కృష్ణారావు మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
జి.మాడుగుల: తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో ఆదిమజాతి గిరిజనుడిని (పీవీటీజీ) మావోయిస్టులు గొంతుకోసి హతమార్చారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వాకపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుడు గెమ్మెలి కృష్ణారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన ఇంటిలో కుటుంబంతో సహా నిద్రిస్తున్న సమయంలో సీపీఐ (మావోయిస్టు) పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 30మంది సాయుధులైన మావోయిస్టులు వచ్చి మాట్లాడి పంపుతామని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సమీప అంగన్‌వాడీ భవనం వద్ద అతి క్రూరంగా గొంతుకోసి హతమార్చారు.
కృష్ణారావు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని, పోలీసులకు ఎప్పటికప్పుడు మావోల సమాచారం అందిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోనందునే హతమారుస్తున్నామని ఘటనా స్థలంలో విడిచివెళ్లిన లేఖలో పేర్కొన్నారు. మరికొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే వారికీ శిక్ష తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. కృష్ణారావు మృతదేహాన్ని నుర్మతి ఔట్‌పోస్టు పోలీసులు శవ పంచనామా నిమిత్తం అంబులెన్సులో తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment