మాటల మాంత్రికుడిగా మిగిలిపోతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు దూరం
కేంద్రంలో ఉన్నా కనిపించని ప్రభావం
ధరల నియంత్రణలో విఫలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
⇒ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇవ్వబోతున్నాం. మూడు సిలిండర్లు ఎందుకని చంద్రబాబు ఇవ్వబోతున్నారు..? సిలిండర్ల ధర జగన్ పెంచారు. ఇప్పుడు కొనలేకపోతున్నాం. ఇబ్బంది ఉంది కాబట్టి మళ్లీ గ్యాస్ పొయ్యల మీద వంట చేసుకునేందుకు మూడు సిలిండర్లు ఉచితం.
⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకు లు కూడా భారీగా పెరగడంతో కొనలేకపోతున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను స్థిరీకరిస్తాం.
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదు. అన్ని రకాలుగా ముంచేశారు. రైతుల్ని ఆదుకోవడానికి ఏటా సీజన్ ప్రారంభంలోనే రూ. 20వేల పెట్టుబడి సా యం అందిస్తాం.
⇒ సముద్ర వేట విరామ సమయంలోనే మత్స్యకారులకు రూ. 20వేలు అందజేస్తాం. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం. వారికి అవసరమైన బోట్లు, వలలు, పరికరాలు అందిస్తాం.అధునాతన పద్ధతుల్లో వేటకు సహకరిస్తాం.
⇒ ఆర్టీసీ ఛార్జీలు భరించలేని విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఫ్రీ చేసి, ఆడప డుచులు ఎక్కడ తిరగాలన్నా పైసా ఖర్చు లేకుండా చేస్తాం.
⇒చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున.. ఇద్దరుంటే రూ.30వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు... నలుగురుంటే రూ.60వేలు.. ఇంకా ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15వేలు చొప్పున మీ అకౌంట్‌లో వేయడానికి చంద్రబాబు నిర్ణయించారు.
ఎన్నికలకు ముందు ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పటి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు ఇవి. ఇప్పుడు వారు అనుకున్నట్టే అధికారంలోకి వచ్చారు. బాధ్యతలు స్వీకరించి 50 రోజులు దాటిపోయింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. పైగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మాటలన్నీ మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు.
ధరలు తగ్గించారా?
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఽనిత్యావసర ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టారు. పోనీ ఇప్పుడేమైనా తగ్గించారా అంటే అదేమీ లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపించిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నా ఆ ధరల గురించి మాటైనా మాట్లాడడం లేదు. గ్యాస్ ధరల పెంపు కూడా వైఎస్ జగన్‌పైనే వేసి ఊరూరా ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం దాన్ని తగ్గించి చూపలేకపోతున్నారు.
కోటలు దాటే మాటలు
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలే దాటడం లేదని జిల్లా వాసులంటున్నారు. మత్స్యకారుల వేట విరామం సమయం దాటిపోయి చాలా రోజులైంది. మధ్యలో వర్షాలు కూడా వచ్చి మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఇస్తామన్న రూ.20 వేలు ఇంతవరకు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ సగానికి వచ్చేసింది. ఉడుపులు అయిపోయాయి. కానీ, వారికింతవరకు పెట్టుబడి సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
పెట్టుబడి సాయమే కాదు ప్రభుత్వం విధిగా అందించాల్సిన విత్తనాలు, ఎరువుల విషయంలోనూ అదే నిర్లక్ష్యం కన్పించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది. పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాన్ని నేటికీ ఇవ్వలేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. ఇవే కాదు మహిళలకు ప్రతి నెలా రూ. 1500, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు...అవి ఇచ్చేలోపు నెలకి రూ. 3వేల నిరుద్యోగ భృతి కూడా మర్చిపోయారు. 50 ఏళ్ల పింఛన్ ఇవ్వడం మాట దేవుడెరుగు.. ఉన్నవి తీసేస్తున్నారు.
కొత్తవేవీ..?
తాను ఎంపీగా ఎన్నికయ్యాకే జిల్లాలో రైల్వే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. కానీ, దేశ వ్యాప్తంగా ఏం జరిగాయో అవే జరిగాయే తప్ప వ్యక్తిగత ప్రాధాన్యతతో జరిగినవేవి లేవు. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరిగాయి. అవన్నీ ఎంపీల వ్యక్తిగత ఖాతాలో వేసుకుంటే.. ఇక్కడ అదనంగా చేసిందేంటో చెప్పడానికి లేవు. కేంద్రమంత్రిగా ఉండటంతో జిల్లాకు ప్రత్యేక ప్రాజెక్టులేమైనా వస్తాయేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ ఒక్కటంటే ఒక్కటీ జిల్లాకు ప్రత్యేక కేటాయింపు లేదు.
Comments
Please login to add a commentAdd a comment