ఏఓబీలో మళ్లీ మావోయిస్టుల
పార్వతీపురం : కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ ప్రాంతంలో మళ్లీ మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఇన్‌ఫార్మర్ నెపంతో శనివా రం రాత్రి కొరాపుట్ జిల్లా, బంధుగాం బ్లాక్ సమీపంలోని దశిని గ్రామానికి చెందిన కడ్రక కోమన్న(50)ను గొడ్డలితో నరికి చంపేశారు. దీంతో సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరో పక్క సోమవారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమర వీరుల సంస్మరణ వారాన్ని పాటించాలని మావోయిస్టులు పిలుపుని చ్చారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని జిల్లాలోని ఏజెన్సీ మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మావోయిస్టుల ఘటనకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు అందించిన సమాచారం ఇలా ఉంది... సుమారు 13 మంది సాయిధులైన మావోయిస్టులు శనివారం రాత్రి దశిని గ్రామానికి చేరుకుని కోమన్నను పిలిచి, గ్రామానికి సమీపంలో ఉన్న రోడ్డుపైకి తీసుకెళ్లి గొడ్డలితో నరికి హత్య చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తూ ప్రజలకు, పార్టీకి, ప్రజాయుద్ధానికి ఆటంకంగా ఉన్నందుకే కోమన్నను ఖతం చేశామని సంఘటన స్థలంలో సీపీఐ(మావోయిస్టు) శ్రీకాకుళం-కొరాపుట్ డివిజన్ కార్యదర్శి దయ పేరుతో వదిలివెళ్లిన లేఖల్లో తెలుగు, ఒడియా భాషల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు హార్టీకల్చర్ భవనాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై మృతుని కుమారుడు కడ్రక సోమేష పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. బీఎస్‌ఎఫ్ బలగాలు నివాసముంటున్న ప్రాంతానికి రెండు కిమీ దూరంలో ఈ సంఘటన జరిగింది.
ఉలిక్కిపడిన ఆంధ్రా ప్రాంతం...
ఆంధ్రాకు కూత వేటు దూరంలో ఉన్న బంధుగాం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన పట్ల ఒడిశాకు సరిహద్దుగా ఉన్న పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట తదితర మండలాలకు చెందిన పలు గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ చర్య చోటు చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.