గిరిజన యువతను మోసగిస్తున్న ఎమ్మెల్యే శిరీషా దేవి భర్త భాస్కర్
షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ దందాలు
మీడియాకు భాస్కర్ అవినీతి ఆడియో టేపులు బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి
రంపచోడవరం: అధికారం లేనప్పుడే ఉద్యోగాల పేరుతో గిరిజన యువతను మోసం చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త మఠం విజయ భాస్కర్ అధికారంలోకి వచ్చిన తరువాత మరింతగా రెచ్చిపోతున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రంపచోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే, రంపచోడవరం ఎమ్మెల్యే తీరుపై అంతకు పదిరెట్లు వ్యతిరేకత ఏజెన్సీ ప్రజల నుంచి వ్యక్తమవుతోందని ఆమె విమర్శించారు.
ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్‌లో ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్‌పై ప్రసారం చేసిన కథనాన్ని ప్రదర్శించారు. బహుశా టీడీపీకి నష్టం జరుగుతుందనే ఇలా ప్రసారం చేసుంటారని ఆమె చెప్పారు. అధికారం లేనప్పుడే విజయభాస్కర్‌పై ఎనిమిది పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎన్నికల ముందు రాజవొమ్మంగికి చెందిన టీడీపీ నేతలు వీరి చేతిలో ఎలా మోసపోయారో బహిరంగంగానే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే భర్త ప్రవర్తనతో అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా 2023లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయభాస్కర్ డబ్బులు తీసుకున్న ఫోన్‌పే స్క్రీన్ షాట్‌లను మీడియాకు చూపించారు. బాధితులు మాట్లాడిన వాయిస్‌లను వినిపించారు. విజయభాస్కర్‌పై గుండాట, పేకాట కేసులు ఉన్నాయని తెలిపారు.
2022లో అనంతగిరిలో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తుండగా ఇద్దరు అమ్మాయిలను పట్టుకున్నారని, ఆ కేసులో భాస్కర్ ఏ–1 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళకు చెందిన సొమ్ము నేరుగా అతని అకౌంట్‌కు పంపించుకోవడం విజయభాస్కర్ అక్రమాలకు పరాకాష్ట అన్నారు. తిమ్మాపురంలో ఇసుక తవ్వుకునేందుకు కాలువకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఎమ్మెల్యే, ఆమె భర్తకు సంబంధం లేదా? అని ప్రశ్నించారు.
రంగురాళ్ల క్వారీలను తిరిగి తవ్వేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్‌శాఖలో బదిలీల కోసం రేట్లు ఫిక్స్ చేశారనే ఆరోపణలూ ఉన్నాయన్నారు. విజయభాస్కర్ మాట వినని అధికారులను గంజాయి కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment