చర్ల(ఖమ్మం జిల్లా) : ఇన్‌ఫార్మర్ నెపంతో వెంకటాపురం మండలానికి చెందిన ఓ గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు. మృతదేహాన్ని ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని ఉంజుపల్లి సమీపంలో పడవేశారు. వెంకటాపురం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుర్సం బాలకృష్ణ (35)తో పాటు అదే గ్రామానికి చెందిన మడకం రామకృష్ణను మావోయిస్టులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. విచారించిన మావోయిస్టులు బాలకృష్ణను హతమార్చి మృతదేహాన్ని ఆదివారం తెల్లవారుజామున చర్ల మండలంలోని ఉంజుపల్లి- వద్దిపేట మార్గంమధ్యలో రోడ్డుపై పడవేశారు. ఆదివారం ఉదయం పూసుగుప్ప, వద్దిపేట గ్రామాల నుంచి చర్ల సంతకు వస్తున్న గిరిజనులు మృతదేహాన్ని గమనించి మీడియాకు సమాచారం ఇచ్చారు.
లక్ష్మీపురానికి చెందిన కుర్సం బాలకృష్ణకు పోలీసులు రూ.లక్ష ఆశచూపి ఇన్‌ఫార్మర్‌గా వాడుకుంటున్నారని మావోయిస్టులు మృతదేహం వద్ద వదిలివేసిన లేఖలో పేర్కొన్నారు. వారంతపు సంతకు వచ్చే సంఘం నాయకులు, ప్రజలను బాలకృష్ణ పోలీసులకు పట్టించి కొట్టిస్తున్నాడని మావోలు లేఖలో తెలిపారు. ప్రజాకోర్టు నిర్ణయం మేరకు హతమార్చినట్లు వివరించారు. ఘటనా స్థలి నుంచి చర్లకు మృతదేహాన్ని తెప్పించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.