ఈసారి బాబు తప్పించుకోలేరు: మావోయిస్టులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేనెపూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు. ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు. కోవర్టుల ద్వారా అన్నంలో విషం కలిపించి, పడిపోయిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారని ఈ విషయమై బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. కోవర్టు హత్యల సృష్టికర్త చంద్రబాబు, అతని హంతక పోలీసు ముఠా ద్వారానే ఏఓబీ దారుణ హత్యాకాండ కూడా జరిగిందన్నారు. చడీప్పుడు లేకుండా చంద్రబాబు జరిపించిన దారుణ మారణకాండ అని అభివర్ణించారు.
నయీంను మనిషిరూపంలో ఉన్న రాక్షసుడిగా తయారుచేసి, 15 ఏళ్ల పాటు వందలాది హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దె ఎక్కిన మర్నాడే 21 మంది ఎర్రచందనం కూలీలను దుర్మార్గంగా తన పోలీసులతో హత్య చేయించారని ఆరోపించారు. కోవర్టు పేరుతో పోలీసులతో వేలాదిమందిని బలితీసుకుని నిత్యం హత్యలతో రక్తం పారిస్తున్నారని అన్నారు. అలిపిరిలో తప్పించుకున్నావు గానీ.. ఈసారి నీవు, నీ కొడుకు తప్పించుకోలేరని ఆ లేఖలో హెచ్చరించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామని, పోలీసులు - మిలటరీ ఎల్లకాలం ఆయనను కాపాడలేవని అన్నారు.
అయితే, మావోయిస్టుల పేరుతో విడుదలైన ఈ లేఖలో ఉపయోగించిన భాష మాత్రం మావోయిస్టులు తరచుగా ఉపయోగించే భాషలా లేదు. దానికి పూర్తి భిన్నంగా ఉంది. దాంతో అసలు ఈ లేఖ నిజమైన మావోయిస్టులు విడుదల చేసిందేనా, లేదా ఏదైనా ఫేక్ లేఖనా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి.