మావోయిస్టులచే ఇద్దరు గిరిజనుల అపహరణ
గొబ్బరిపడాలో ముగ్గురి ఇళ్లు ధ్వంసం
ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురికి దేహశుద్ధి
28 నుంచి వారోత్సవాలతోఅంతటా భయాందోళనలు
పాడేరు/ముంచంగిపుట్టు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అలజడి చోటుచేసుకుంది. సరిహద్దుల్లో కొంతకాలంగా స్దబ్దుగా ఉన్న మావోయిస్టులు శనివారం వేకువజామున తమ ఉనికిని చాటుకున్నారు. ఈ నెల 28 నుంచి జరిగే వారోత్సవాలకు ముందు ఈ ఘటనతో ఏక్షణాన ఏమి జరగుతుందోనని గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత నెల 20న ఎన్‌కౌటర్‌లో దళసభ్యుడు మృతి చెందినప్పటి నుంచి మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. దీనిని ఎదురుదెబ్బగా భావించిన వారు ఇటీవల నిరసన వారోత్సవలను 30 గ్రామాల గిరిజనులతో సరిహుద్దులో విజయవంతంగా నిర్వహించారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరిపడాలో ఐదు కుటుంబాలకు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మూడు కుటుంబాలవారు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా శనివారం వేకువజామున పాంగిరామన్న, పాంగిదోబులను అపహరించుకుపోయారు. వంతాల జీనబంధుకు చెందిన ఇంటిని బాంబు వేసి నేల మట్టం చేశారు. వంతాల లైకోన్, పాంగి రామన్నల ఇళ్లను ధ్వంసం చేశారు. వంతాల సోనియాకు చెందిన ఇంటిపై కిరోసిన్ పోసి తగులబెడుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వంతాలసాధురాంతో పాటు పలువురు గిరిజనులకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ ఘటనలో సుమారు 100 మంది సాయుధ మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. పోలీసుల ఆదేశాలతో ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి గత నెల 20న మావోయిస్టు మృతదేహాన్ని మోసుకు వెళ్లిన గిరిజనుల గురించి కూడా మావోయిస్టులు గాలిస్తున్నట్టు తెలియడంతో ఈ ప్రాంతంలోనివారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అంతకు ముందు ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు లింగేటి పంచాయతీ మొయ్యిల గుమ్మి వద్ద రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు మన్యంలో నిఘా పెంచారు. పెద్ద ఎత్తున కూంబింగ్ జరుపుతున్నారు. ఈ తరుణంలో మావోయిస్టులు గొబ్బరిపడ గ్రామంపై దాడి చేయడంతో మారుమూల గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమరవీరులైన దళసభ్యులకు నివాళులర్పించడానికి స్తూపాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏ డాది కాలంలో ఏజెన్సీలోని బలపం వద్ద శరత్, గణపతి, మల్కన్‌గిరి క్యాడర్‌కు చెందిన సోను, వాలీ, జైరాజ్‌లు వేర్వేరు ఘటనల్లో మృతి చెందారు. వీరికి నివాళులు అర్పించడం, అమరవీరుల సంస్మరణ వా రోత్సవాలను ఏవోబీలో విజయవంతానికి వ్యూహాత్మకంగా వారు ముందుకు సాగుతున్నట్టుతెలుస్తోంది.
భయాందోళనలు చెందొద్దు: ఏఎస్పీ
మావోయిస్టుల కార్యకలాపాలతో పోలీసు పార్టీలను అప్రమత్తం చేశామని, మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్ విస్తృతం చేస్తున్నట్లు ఏఎస్పీ అట్టాడ బా బూజీ తెలిపారు. గిరిజనులు ఎటువంటి భయాందోళనలకు లోను కావద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెంచామని, మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారం నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
మారుమూల గ్రామాల్లో మావోయిస్టు పోస్టర్లు
జి.మాడుగుల: అమరవీరుల సంస్మరణ వారాన్ని ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గ్రామాగ్రామాన విప్లవ సంప్రదాయాలతో జరుపుకుందామంటూ సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ పిలుపునిచ్చింది. అమరులైన దళసభ్యుల ఆశయ సాధన కోసం తుదికంటా పోరాడాలంటూ మండలంలోని మారుమూల రోలంగిపుట్టు, లువ్వాసింగి, సంగులోయ, వంచేబు తదితర గ్రామాల్లో మావోయిస్టుల బ్యానర్లు, వాల్‌పోస్టర్లు శనివారం తెల్లవారుజామున వెలిశాయి. దీంతో గిరిజన గ్రామాల్లో ఒక్కసారిగా అలజడి చోటుచేసుకుంది. ప్రజా వీరులు కామ్రేడ్ శరత్, లాలు, గణపతి, జోగల్, సోనులకు జోహార్లు, మన్యం ప్రజల బాక్సైట్ పోరాటం వృథా కాదు అంటూ బ్యానర్లు, వాల్ పోస్టర్లలో పెదబయలు ఏరియా కమిటీ పేర్కోంది.
ఏవోబీలో అలజడి
Published Sat, Jul 25 2015 11:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement