చంద్రబాబు ‘చాణక్య’ రాజనీతి
అభిప్రాయం
రెండు వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయ్ కంపెనీకి అప్పగించడంపై గత ఇరవై ఏళ్లుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఆదివాసులపై, వారి మధ్యనున్న మావోయిస్టులపై ప్రభుత్వాలు జరిపిన రాజ్యహింసను ఇక్కడ మళ్లీ ప్రస్తావించనక్కర్లేదు.
‘చిలకా చెప్పింది అక్షరాలా నిజం...!’ అంటూ దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య ఎన్‌కౌంటర్ పేరుతో ఏఓబీ ఘటనపై.. ‘చాణక్యుడు’ ఒక పోస్టర్ వేశాడు. ఆలకూరపాడులో జరిగిన మున్నా సంతాప సభలో ఏఓబీ ఘట నపై ఏపీసీఎల్సీ స్పందనగా దీనిని పేర్కొన్నది. చిలకా చంద్రశేఖర్ చేసిన ప్రసంగంలో ఇది దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్యన జరిగిన ఎన్‌కౌంటర్‌గా ఆయన అన్నట్లుగా పేర్కొన్నది. దీనిపై ఈ ‘చాణక్యుడు’ చాలా వ్యాఖ్యానం చేశాడు.
ఈ పోస్టర్లో మావోయిస్టులు విశాఖ మన్యంలో ఒక సంవత్సర కాలంలో చేసే వసూళ్ల వివరాలు వాళ్లు రాసుకున్న డాక్యుమెంట్ల ప్రకారమే అంటూ ఇచ్చారు. అవి అక్రమమైనవని కూడా పేర్కొన్నారు. ఆ మొత్తం రెండు కోట్ల నలభై లక్షల రూపాయలని, అట్లే గిరిజనుల నుంచి వారి పంట దిగుబడిలో 1/3వ వంతు వసూలు చేస్తారని, గిరిజనులకే చెందాల్సిన ఈ సొమ్మంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నిస్తూ, ముసుగు సంఘాల నేతలారా ఇందులో మీ వాటా ఎంత అని ప్రశ్నించింది.
రాజ్యాంగం ఆదివాసులకు జల్, జంగల్, జమీన్ల మీద ఇచ్చిన అధికారాలే కాకుండా, తెలుగు నేల మీద 1/70 మొదలు పెసా వరకు చట్టాలే కాకుండా, ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులన్నీ ప్రభుత్వంలో రాజకీయాధికారంలోను, రాజ్యాంగ యంత్రంలోను ఉన్నవాళ్లు ఎవరెంత తింటున్నారో, ఇటువంటి ఒక పారదర్శక జాబితాను చాణక్యుడు ఇవ్వగలడా? ఈ విశాఖ మన్యం ప్రాంతంలోనే నదుల మీద చేసిన నిర్మాణాలు, పవర్ హౌజ్లు, బాక్సైట్ తవ్వకాలు, కాఫీ తోటలు మొదలైన ఎన్నో రూపాల అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వంలో రాజకీయాలలో, పరిపాలన యంత్రాంగంలో ఉన్న వాళ్లకు, కాంట్రాక్టర్లకు, తాబేదార్లకు చెందుతున్నదెంత? ఆదివాసులకు చెందుతున్నదెంత? గిరిజనుల పంట దిగుబడిలో మూడో వంతు మావోయిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్న చాణక్యుడు ఈ పంట పండించడానికి వాళ్లు చేస్తున్న పోడు భూములు ఆదివాసేతరులు ఆక్రమించుకుంటుంటే తానేం చేశాడో చెప్పగలడా?
మావోయిస్టులు అక్కడ గడ్డి వేళ్ల స్థాయినుంచి అమలు చేస్తున్న అభివృద్ధి గురించి ఇటీవల నిజనిర్ధారణకు వెళ్లి వచ్చిన సీడీఆర్‌ఓలోని నలభైమంది బృందంలో ఒకరైన ప్రొ‘‘ కాత్యాయని విద్మహే చాలా వివరమైన వ్యాసం రాశారు. ‘మావోయిస్టులు తొలుతగా భూమి సమస్యను తీసుకుని ఆదివాసులను కూడగట్టారు. మద్యం వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసే సోండీల ఆక్రమణలో ఉన్న రెండు వందల ఎకరాల భూమిని ప్రజాపరం చేయడానికి ఉపక్రమించారు. ఈ ఉద్యమం విజయవంతం అయ్యేంత వరకు ప్రజల వెంటే ఉన్నారు. ప్రజలతోనే ఉన్నారు. ఈ భూమిని స్వాధీన పరిచి, ప్రజలకు పంచి, వ్యవసాయం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇప్పటికీ ప్రజల ఆధీనంలో ఆ భూములు సాగవుతూనే ఉన్నాయి. భూమిని స్వాధీనం చేసుకొని భూమిలేనివారికి పంచడం ఒక కార్యక్రమంగా మావోయిస్టులు ఆదివాసుల హృదయాలను గెలుచుకున్నారు.
రైతాంగ సదస్సులను నిర్వహించి, వ్యవసాయ ఉత్పత్తిలో అభివృద్ధి మార్గాల గురించి ప్రజలతో చర్చించారు. శ్రమ, సహకార సంఘాలను ఏర్పరిచారు. సమష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఈ పద్ధతిలో ఎవరి భూమి వాళ్లు సాగు చేసుకోవడంగా కాక, అందరూ కలసి సాగుయోగ్యమైన భూమినంతటిని ఏకఖండంగా చేసి పనిచేశారు. ఈ క్రమంలో సాగుభూమి లేని వాళ్లు ఎంత ప్రయోజనం పొందారో, భూమి ఉన్నవాళ్లు కూడా వ్యక్తిగతంగా అంతగా లాభపడ్డారు. 26, 27 గ్రామాలలో ఈ విధంగా శ్రమ సహకార పద్ధతిలో జరిగిన వ్యవసాయం వల్ల వచ్చిన ఫలితాలతో మిగిలిన చోట్ల కూడా ప్రజలు ఇలాంటి పద్ధతిలో సాగుచేయడానికి చొరవ తీసుకున్నట్టు తెలిసింది.
నిత్య జీవితాల కోసం చేయవలసిన ప్రయాణాలు, సౌకర్యాల కల్పన కోసం ఆదివాసులను కూడగట్టడం మావోయిస్టులు చేసిన మరొక ముఖ్యమైన పని. అందులో భాగంగానే బలిమెల వాగులో పడవలు పెట్టాలనే డిమాండ్ పెట్టి సాధించుకోగలిగారు. చేపలు పడితే కట్టాల్సిన పన్ను రద్దు కోసం పోరాడి సాధించారు. ఆదివాసులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలోను మావోయిస్టులు విశేష కృషి చేశారు. కటాఫ్ ఏరియాల గ్రామ నిర్మాణాల నుండి కొంతమందిని ఎంపిక చేసి, తగిన శిక్షణ ఇచ్చి, ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య బృందాలను ఏర్పరిచారు.
చాణక్యుడు మావోయిస్టులు ఆదివాసుల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. వైద్యం విషయంలో ప్రభుత్వం ఆధునిక వైద్యాన్ని మారుమూలలకు పంపించే ప్రయత్నం చేస్తుంటే మావోయిస్టులు అడ్డుపడుతున్నారని చెప్పాడు. వాస్తవం ఏమిటంటే మావోయిస్టులు ఇంటింటికీ రూ. 100 వసూలు చేసి తెప్పించిన మందులతో వాళ్లు గ్రామాలలో ఏర్పాటు చేసిన వైద్య బృందాలు స్థానిక ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నాయి. మావోయిస్టుల ఈ వైద్య విధాన ఫలితమే ప్రభుత్వం ‘మెడికల్ లాంచ్’ల ఏర్పాటు.
విద్య విషయంలో మావోయిస్టులు ప్రస్తుతానికి వయోజనులకు రాత్రి బడులు నడిపే తొలి దశలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల సక్రమ నిర్వహణకు బాధ్యులుగా అధ్యాపకులను చైతన్యపరిచేందుకు కృషి చేస్తున్నారు. దాని ఫలితంగానే కొన్ని గ్రామాలలో బడికి వచ్చే పిల్లల సంఖ్య పెరుగుతున్నది. కాఫీ ప్లాంటుల్లోకి చొచ్చుకుపోయిన మావోయిస్టులు బాక్సైట్ సమస్యలపై సంఘటితం అవుతున్న ఆదివాసులకు వెన్నుదన్నుగా ఉన్నారు. దాని ఫలితమే ఇరవై ఏళ్లుగా దాన్ని నిలువరించగలిగారు. ఉద్యమ ఉధృతికి జీవోలు రద్దు చేసుకున్నారు.
సమర్థ పాలకుడు దేశాన్ని సక్రమంగా పరిపాలిస్తున్నప్పుడు దొంగలు, దోపిడీదారులు, తీవ్రవాదులు ఉక్కిరిబిక్కిరై
‘సమాజంలో అవినీతి, అసమానతలు, అసహనం పెరిగిపోయిం ద’ని ఫిర్యాదు చేస్తారని చాణక్యుడు తన పోస్టర్‌లో ముక్తాయించాడు. ఇవాళ దేశంలో ఉన్న అవినీతి, అసమానత, అసహనాల గురించి దొంగలు, దోపిడీదారులు, తీవ్రవాదులు మాత్రమే మాట్లాడుతున్నారా? ప్రజలు మాట్లాడుతున్నారా? అనే విషయాన్ని ప్రజల విజ్ఞతకే వదిలేస్తూ చాణక్యుని కుటిలబుద్ధి గురించి దీన్ని బట్టి అంచనా వేయగలరని భావిస్తున్నాను.
(వ్యాసకర్త : వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు )