పట్టుబడ్డ నాటుసారా, బెల్లంఊటలతో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారులు, ఆర్మ్‌డ్ ఫోర్స్
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల ఎక్సైజ్ పోలీసుల వ్యూహం ఫలించింది. గతంలో ఆంధ్రా సరిహద్దులో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహిస్తే, నాటుసారా తయారుదారులు ఒడిశా కొండ కోనలకు పారిపోయి తప్పించుకునేవారు. అదే ఒడిశాలో చేపడితే ఇక్కడకు వచ్చి తలదాచుకునేవారు. ఈ అవకాశం ఇవ్వకుండా రెండు రాష్ట్రాల ఎక్సైజ్ పోలీసులు ఏకకాలంలో చేసిన స్టింగ్ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ మేరకు పలు గ్రామాల్లో 520 లీటర్ల నాటుసారా, 8,500 లీటర్ల బెల్లంఊటలు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఒకరిని అరెస్టు చేశారు. గురువారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గారబంద పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో బీ సీతాపురం (20 లీటర్ల నాటుసారా), పెద్ద బురుజోల (400 లీటర్ల నాటుసారా, 2,500 లీటర్ల బెల్లంఊట), చిన్నబురుజోల (100 లీటర్ల నాటుసారా, 2 వేల లీటర్ల బెల్లం ఊట) భీంపురం (1,500 లీటర్ల బెల్లంఊట), తాలసింగి (2,500 లీటర్ల బెల్లంఊట) పట్టుబడ్డాయి. ఈ క్రమంలో పలువురు తప్పించుకుని పారిపోయారు. వారిలో పట్టుబడిన ఒక వ్యక్తి నుంచి వివరాలు సేకరించి మిగిలిన వారిని అరెస్టు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ సంయుక్త దాడుల్లో పలాస ఏఈఎస్ ఎం రాంబాబు, శ్రీకాకుళం ఎన్‌ఫార్సుమెంట్ ఏఈఎస్ సీ భార్గవ్, పలాస టాస్క్‌ఫోర్స్ ఆఫీస్ సీఐ టీవీఏ నాయుడు, ఎన్‌పోర్స్‌మెంట్ సీఐ పీ రామచంద్రకుమార్, పలాస సీఐ బీ మురళీదార్, టెక్కలి సీఐ జీ రమేష్‌బాబు, పాతపట్నం సీఐ జీ చలపతిరావు, ఎస్‌ఐ ఎస్ కే అప్పాలస్వామి, సీహెచ్ రాజశ్రీ, ఒడిశా రాష్ట్రం పర్లాకిముండి సీఐ సాహు, బరంపురం సీఐ బిహారా, గారబందా సీఐ, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment