సాక్షి, విశాఖపట్నం/పెదబయలు/కొయ్యూరు: మావోల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అడవిబిడ్డల కుటుంబాలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉద్యోగాలిస్తాం.. ఉపాధి కల్పిస్తాం.. ఆర్థికంగా ఆదుకుంటామని వారికి ఇస్తున్న హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని పోలీసు వ్యవస్థ వారిని ఇన్‌ఫార్మర్లుగా వాడుకుంటూ తమ లక్ష్యాలను సాధించుకుంటోందే తప్ప వారు మరణిస్తే ఆయా కుటుంబాలను మాత్రం ఆదుకోవడంలేదని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.
ప్రాణాలు పణంగా పెట్టి మావోల కదలికలు, సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే వీరికి ప్రభుత్వం రిక్తహస్తమే చూపుతోంది. కొన్ని సందర్భాల్లో అరకొర సాయమే అందిస్తోంది. మరోవైపు.. తమ లక్ష్యం దెబ్బతింటోందన్న భావనతో మావోలు వీరిని దొరికినప్పుడల్లా పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో మట్టుపెడుతుంటారు. వీరి కుటుంబాలను ఆదుకోవడంలో గత ప్రభుత్వాలతో పోలీస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
పరిహారంపై విధివిధానాల్లేవు..
మావోల దాడుల్లో మృత్యువాతపడిన వారిలో ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతలేదు. పరిహారం, సాయంపై ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి విధివిధానాలు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారుతోంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు తమ వారైతే ఒకలా.. సామాన్యులైతే మరోలా వ్యవహరిస్తున్నాయి. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా చనిపోతే వారి హోదాలు, స్థాయిని బట్టి గతంలో రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకు చెల్లిస్తున్నారు. అదే సాధారణ పౌరులైతే ఐదు లక్షల వరకు పరిహారం.. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి చిన్నపాటి కొలువు ఇస్తున్నారు.
20 ఏళ్లలో 94 మంది మృత్యువాత
1998–2018 మధ్య ఏఒబీ పరిధిలో మొత్తం 89 ఘటనలు జరిగాయి. వీటిలో 94మంది అమాయక గిరిజన పౌరులు మావోల తూటాలకు బలయ్యారు. 2014కు ముందు వరకు ఇన్‌ఫార్మర్లు, సామాన్యులు చనిపోతే వారికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం మంజూరు చేసేవారు. కానీ, గడిచిన నాలుగున్నరేళ్లలో చనిపోయిన ఏ ఒక్కరికీ పరిహారం పంపిణీ చేయడమే కాదు కనీసం ప్రతిపాదనలు పంపిన దాఖలాలు కూడా లేవు. అంతేకాదు.. 2014కు ముందు చనిపోయిన వారికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం సైతం నేటికీ అందించలేని దుస్థితి నెలకొంది. గడిచిన నాలుగున్నరేళ్లలో ఏఒబీ పరిధిలో సుమారు 20 మందికి పైగా చనిపోతే ఇప్పటివరకు ఒక్కపైసా పరిహారం అందని పరిస్థితి నెలకొంది.
వారికోలా.. వీరికోలా..
అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద గత నెల 23న మావోలు మట్టుబెట్టారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ ఉన్నతాధికారికి ఇవ్వనంత పరిహారం ఈ ఇరువురికీ ప్రభుత్వం ప్రకటించింది. కిడారి కుటుంబానికి రూ.1.20కోట్ల పరిహారంతో పాటు ఆయన చిన్న కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం, సోమ కుటుంబానికి రూ.1.05కోట్ల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇరువురికి విశాఖలో ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు.
ఉద్యోగాలు కాకుండా వీరివురురికి దాదాపు రూ.3కోట్లకు పైగా సాయం ప్రకటించడంపై విమర్శలు వచ్చినా ఎవరూ తప్పుపట్టలేదు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మృత్యువాతపడగానే అనూహ్యంగా స్పందించిన ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో మృతిచెందిన పోలీస్ ఇన్‌ఫార్మర్లు, ఇతరులపట్ల ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. వారికి కోట్లల్లో పరిహారం ఇస్తున్న ప్రభుత్వం వీరికి కనీసం లక్షల్లో కూడా పరిహారం ఇవ్వకపోతే ఎలా గిరిజన సంఘాల నేతలు నిలదీస్తున్నారు.
మంజూరైనా పంపిణీకాని పరిహారం
ఇదిలా ఉంటే.. 2013–14లో మావోల చేతిలో తొమ్మిది మంది ప్రాణాలొదిలారు. వారికి 2015లో రూ.27.8 లక్షలు విడుదలైంది. చింతపల్లి మండలం బలపం గ్రామానికి చెందిన గబ్బాడి చిట్టిదొరకు రూ.14లక్షలు, చీకటిమామిడి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావుకు రూ.40వేలు, జీకేవీధి మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన ఎం.మత్స్య రాజుకు రూ.1.25లక్షలు, కుంకుంపూడికి చెందిన కొర్రా సన్యాసిరావుకు రూ.2.25 లక్షలు, కొయ్యూరు మండలం ఎండకోట గ్రామానికి చెందిన ఎం.రాజుకు రూ.5 లక్షలు, రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన యలమంచలి రమణకు రూ.2.5 లక్షలు, జి.మాడుగులకు చెందిన సింహాచలానికి రూ.5లక్షలు విడుదలయ్యాయి.
అలాగే, మైదాన ప్రాంతానికి చెంది ఏజెన్సీలో ఆస్తి నష్టం జరిగిన నర్సీపట్నానికి చెందిన పి.సుజాతకు రూ.5లక్షలు, ఏలూరుకు చెందిన గంటా శివప్రసాద్‌కు రూ.5లక్షలు విడుదలై బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. కానీ, నేటికీ ఈ పరిహారం పంపిణీకి నోచుకోలేదు. ఇక గడిచిన నాలుగున్నరేళ్లలో మృత్యువాతపడిన పోలీస్ ఇన్‌ఫార్మర్లు, ఇతరులకు ఒక్కపైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు.
మాజీ మంత్రికే అందని సాయం
సామాన్యులకే కాదు.. టీడీపీకే చెందిన మాజీమంత్రి మత్స్యరాజ మణికుమారికే పరిహారం అందకపోవడం గమనార్హం. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 2003లో ఆమె భర్త వెంకట్రాజును మావోలు హతమార్చారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, మణికుమారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మణికుమారి పిల్లల్ని చదివించి వారికి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెకు ప్రకటించిన రూ.5లక్షల పరిహారం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది.
ఇక పిల్లల్ని చదివించేందుకు ఆర్థిక సహాయం చేస్తానన్న మాట కూడా నీటిమూటగానే మిగిలింది. ఒక పాపకు మాత్రమే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.25వేల వరకు ఆర్థిక సహాయం చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాక్సైట్ తవ్వకాల కోసం టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో బాక్సైట్ గనులున్న జెర్రెల పంచాయతీ సర్పంచ్ సాగిన వెంకటరమణను మావోలు మట్టుబెట్టారు. ఆయన కుటుంబానికి నేటికీ సాయం అందలేదు. ఇలా చెప్పుకుంటూపోతే చాలామందే ఉన్నారు.
కూలీపని చేసుకుని పిల్లల్ని పోషిస్తున్నాను
ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరిపడ గ్రామానికి చెందిన నా భర్త పాంగి రామన్నను 2015లో పోలీసు ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. అలాగే, మమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. నాకు ముగ్గురు సంతానం. ఊరికాని ఊరిలో వారిని పోషించడం చాలా కష్టంగా ఉంది. సీఆర్‌పీఎఫ్ పోలీసులు వంటపాత్రలు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం, పోలీసులు ఆదుకోవాలి. – పాంగి రాశి,పాంగి రామన్న భార్య
పాతికేళ్లవుతున్నా అందని పరిహారం
శరభన్నపాలేనికి చెందిన సుబ్బారావును మావోయిస్టులు 1994లో పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామంలో కాల్చి చంపేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతని భార్య కొండమ్మకు పైసా కూడా పరిహారం దక్కలేదు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల చుట్టూ ఆమె ఎన్నిసార్లు తిరిగినా ఇస్తామన్న రూ.ఐదు లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదు. వారసత్వ సర్టిఫికెట్‌లో తప్పు ఉందన్న కారణంతో జాప్యం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment