గొడ్డళ్లతో నరికి చంపిన మావోయిస్టులు
మృతదేహాలతో ఆదివాసీ సంఘాల నేతలు, గిరిజనుల ఆందోళన
మృతుల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి
ములుగు జిల్లాలో ఘటన
వాజేడు: పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నారనే నెపంతో మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు గిరిజనులను గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు పోలీసు స్టేషన్‌కు సుమారు అరకిలో మీటరు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాజేడు మండల పరిధి బాలలక్ష్మీపురం (పెనుగోలు కాలనీ) గ్రామంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉయిక అర్జున్ (38) ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. వారు అర్జున్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఆరుబయట గొడ్డళ్లతో నరికారు.
అదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టులు ఉయిక రమేశ్ (38) ఇంటికి వెళ్లి మంచంపై పడుకున్న రమేశ్‌ను గొడ్డళ్లతో నరికి వెళ్లిపోయారు. రమేశ్ కొన ఊపిరితో ఉండగా స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగానే అతను చనిపోయాడు. పేరూ రు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమేశ్‌కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా, అర్జున్‌కు భార్య సావిత్రి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశువులు కాయడానికి అడవుల్లోకి వస్తున్న అర్జున్ తమ దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, ఇతనితోపాటే ఉయిక రమేశ్ కూడా పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నాడని వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఘటనాస్థలంలో వదిలిన రెండు లేఖల్లో మావోయిస్టులు పేర్కొన్నారు.
అమాయకులను హత్య చేశారు
ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన ఉయిక రమేశ్, ఉయిక అర్జున్ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి వాజేడు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు, గిరిజనులు, గ్రామ పంచాయతీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తీసుకు వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుగా పెట్టి పెనుగోలు కాలనీకి వెళ్లే దారి వద్ద వాజేడు, వెంకటాపురం(కె) రహదారిపై ధర్నాకు దిగారు.
ఇన్‌ఫార్మర్ ముద్ర వేసి అమాయక గిరిజనులను మావోయిస్టులు అన్యాయంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రమేశ్ భార్యకు నెలరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు ఏటూరునాగారం ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment