పార్వతీపురం : పార్వతీపురం ప్రాంతానికి కూత వేటు దూరంలో ఉన్న ఏఓబీలో గతంలో తమకున్న పట్టు సాధించడం కోసం మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 3వరకు వారోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఏఓబీలోని గిరిజన గ్రామాల్లో ఊరూరా వారోత్సవాలను నిర్వహించి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా గత శనివారం రాత్రి ఇన్‌ఫార్మర్ నెపంతో కొరాపుట్ జిల్లా, బంధుగాం బ్లాక్ సమీపంలోని దశిని గ్రామానికి చెందిన కడ్రక కోమన్న(50)ను గొడ్డలితో నరికి చంపి మావోయిస్టులు వారి ఉనికిని తెలియజేశారు.
కొంతకాలం క్రితం పార్వతీపురం సబ్-ప్లాన్ మండలాలైన కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, కురుపాం, జియ్యమ్మవలస, మక్కువ, పాచిపెంట, సాలూరు తదితర ప్రాంతాలలోని గిరిశిఖర గ్రామాలతోపాటు వాటి సమీపంలోని ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. పలుమార్లు కూనేరు, గుమడ రైల్వే స్టేషన్ల పేల్చివేత, మక్కువ సెల్‌టవర్ పేల్చివేత, కొమరాడ, కూనేరు సమీపంలో పోస్టర్లు అతికించడం, పలువురిని ఇన్‌ఫార్మర్ల పేరుతో హతమార్చడం వంటి సంఘటనలు జరిగాయి.
అయితే ఆంధ్రాలో మావోయిస్టుల కార్యకలాపాల పట్ల పోలీసు యంత్రాంగం గట్టిగా స్పందించి చేపట్టిన విస్తృత కూంబింగ్ ఫలితంగా దాదాపు ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలికిడి లేకుండా పోయింది. ఇటీవల గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, కొమరాడ మండలాల్లో ఒడిశాకు దగ్గర్లో ఉన్న ప్రాంతాలలో మావోయిస్టుల అలికిడి ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఈ నెల 28 నుంచి మావోయిస్టులు ఆయా ప్రాంతాలలో గిరిజనులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు, ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సర్కారు చేపడుతున్న ప్రజావ్యతిరేక చర్యలు, గిరిజనాభివృద్ధికి కానరాని స్పందన పట్ల వారోత్సవాల్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తెస్తున్నట్లు సమాచారం. ఈ వారోత్సవాలకు మావోయిస్టుల కేంద్ర, రాష్ట్ర కమిటీలతో పాటు కొరాపుట్, శ్రీకాకుళం, ఒడిశా, తదితర డివిజన్లకు చెందిన నాయకులు ప్రత్యక్షంగా పాల్గొని వారోత్సవాలను విజయవంతం చేస్తున్నట్లు వినికిడి. ఒకవైపు మావోయిస్టులను ఏరివేసే పనిలో ఎస్‌బి ఎక్స్, క్యాట్‌పార్టీ, ఎస్టీఎఫ్, గ్రేహాండ్స్ తదితర పోలీసు విభాగాలు నిరంతరం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ మావోయిస్టులు మాత్రం వారోత్సవాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న మావోయిస్టుల వారోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, చైతన్య ఉపన్యాసాలు, మరో వైపు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల బూట్ల చప్పుళ్లతో తుపాను ముందు నెలకొన్న వాతావరణంలా అడవి తల్లి గంభీరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోనున్నాయోనని ఏఓబీలోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
పట్టుకోసం..
Published Sat, Aug 2 2014 3:05 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement