గ్రీన్‌హంట్ మూడో దశలో భాగమే ఎన్‌కౌంటర్
► ఆర్కే ప్రాణాలకు హాని చేయకుండా కోర్టులో హాజరుపర్చాలి
► పోలీసుల చట్రంలోమీడియా, హైకోర్టు: విరసం నేత వరవరరావు
వరంగల్: సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలకు దేశంలోని అటవీ ఖనిజ సంపదను దోచి పెట్టేందుకు చేపట్టిన గ్రీన్‌హంట్ మూడో దశఆపరేషన్-2016లో భాగంగానే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారన్నారు.
బాక్సైట్ వెలికితీసేందుకు ఒప్పుకోని ఆదివాసీలు అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ విలువైన ఖనిజ సంపద దేశ పార్లమెంటు బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువని.. సుమారు రూ.142 లక్షల కోట్ల విలువైందన్నారు. తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నంలో వాకపల్లి మహిళలు సామూహిక అత్యాచారాలకు గురైనా పోరాటం ఆపలేదన్నారు. ఆదివాసీలు తమ హక్కులను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటాలకు మావోయిస్టులు అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్ల పేరిట మారణకాండ జరుపుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన మీడియా సంస్థలు, హైకోర్టులు పోలీసుల చట్రంలో ఉండి వారు చెప్పిన విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
భోపాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసిందన్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇంత మారణకాండ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం సరికాదన్నారు. పౌరహక్కుల సంఘం నేతలు పలుమార్లు హైకోర్టును ఆశ్రయిస్తే మా పరిధి కాదని అనడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆర్కే ఆచూకీ కేంద్ర ప్రతినిధి ప్రతాప్, రాష్ట కమిటీ, ఏవోబీలు తెలియదని ప్రకటనలు ఇచ్చాయన్నారు. ఆర్కే ఆచూకీ ఒక్క పోలీసులకే తెలిసే అవకాశం ఉందన్నారు. ఆయనను కోర్టు ఆదేశాల మేరకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. గురువారం వరకు గాయాలతోనైనా కోర్టులో అప్పగించాలని హైకోర్టు చెప్పిందన్నారు.
పోలీసులు చంపడం, బహుళజాతి సంస్థలకు ఖనిజ సంపద అప్పగించడమే కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం అవసరం ఉందని కోర్టు వాఖ్యానించడం అభినందనీయమని వరవరరావు అన్నారు. విలేకరుల సమావేశంలో ప్రజాస్వామ్య వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే తదితరులు పాల్గొన్నారు.
భోపాల్ ఎన్‌కౌంటర్ దుర్మార్గం
భోపాల్‌లో జరిగిన సిమి కార్యకర్తల ఎన్‌కౌంటర్ ఇంతకంటే దుర్మార్గమని వరవరరావు ఆరోపించారు. జైలు నుంచి తప్పించుకున్న సిమి కార్యకర్తలు భోపాల్ శివార్లో జరిగిన ఎన్‌కౌంటర్ మరణించడం అనుమానాలు తావిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై మీడియా, ప్రజాస్వామ్యులు స్పందించక పోవడం సరికాదన్నారు. మీడియా ఇలా తయారయ్యారకా నరహంతకుడు మోదీ ప్రధాని కాకుండా ఎలా ఉంటారు? సీఎంలు చంద్రబాబు, కె.చంద్రశేఖరరావు, రమణ్‌సింగ్, నవీన్‌సింగ్‌తో పాట పడ్నవీస్‌లు సామ్రాజ్యవాద సంస్థలకు ఖనిజ సంపదను కట్టపెట్టేందుకే ఈలాంటి ఘటనలు చేయిస్తున్నారని అన్నారు.