బాలకృష్ణను 21నే చంపేశారు
- కిల్లంకోటలో ప్రజాకోర్టు
- ఇన్‌ఫార్మర్‌గా తేల్చి ఘాతుకం
పాడేరు: మావోయిస్టుల ఘాతుకానికి బలైన మరో గిరిజనుడు బాలకృష్ణ గురువారమే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించారనే ఆరోపణలతోనే జి.మాడుగుల మండలం కిల్లంకోట కాలనీ గ్రామానికి చెందిన బచ్చెలి బాలకృష్ణ (40)ను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రజాకోర్టులో బాలకృష్ణను మావోయిస్టు దళసభ్యులు గొడ్డలితో నరికి చంపారు. బాలకృష్ణ కిల్లంకోట గ్రామంలో నివాసం ఉన్నప్పటికి పంట భూములన్నీ లువ్వాసింగి పంచాయతీ మానేపల్లి గ్రామంలో ఉండటంతో గత 2 నెలలుగా భార్య పద్మకుమారితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు.
బుధవారం మావోయిస్టు దళ సభ్యులు 15 మంది మానేపల్లిలో ఉన్న బాలకృష్ణను కిల్లంకోట కాలనీ వరకు తీసుకు వచ్చారు. ఆ రాత్రంతా బాలకృష్ణను విచారించిన దళ సభ్యులు మరుసటిరోజు అదే ప్రాంతంలో ప్రజా కోర్టును కూడా నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రజాకోర్టులో బాలకృష్ణను పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పేర్కొంటూ దళ సభ్యులు అనేక ఆరోపణలు చేశారు. గతంలో జి.మాడుగుల ఎస్‌ఐగా పని చేసిన ప్రసాద్, కిల్లంకోట ప్రాంతంలో పర్యటించిన రోజున అతనికి బాలకృష్ణ అంబలి ఇచ్చాడని, మరోసారి ఈ దారిలో కూంబింగ్‌కు వెళుతున్న ఎస్‌ఐకి, పోలీసులకు దారి చూపాడని ఆరోపించారు.
అలాగే ప్రతివారం జి.మాడుగుల వెళ్ళి మావోయిస్టు పార్టీ సమాచారం చేరవేస్తున్నాడని బాలకృష్ణపై మావోయిస్టులు మండిపడ్డారు. బాలకృష్ణ సంజాయిషీ ఇచ్చినప్పటికి మావోయిస్టులు నమ్మలేదు. దళ సభ్యులు కాళ్లు, చేతులు కట్టి ప్రజాకోర్టులోనే గురువారం రాత్రి బాలకృష్ణ మెడపై గొడ్డలితో నరికి హతమార్చారు. దాంతో ప్రజాకోర్టుకు వచ్చిన గిరిజనులంతా పరుగులు తీశారు. మారుమూల ప్రాంతం కావడంతో ఈ హత్యా సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మృతుడికి భార్య పద్మకుమారితోపాటు ప్రభాకర్ (16), భవాని (14), విజయ్‌కుమార్ (12), సీత (07) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. బాలకృష్ణను చంపేశారనే సమాచారం అందుకున్న భార్య పద్మకుమారి, పిల్లలు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. అయితే జి.మాడుగుల పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలిసింది. పైగా మృతదేహం దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు.
ఈ సంఘటనతో కిల్లంకోట పంచాయతీలోని అన్ని గ్రామాల్లోను భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నా యి. సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా బైటకు చెప్పేందుకు గిరిజనులు భయపడుతున్నారు. వీఆర్వో పోలీసులకు శనివారం సమాచారం ఇవ్వడంతో బాలకృష్ణ మృతదేహాన్ని పాడేరు ఆస్పత్రికి తరలించి శవపరీక్ష జరిపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.