు కుశాల్ యాదవ్, అరవింద్ వర్మలకు చెరో రూ.5 లక్షల చొప్పున రివార్డును మంజూరు చేశారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు వారి అరెస్టుకు సహకరించిన ఇన్ఫార్మర్లకు నజరానాగా ఈ రివార్డును మంజూరు చేశారు. ఇటీవలే లొంగిపోయిన బుర్ర భాగ్య అరుణకు కూడా రూ.5 లక్షల రివార్డును ప్రకటించారు. -
ఇన్ఫార్మర్ నెపంతో ముగ్గురి హత్య
రాయ్‌పూర్: పోలీసులకు ఇన్ఫార్మర్ గా చేస్తున్నాడనే అనుమానంతో మావోయిస్టులు ముగ్గురు గ్రామస్తులను కాల్చి చంపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఏరియాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండగాన్ జిల్లాలో ఇద్దర్ని, కంకెర్ జిల్లాలో ఒకరిని హత్య చేశారు. వీరిలో ఇద్దరు కూడుర్ గ్రామానికి చెందిన బుద్రు, మంకుగా పోలీసులు గుర్తించారు. లలిత్ దుగ్గ అనే వ్యక్తిని తమకు మద్దతుగా పనిచేయలేదని క్రూరంగా కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య
సాలూరు: విజయనగరం జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన సాలూరు ఏజెన్సీలోని దొరలతాడివలస ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జాకరవలసకు చెందిన కూతూడి వెంకట్రావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
గుండూరావు చేసిన తప్పేంటి?
మావోయిస్టులకు కుటుంబ సభ్యుల సూటి ప్రశ్న గూడెంకొత్తవీధి: ముక్కలి గుండూరావును మావోయిస్టులు ఎందుకు హతమార్చారో తమకు స్పష్టం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల శ్రేయస్సు కోసమే ఉద్యమాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మావోయిస్టులు అన్యాయంగా గిరిజనులను చంపడం ఎంతవరకు న్యాయమని మృతుడి భార్య చంద్రకళ, సోదరి బేబి ప్రశ్నించారు. జీకేవీధి గ్రామానికి చెందిన సత్యనారాయణ (గుండూరావు)ను ఆదివారం రాత్రి కుంకంపూడి వద్ద మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు మారుమూల గ్రామాల్లో తిరుగుతూ వ్యాపార లావాదేవీలు కొనసాగించిన గుండూరావుకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ముప్పు కలగలేదని, అనుకోకుండా పోలీస్ ఇన్ఫార్మర్ ముద్రవేసి చంపడం అన్యాయమన్నారు. ఆయన నిజంగా ఇన్ఫార్మర్ అయితే ఆయన కారణంగా మావోయిస్టులు ఎలా నష్టపోయారో వెల్లడించాలని కోరారు. చెప్పుడు మాటలు విని చంపడం, తరువాత ఇన్ఫార్మర్గా చిత్రీకరించడం తగదన్నారు. మావోయిస్టులు ఎన్ని సార్లు హెచ్చరించినా భయపడకుండా సమాధానం చెప్పుకుని ఇక్కడే జీవించారే తప్ప ఎక్కడికీ వెళ్లిపోలేదని, ఏ తప్పు చేయలేదు కాబట్టే భయపడకుండా ఇక్కడ ఉన్నారని స్పష్టంచేశారు. ఏజెన్సీలో వ్యాపారం చేసేవారంతా ఏదో ఒక సందర్భంలో పోలీసులతో మాట్లాడుతారని, అంత మాత్రాన వారందరిపైనా ఇన్ఫార్మర్ల ముద్రవేసి చంపేస్తారా అని వారు ప్రశ్నించారు. ఏ పాపం చేయని గుండూరావును అన్యాయంగా చంపారని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం
ఒడిశా : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని పనసపుట్టి గ్రామంలో ఇన్ఫార్మర్గా పని చేస్తున్నారనే నెపంతో ఒకరిని హతమార్చారు. పనసపుట్టి గ్రామానికి చెందిన వ్యక్తి... తమ కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తున్నాడని... అందువల్లే అతడిని హతమార్చినట్లు ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టారు. -
ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం
ఒడిశా: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని బొరిగి గ్రామంలో ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నారనే నెపంతో ఒకరిని హతమార్చారు. స్థానిక గ్రామానికి చెందిన నచ్ మూలి ఆదివాసి సంఘంనేత నాచక రోలిని శుక్రవారం మావోయిస్టులు కాల్చి చంపారు. మృత దేహం వద్ద శ్రీకాకుళం- కోరాపుట్ ఎవోబీ కార్యదర్శి దయ పేరుతో లేఖను వదిలి వెళ్లారు. మావోయిస్టు కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తున్నాడని హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
జి.మాడుగుల: విశాఖజిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. జి.మాడుగుల మండలం మడతకొండ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు.. ఓ గిరిజనుడిని పట్టుకుని కొట్టి చంపేశారు. మృతుని వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత
ఇన్ ఫార్మర్ నెపంతో దొంబూరు సొగుడియా అనే గిరజడుని మావోయిస్టులు కాల్చిచంపారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈనెల 16న గ్రామంలోకి వచ్చిన మావోయిస్టులు సొగుడియా, సోమామడి లను వెంట తీసుకువెళ్లారు. కాగా.. వీరిలో సొగుడియా ను మావోయిస్టులు కాల్చి చంపారు. మరో గిరిజనుడు సోమామడి తప్పించుకు పారిపోయాడు. -
యువకుడి గొంతు కోసి చంపిన మావోయిస్టులు
కరీంనగర్: పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నావంటూ మావోయిస్టులు ఓ యువకుడ్ని హతమార్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఈటపల్లి తాలూకా గట్ట గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు ఉమేష్ (33) అనే యువకుడిని గొంతు కోసి హతమార్చారు. పద్ధతి మార్చుకోవాలని పది సార్లు హెచ్చరించినా వినకపోవడం వల్లే ఉమేష్‌ను చంపినట్టు మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. -
కానిస్టేబుల్‌పై స్మగ్లర్ల దాడి
తిరుపతి : అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ పై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బీఎన్.కండ్రిగ మండలం పదో మైలు వద్ద సోమవారం జరిగింది. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ దయాళ్‌తోపాటు ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ పదో మైలు వద్ద వేచి ఉన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న స్మగ్లర్లు రెండు వాహనాలలో వచ్చి వీరిపై దాడికి పాల్పడ్డారు. స్మగ్లర్లు కత్తులతో దాడి చేయడంతో ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ తలకు తీవ్రగాయం అయింది. స్మగ్లర్ల దాడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారిరువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఏవోబీలో అలజడి
మావోయిస్టులచే ఇద్దరు గిరిజనుల అపహరణ గొబ్బరిపడాలో ముగ్గురి ఇళ్లు ధ్వంసం ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురికి దేహశుద్ధి 28 నుంచి వారోత్సవాలతోఅంతటా భయాందోళనలు పాడేరు/ముంచంగిపుట్టు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అలజడి చోటుచేసుకుంది. సరిహద్దుల్లో కొంతకాలంగా స్దబ్దుగా ఉన్న మావోయిస్టులు శనివారం వేకువజామున తమ ఉనికిని చాటుకున్నారు. ఈ నెల 28 నుంచి జరిగే వారోత్సవాలకు ముందు ఈ ఘటనతో ఏక్షణాన ఏమి జరగుతుందోనని గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత నెల 20న ఎన్కౌటర్లో దళసభ్యుడు మృతి చెందినప్పటి నుంచి మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. దీనిని ఎదురుదెబ్బగా భావించిన వారు ఇటీవల నిరసన వారోత్సవలను 30 గ్రామాల గిరిజనులతో సరిహుద్దులో విజయవంతంగా నిర్వహించారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరిపడాలో ఐదు కుటుంబాలకు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మూడు కుటుంబాలవారు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా శనివారం వేకువజామున పాంగిరామన్న, పాంగిదోబులను అపహరించుకుపోయారు. వంతాల జీనబంధుకు చెందిన ఇంటిని బాంబు వేసి నేల మట్టం చేశారు. వంతాల లైకోన్, పాంగి రామన్నల ఇళ్లను ధ్వంసం చేశారు. వంతాల సోనియాకు చెందిన ఇంటిపై కిరోసిన్ పోసి తగులబెడుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వంతాలసాధురాంతో పాటు పలువురు గిరిజనులకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ ఘటనలో సుమారు 100 మంది సాయుధ మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. పోలీసుల ఆదేశాలతో ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి గత నెల 20న మావోయిస్టు మృతదేహాన్ని మోసుకు వెళ్లిన గిరిజనుల గురించి కూడా మావోయిస్టులు గాలిస్తున్నట్టు తెలియడంతో ఈ ప్రాంతంలోనివారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అంతకు ముందు ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు లింగేటి పంచాయతీ మొయ్యిల గుమ్మి వద్ద రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు మన్యంలో నిఘా పెంచారు. పెద్ద ఎత్తున కూంబింగ్ జరుపుతున్నారు. ఈ తరుణంలో మావోయిస్టులు గొబ్బరిపడ గ్రామంపై దాడి చేయడంతో మారుమూల గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమరవీరులైన దళసభ్యులకు నివాళులర్పించడానికి స్తూపాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏ డాది కాలంలో ఏజెన్సీలోని బలపం వద్ద శరత్, గణపతి, మల్కన్‌గిరి క్యాడర్‌కు చెందిన సోను, వాలీ, జైరాజ్‌లు వేర్వేరు ఘటనల్లో మృతి చెందారు. వీరికి నివాళులు అర్పించడం, అమరవీరుల సంస్మరణ వా రోత్సవాలను ఏవోబీలో విజయవంతానికి వ్యూహాత్మకంగా వారు ముందుకు సాగుతున్నట్టుతెలుస్తోంది. భయాందోళనలు చెందొద్దు: ఏఎస్పీ మావోయిస్టుల కార్యకలాపాలతో పోలీసు పార్టీలను అప్రమత్తం చేశామని, మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్ విస్తృతం చేస్తున్నట్లు ఏఎస్పీ అట్టాడ బా బూజీ తెలిపారు. గిరిజనులు ఎటువంటి భయాందోళనలకు లోను కావద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెంచామని, మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారం నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల్లో మావోయిస్టు పోస్టర్లు జి.మాడుగుల: అమరవీరుల సంస్మరణ వారాన్ని ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గ్రామాగ్రామాన విప్లవ సంప్రదాయాలతో జరుపుకుందామంటూ సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ పిలుపునిచ్చింది. అమరులైన దళసభ్యుల ఆశయ సాధన కోసం తుదికంటా పోరాడాలంటూ మండలంలోని మారుమూల రోలంగిపుట్టు, లువ్వాసింగి, సంగులోయ, వంచేబు తదితర గ్రామాల్లో మావోయిస్టుల బ్యానర్లు, వాల్‌పోస్టర్లు శనివారం తెల్లవారుజామున వెలిశాయి. దీంతో గిరిజన గ్రామాల్లో ఒక్కసారిగా అలజడి చోటుచేసుకుంది. ప్రజా వీరులు కామ్రేడ్ శరత్, లాలు, గణపతి, జోగల్, సోనులకు జోహార్లు, మన్యం ప్రజల బాక్సైట్ పోరాటం వృథా కాదు అంటూ బ్యానర్లు, వాల్ పోస్టర్లలో పెదబయలు ఏరియా కమిటీ పేర్కోంది. -
ఇన్ఫార్మర్ నెపంతో సేల్స్‌మెన్‌ను హతమార్చారు
సుక్మా(ఛత్తీస్‌గఢ్): సేల్స్‌మెన్‌గా జీవనం సాగిస్తున్న యువకున్ని..ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లోలోని దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కర్రిగుండం గ్రామానికి చెందిన చంద్రకుమార్‌ను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు. -
ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి కిడ్నాప్...హత్య
చర్ల(ఖమ్మం జిల్లా) : ఇన్ఫార్మర్ నెపంతో వెంకటాపురం మండలానికి చెందిన ఓ గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు. మృతదేహాన్ని ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని ఉంజుపల్లి సమీపంలో పడవేశారు. వెంకటాపురం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుర్సం బాలకృష్ణ (35)తో పాటు అదే గ్రామానికి చెందిన మడకం రామకృష్ణను మావోయిస్టులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. విచారించిన మావోయిస్టులు బాలకృష్ణను హతమార్చి మృతదేహాన్ని ఆదివారం తెల్లవారుజామున చర్ల మండలంలోని ఉంజుపల్లి- వద్దిపేట మార్గంమధ్యలో రోడ్డుపై పడవేశారు. ఆదివారం ఉదయం పూసుగుప్ప, వద్దిపేట గ్రామాల నుంచి చర్ల సంతకు వస్తున్న గిరిజనులు మృతదేహాన్ని గమనించి మీడియాకు సమాచారం ఇచ్చారు. లక్ష్మీపురానికి చెందిన కుర్సం బాలకృష్ణకు పోలీసులు రూ.లక్ష ఆశచూపి ఇన్ఫార్మర్గా వాడుకుంటున్నారని మావోయిస్టులు మృతదేహం వద్ద వదిలివేసిన లేఖలో పేర్కొన్నారు. వారంతపు సంతకు వచ్చే సంఘం నాయకులు, ప్రజలను బాలకృష్ణ పోలీసులకు పట్టించి కొట్టిస్తున్నాడని మావోలు లేఖలో తెలిపారు. ప్రజాకోర్టు నిర్ణయం మేరకు హతమార్చినట్లు వివరించారు. ఘటనా స్థలి నుంచి చర్లకు మృతదేహాన్ని తెప్పించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య
ఖమ్మం: పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు హతమార్చారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి తీసుకెళ్లి చర్ల మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో పసుపుగుప్ప అటవీ ప్రాంతంలో హతమర్చారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులుపోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం
చింతపల్లిరూరల్ : మావోయిస్టు కార్యకలాపాలకు గిరిజనులంతా దూరంగా ఉండాలని డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం అన్నవరం వారపుసంతలో మావోయిస్టు వ్యతిరేక వాల్‌పోస్టర్లను విస్తృతంగా అతికించారు. అన్నం పెట్టిన గిరిజన కుటుంబాలనే అంతమొందిస్తున్న మావోయిస్టులకు ఇకనైనా ఆశ్రయం ఇవ్వకుండా బహిష్కరించాలని సూచిం చారు. మావోయిస్టు తమ ఉనికి చాటుకునేందుకు పోలీసు ఇన్ఫార్మర్ల పేరిట గిరిజనులను హత్య చేస్తున్నారన్నారు. ఈ సంస్కృతిపై గిరిజన యువత, విద్యార్థులు, గ్రామపెద్దలు ఆలోచించాలన్నారు. సీఐ ప్రసాద్, అన్నవరం ఎస్సై ఉమా మహేశ్వరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మన్యంలో మళ్లీ అలజడి
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత మృతుడు మాజీ ఎల్జీఎస్ కమాండర్ నరేష్ ఇన్ఫార్మర్ కాదు : భార్య మావోయిస్టులు మళ్లీ పెట్రేగారు. ఇన్ఫార్మర్ నెపంతో మాజీ మావోయిస్టును చంపి పోలీసులకు సవాల్ విసిరారు. విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ సంఘటనతో మన్యంలో మళ్లీ అలజడి రేగింది. కొయ్యూరు: విశాఖ మన్యంలో పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట మావోయిస్టులు ఓ గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపారు. గతంలో దళంలో పనిచేసి లొంగిపోయిన మువ్వల లచ్చి అలియాస్ లక్ష్మణరావు అలియాస్ నరేష్(25)ను తూర్పు గోదావరి విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన జంగాలతోట సమీపంలో శనివారం తెల్లవారుజామున గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు నేతలు ఆజాద్, ఆనంద్ మరో నలుగురు కలిసి కాల్చి చంపా రు. నరేష్ ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌లో చేరి ప్రజలకు అన్యాయం చేయడంతో హతమార్చినట్లు మావోయిస్టులు అక్కడ వదిలిన లేఖలో పేర్కొన్నారు. నరేష్ నేపథ్యం యు.చీడిపాలెం పంచాయతీ ఎండకోటకు చెందిన మువ్వల నరేష్ 2001లో మావోయిస్టుల్లో చేరి 2005 వరకు పనిచేశాడు. తర్వాత ఏరియా కమిటీ సభ్యునిగా, పలకజీడి ఏరియా కమిటీకీ కమాండర్‌గా పనిచేశారు. 2006లో కాకినాడలో లొంగిపోయాడు. 2007లో ధారకొండలో పదవ తరగతి వరకు చదివాడు. అది పూర్తయిన వెంటనే ఎండకోట వచ్చి వ్యవసాయం చేసేవాడు. 2009 వరకు ఎండకోటలో ఉన్న నరేష్ మావోయిస్టుల నుంచి ఇబ్బందులు వస్తాయని వై.రామవర ం వెళ్లిపోయాడు. తర్వాత పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారని అనుమానించిన మావోయిస్టులు వారి హిట్ జాబితాలో చేర్చారు. సంఘటన ఎలా జరిగిందంటే! : వై.రామవరంలో మకాం పెట్టిన నరేష్ జీవన భృతి కోసం కొంతకాలంగా రోజ్‌వుడ్, నేరేడు కలప ముక్కలను కొయ్యూరు సంతలో విక్రయిస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో నరేష్ బుధవారం ఈ కలప కోసం వేమపాలెం వచ్చాడు. నరేష్ వేమపాలెంలో ఉన్నారని తెలుసుకున్న మావోయిస్టులు ఆ ఇంటిని శుక్రవారం అర్ధరాత్రి చుట్టుముట్టారు. ఇంటి తలుపుకొట్టి నరేష్ వద్ద ఉన్న సెల్ఫోన్లు ఇవ్వాలంటూ అడిగారు. లేవని చెప్పడంతో నరేష్‌ను వారి వెంట తీసుకెళ్లారు. నరేష్ మావయ్య రామారావు అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో నరేష్‌ను వేమపాలేనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలతోట వద్దకు తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. నా భర్త ఇన్ ఫార్మర్ కాదు: మావోయిస్టులు తన భర్త నరేష్‌ను అన్యాయంగా చంపేశారని భార్య హేమలత బోరుమని రోదిస్తోంది. ఆమె తమ రెండేళ్ల కూతురు రోజాను విలేకరులకు చూపిస్తూ కన్నీరుమున్నీరయింది. వై.రామవరంలో కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నామని చెప్పింది. కుటుంబం గడవడం కష్టం కావడంతో నరేష్ ప్రతి శనివారం కొయ్యూరుకు కలప ముక్కలు తీసుకెళ్లి విక్రయించి, సరకులు తెస్తారని పేర్కొంది. నరేష్ అంటే గిట్టని ఎండకోట, ఈదులబందతో పాటు మరో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన తప్పుడు సమాచారం నమ్మి మావోయిస్టులు హతమార్చారని వాపోయింది. నరేష్ మృతదేహం వద్ద తండ్రి అప్పారావు, తల్లి లచ్చి బోరున విలపించారు. ఏ తప్పూ చేయని తమ బిడ్డ ఉసురు తీసేశారని బోరుమన్నారు. -
బాలకృష్ణను 21నే చంపేశారు
కిల్లంకోటలో ప్రజాకోర్టు ఇన్ఫార్మర్గా తేల్చి ఘాతుకం పాడేరు: మావోయిస్టుల ఘాతుకానికి బలైన మరో గిరిజనుడు బాలకృష్ణ గురువారమే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరించారనే ఆరోపణలతోనే జి.మాడుగుల మండలం కిల్లంకోట కాలనీ గ్రామానికి చెందిన బచ్చెలి బాలకృష్ణ (40)ను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రజాకోర్టులో బాలకృష్ణను మావోయిస్టు దళసభ్యులు గొడ్డలితో నరికి చంపారు. బాలకృష్ణ కిల్లంకోట గ్రామంలో నివాసం ఉన్నప్పటికి పంట భూములన్నీ లువ్వాసింగి పంచాయతీ మానేపల్లి గ్రామంలో ఉండటంతో గత 2 నెలలుగా భార్య పద్మకుమారితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం మావోయిస్టు దళ సభ్యులు 15 మంది మానేపల్లిలో ఉన్న బాలకృష్ణను కిల్లంకోట కాలనీ వరకు తీసుకు వచ్చారు. ఆ రాత్రంతా బాలకృష్ణను విచారించిన దళ సభ్యులు మరుసటిరోజు అదే ప్రాంతంలో ప్రజా కోర్టును కూడా నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రజాకోర్టులో బాలకృష్ణను పోలీస్ ఇన్ఫార్మర్గా పేర్కొంటూ దళ సభ్యులు అనేక ఆరోపణలు చేశారు. గతంలో జి.మాడుగుల ఎస్ఐగా పని చేసిన ప్రసాద్, కిల్లంకోట ప్రాంతంలో పర్యటించిన రోజున అతనికి బాలకృష్ణ అంబలి ఇచ్చాడని, మరోసారి ఈ దారిలో కూంబింగ్‌కు వెళుతున్న ఎస్ఐకి, పోలీసులకు దారి చూపాడని ఆరోపించారు. అలాగే ప్రతివారం జి.మాడుగుల వెళ్ళి మావోయిస్టు పార్టీ సమాచారం చేరవేస్తున్నాడని బాలకృష్ణపై మావోయిస్టులు మండిపడ్డారు. బాలకృష్ణ సంజాయిషీ ఇచ్చినప్పటికి మావోయిస్టులు నమ్మలేదు. దళ సభ్యులు కాళ్లు, చేతులు కట్టి ప్రజాకోర్టులోనే గురువారం రాత్రి బాలకృష్ణ మెడపై గొడ్డలితో నరికి హతమార్చారు. దాంతో ప్రజాకోర్టుకు వచ్చిన గిరిజనులంతా పరుగులు తీశారు. మారుమూల ప్రాంతం కావడంతో ఈ హత్యా సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడికి భార్య పద్మకుమారితోపాటు ప్రభాకర్ (16), భవాని (14), విజయ్‌కుమార్ (12), సీత (07) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. బాలకృష్ణను చంపేశారనే సమాచారం అందుకున్న భార్య పద్మకుమారి, పిల్లలు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. అయితే జి.మాడుగుల పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలిసింది. పైగా మృతదేహం దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. ఈ సంఘటనతో కిల్లంకోట పంచాయతీలోని అన్ని గ్రామాల్లోను భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నా యి. సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా బైటకు చెప్పేందుకు గిరిజనులు భయపడుతున్నారు. వీఆర్వో పోలీసులకు శనివారం సమాచారం ఇవ్వడంతో బాలకృష్ణ మృతదేహాన్ని పాడేరు ఆస్పత్రికి తరలించి శవపరీక్ష జరిపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పట్టుకోసం..
పార్వతీపురం : పార్వతీపురం ప్రాంతానికి కూత వేటు దూరంలో ఉన్న ఏఓబీలో గతంలో తమకున్న పట్టు సాధించడం కోసం మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 3వరకు వారోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఏఓబీలోని గిరిజన గ్రామాల్లో ఊరూరా వారోత్సవాలను నిర్వహించి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా గత శనివారం రాత్రి ఇన్ఫార్మర్ నెపంతో కొరాపుట్ జిల్లా, బంధుగాం బ్లాక్ సమీపంలోని దశిని గ్రామానికి చెందిన కడ్రక కోమన్న(50)ను గొడ్డలితో నరికి చంపి మావోయిస్టులు వారి ఉనికిని తెలియజేశారు. కొంతకాలం క్రితం పార్వతీపురం సబ్-ప్లాన్ మండలాలైన కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, కురుపాం, జియ్యమ్మవలస, మక్కువ, పాచిపెంట, సాలూరు తదితర ప్రాంతాలలోని గిరిశిఖర గ్రామాలతోపాటు వాటి సమీపంలోని ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. పలుమార్లు కూనేరు, గుమడ రైల్వే స్టేషన్ల పేల్చివేత, మక్కువ సెల్‌టవర్ పేల్చివేత, కొమరాడ, కూనేరు సమీపంలో పోస్టర్లు అతికించడం, పలువురిని ఇన్ఫార్మర్ల పేరుతో హతమార్చడం వంటి సంఘటనలు జరిగాయి. అయితే ఆంధ్రాలో మావోయిస్టుల కార్యకలాపాల పట్ల పోలీసు యంత్రాంగం గట్టిగా స్పందించి చేపట్టిన విస్తృత కూంబింగ్ ఫలితంగా దాదాపు ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలికిడి లేకుండా పోయింది. ఇటీవల గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, కొమరాడ మండలాల్లో ఒడిశాకు దగ్గర్లో ఉన్న ప్రాంతాలలో మావోయిస్టుల అలికిడి ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఈ నెల 28 నుంచి మావోయిస్టులు ఆయా ప్రాంతాలలో గిరిజనులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు, ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సర్కారు చేపడుతున్న ప్రజావ్యతిరేక చర్యలు, గిరిజనాభివృద్ధికి కానరాని స్పందన పట్ల వారోత్సవాల్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తెస్తున్నట్లు సమాచారం. ఈ వారోత్సవాలకు మావోయిస్టుల కేంద్ర, రాష్ట్ర కమిటీలతో పాటు కొరాపుట్, శ్రీకాకుళం, ఒడిశా, తదితర డివిజన్లకు చెందిన నాయకులు ప్రత్యక్షంగా పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేస్తున్నట్లు వినికిడి. ఒకవైపు మావోయిస్టులను ఏరివేసే పనిలో ఎస్బి ఎక్స్, క్యాట్‌పార్టీ, ఎస్టీఎఫ్, గ్రేహాండ్స్ తదితర పోలీసు విభాగాలు నిరంతరం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ మావోయిస్టులు మాత్రం వారోత్సవాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మావోయిస్టుల వారోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, చైతన్య ఉపన్యాసాలు, మరో వైపు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల బూట్ల చప్పుళ్లతో తుపాను ముందు నెలకొన్న వాతావరణంలా అడవి తల్లి గంభీరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోనున్నాయోనని ఏఓబీలోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. -
ఏఓబీలో మళ్లీ మావోయిస్టుల
పార్వతీపురం : కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ ప్రాంతంలో మళ్లీ మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఇన్ఫార్మర్ నెపంతో శనివా రం రాత్రి కొరాపుట్ జిల్లా, బంధుగాం బ్లాక్ సమీపంలోని దశిని గ్రామానికి చెందిన కడ్రక కోమన్న(50)ను గొడ్డలితో నరికి చంపేశారు. దీంతో సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరో పక్క సోమవారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమర వీరుల సంస్మరణ వారాన్ని పాటించాలని మావోయిస్టులు పిలుపుని చ్చారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని జిల్లాలోని ఏజెన్సీ మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టుల ఘటనకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు అందించిన సమాచారం ఇలా ఉంది... సుమారు 13 మంది సాయిధులైన మావోయిస్టులు శనివారం రాత్రి దశిని గ్రామానికి చేరుకుని కోమన్నను పిలిచి, గ్రామానికి సమీపంలో ఉన్న రోడ్డుపైకి తీసుకెళ్లి గొడ్డలితో నరికి హత్య చేశారు. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తూ ప్రజలకు, పార్టీకి, ప్రజాయుద్ధానికి ఆటంకంగా ఉన్నందుకే కోమన్నను ఖతం చేశామని సంఘటన స్థలంలో సీపీఐ(మావోయిస్టు) శ్రీకాకుళం-కొరాపుట్ డివిజన్ కార్యదర్శి దయ పేరుతో వదిలివెళ్లిన లేఖల్లో తెలుగు, ఒడియా భాషల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు హార్టీకల్చర్ భవనాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై మృతుని కుమారుడు కడ్రక సోమేష పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. బీఎస్ఎఫ్ బలగాలు నివాసముంటున్న ప్రాంతానికి రెండు కిమీ దూరంలో ఈ సంఘటన జరిగింది. ఉలిక్కిపడిన ఆంధ్రా ప్రాంతం... ఆంధ్రాకు కూత వేటు దూరంలో ఉన్న బంధుగాం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన పట్ల ఒడిశాకు సరిహద్దుగా ఉన్న పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట తదితర మండలాలకు చెందిన పలు గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ చర్య చోటు చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
సరిహద్దులో ఉద్రిక్తత
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనుల హతం వారోత్సవాలకు భయాందోళనలు సీలేరు : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఎల్జీఏ వారోత్సవాల ప్రారంభానికి ముందు మావోయిస్టులు తెగబడ్డారు. ఒక్కసారిగా మన్యంలో వాతావరణం వేడెక్కింది. సరిహద్దులోని ఒడిశా మల్కన్‌గిరిజిల్లా సలిమెల పోలీసు స్టేషన్ పరిధి గొర్రెగుడకు చెందిన ఇద్దరు గిరిజనులను పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో దళసభ్యులు హతమార్చారు. శుక్రవారం మధ్యాహ్నం సాయుధు మావోయిస్టులు గ్రామంలోకి వచ్చి దొంగ మడకాని, దెబొ మడకానిల గురించి ఆరాతీశారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఇద్దరినీ చంపారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సంఘటనా స్థలంలో ఓ లేఖ వదిలి వెళ్లారు. ఈ నెల 28 నుంచి వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒడిశా, ఆంధ్ర పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే వందలాది మంది గ్రేహాండ్స్, బీఎస్ఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటనతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ అనుమానితులను ఆరాతీస్తున్నారు. ప్రజా ప్రతినిధులు మైదానానికి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సీలేరులో ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆధార్ సిబ్బంది కిడ్నాప్ సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మరిగట్టు పంచాయతీలో ఆధార్ నమోదు సిబ్బందిని 15 మంది మావోయిస్టులు అడ్డగించి కిడ్నాప్ చేశారు. 7 గంటలపాటు నిర్బంధించి అనేక అంశాలను వారితో చర్చించారు. అనంతరం వారి వద్ద ఉన్న 3 ల్యాప్‌టాప్‌లు, 2 ప్రింటర్లను లాక్కుని కొంత దూరం తీసుకొచ్చి వదిలి వెళ్ళారు. అనంతరం ఆధార్ సిబ్బంది కాలిబాటన కలిమెల హెడ్ క్వార్టర్స్‌కు చేరుకొన్నారు. -
సైకో జయ శంకర్ చిక్కాడు
ఐదు రోజుల పాటు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సైకో జయ శంకర్ ఎట్టకేలకు చిక్కాడు. ఎక్కడో కాదు పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలోని కూడ్లు చెరువు పక్కనే ఉన్న ఓ చిన్న గుడిసెలో ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరు, న్యూస్‌లైన్ : పలు కేసుల్లో సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవిస్తూ తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ అలియాస్ శంకర్‌ను ఓ ఫోన్ కాల్ పట్టిచ్చింది. దీంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు-హొసూరు రోడ్డులోని కూడ్లు గేట్ సమీపంలో చెరువు దగ్గర ఉన్న చిన్న గుడిసెలో అతనిని శుక్రవారం ఉదయం 10.45 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ రహస్య ప్రాంతానికి తరలించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ మాట్లాడుతూ... ‘తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన జయ శంకర్ మీద ఆ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో అనేక హత్యలు, లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు డ్రైవర్‌గా పని చేసే వాడు. ఈ నెల 1న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. బెంగళూరు నగర, బెంగళూరు సీసీబీ, చిత్రదుర్గ, శిర, బిజాపురలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఐదు ప్రత్యేకృబందాలు ఇతని కోసం గాలించాయి. ఇతని ఆచూకీ కోసం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పది వేల పోస్టర్లను అతికించారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళం భాషలలో 75 వేల కరపత్రాలు ముద్రించి పంచి పెట్టారు. ఎట్టకేలకు కూడ్లు గేట్ వద్ద పట్టుబడ్డాడు’ అని వివరించారు. జయ శంకర్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపారు. జైలు నుంచి అతను 30 అడుగుల గోడ దూకడానికి గ్లౌజ్‌లు, దుప్పటి ఉపయోగించాడని చెప్పారు. జయశంకర్ తప్పించుకోవడానికి ఎవరు సహకరించారని అడిగినప్పుడు, దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇన్ఫార్మర్ పేరు చెప్పడానికి నిరాకరించారు. ఇన్ఫార్మర్కు తాము ఒక మొబైల్ ఇచ్చామని చెప్పారు. జయ శంకర్ నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, అదే రోజు జైలులోని గార్డెన్లో ఆ తాళం చిక్కిందని వివరించారు. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. శంకర్ పోలీసు దుస్తులలో పారిపోలేదని, నైట్ డ్రెస్‌లో తప్పించుకున్నాడని తెలిపారు. అదే డ్రెస్‌తో శుక్రవారం పట్టుబడ్డారని అన్నారు. పోలీసులకు అభినందనలు.... మంత్రి జార్జ్ బెంగళూరు పోలీసులు సమర్థంగా పని చేశారని, అందువల్లే శంకర్ చిక్కాడని హోం మంత్రి జార్జ్ తెలిపారు. శంకర్ తప్పించుకోవడానికి జైలు సిబ్బంది సహకరించారని వెలుగు చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు అందిస్తామని తెలిపారు. రూ.100 ఇచ్చి నీరు, భోజనం కావాలన్నాడు: నరేంద్ర పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలో కూడ్లు చెరువు ఉంది. కూడ్లు గేట్ కూడా సమీపంలోనే ఉంది. చేపలు పట్టేవారు చెరువు పక్కన చిన్న గుడిసె వేసుకున్నారు. చేపలు తగ్గిపోవడంతో ఆరు నెలల నుంచి ఆ గుడిసెలో ఎవరూ ఉండడం లేదు. గుడిసెకు కనీసం తలుపులేదు. శుక్రవారం ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న నరేంద్ర, బాబు తదితరులు అటువైపు వెళ్లారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న శంకర్ తాగడానికి నీళ్లు కావాలని, ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేశాడు. అక్కడికెళ్లి ఇక్కడెందుకున్నావని వారు ప్రశ్నించగా, తాను తమిళనాడుకు చెందిన డ్రైవర్‌నని, ప్రమాదం జరగడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తప్పించుకుని వచ్చానని చెప్పాడు. కాళ్లు, చేతులకు గాయాలుండడంతో వారూ నిజమనుకున్నారు. వారికి రూ.100 నోటు ఇచ్చి భోజనం తెచ్చివ్వాలని కోరాడు. అదే సమయంలో బనశంకరిలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేయాలనడంతో బాబు అతనికి మొబైల్ ఇచ్చాడు. తర్వాత బాబు భోజనం తీసుకురావడానికి వెళ్లాడు. ఐదే నిమిషాల్లో పోలీసులు వచ్చి గుడిసెలోకి చొరబడిఅతని కాళ్లు, చేతులు కట్టి వేశారని నరేంద్ర మీడియాకు చెప్పాడు. తరువాత అతను సైకో శంకర్ అని తమకు తెలిసిందన్నాడు. ఆరు జీపులలో పోలీసులు వచ్చి శంకర్‌ను తీసుకు వెళ్లారని నరేంద్ర వివరించాడు.