
భామిని: మనుమకొండలో కార్డన్ సెర్చ్‌లో సాయుధ దళాలు
భామిని, పాతపట్నం: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు కూంబిం గ్ ముమ్మరం చేశారు. నిషేధిత మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్న తరుణంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఎస్‌పీఎఫ్ పోలీసులు శనివారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పాతపట్నం–మెళియాపుట్టి రహదారికి ఇరువైపుల తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో వాహనాలను సోదా చేస్తున్నారు. లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ లభ్యం కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. వారోత్సవాల సమయంలో ప్రతీకార చర్యలు తీసుకొని సంచలనాలు సృష్టించడం మావోయిస్టులకు ఆనవాయితీ. ఏవోబీ అంతా విస్తృత కూంబింగ్ జరపడంతో ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఏ క్షణానికి ఏమవుతుందోన్న ఆందోళనతో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలు, ఎంపీలకు పోలీసు యంత్రాంగం భద్రత పెంచింది. అప్రమత్తంగా ఉండమని వారిని అధికారులు హెచ్చరించారు.
ముందస్తు చర్యలు
జిల్లా సరిహద్దులో కీలకమైన పోలీస్ స్టేషన్లను జిల్లా కొత్త ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఇప్పటికే చుట్టివచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ పేరున తివ్వా కొండల్లోని ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యే చర్యలు చేపట్టారు. కొన్ని గిరిజన గ్రామాల్లో కార్డన్–సెర్చ్ పేరుతో ఆదివాసీల గృహాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు. అనుమానితుల వివరాలపై ఆరా తీశారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నిఘా చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఆర్‌వోపీలు చేపడుతున్నారు. గిరిజన గ్రామాల్లో గల ఎస్పీవోలకు జీతాలు పెంచి గుర్తింపు కార్డులు ఇస్తూ స్నేహ చర్యలను పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే నిషేధిత మావోయిస్టుల ఫొటోలతోపాటు రివార్డుల వివరాలు తెలియజేసి అప్రమత్తం చేసి ఉన్నారు. సరిహద్దులో ముందస్తుగా భారీ కూం బింగ్‌లకు సాయుధ పోలీస్ బలగాలు తివ్వాకొండల్లో మోహరింపచేశారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సానుభూతిపరులపై దృష్టి సారించి నిఘా పెంచారు. ఒడిశా పోలీసులతో సత్సంబంధాల కొనసాగింపుపై వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment