పారాహుషార్!
- జిల్లాపోలీసులకు త్వరలో 150 కొత్త వాహనాలు
- మన్యంలో కూంబింగ్ ఆపరేషన్లు ఇక ముమ్మరం
మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీలో కొత్త పోలీసు వాహనాలు రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టనున్నాయి. ఏజెన్సీని జల్లెడ పట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాం గానికి ఈ వాహనాలను సమకూరనున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకుంటున్నాయన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ ఆపరేషన్లకు సమాయత్తమవుతున్న పోలీసు శాఖ మౌలిక వసతుల మెరుగుదల, అదనపు హంగులపై దృష్టిసారించింది. అందుకు తొలి అడుగుగా పోలీసు శాఖకు అధునాతన వాహనాలను సమకూర్చనున్నారు. ఏజెన్సీని జల్లెడ పట్టేందుకు పోలీసు శాఖకు ఈ కొత్త వాహనాలను ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా పోలీసు అధికారుల ప్రతిపాదనకు రాష్ట్ర పోలీసు రవాణా విభాగం ఆమోదం తెలిపింది.
సుమోలు ఔట్... బొలేరోలు ఇన్
పోలీసు అధికారులు ఇంతవరకు ఎక్కువగా తెల్లరంగు సుమోలనే వాడుతుండడంతో అవి పోలీసులవని అందరికీ చిరపరిచితమైపోయాయి. దీంతో ఏజెన్సీలో పోలీసులు ఎక్కడ తిరిగినా ఇట్టే తెలిసిపోతోంది. పైగా, ఏజెన్సీ రోడ్లపై తెల్లసుమోలు కావాల్సినంత వేగంగా పరిగెత్తలేకపోతున్నాయి. వీటి స్థానంలో ప్రైవేటు వాహనాల మాదిరిగా నల్లరంగు బొలేరోలు సమకూర్చాలని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. వాటితోపాటు అదనపు వాహనాలను ఇవ్వాలని కోరగా ఆమోదం లభించింది.
150 కొత్త వాహనాలు! : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవసరాల మేరకు జిల్లాకు 150 వరకు కొత్త వాహనాలను సరఫరా చేయనున్నారు. వాటిలో పోలీసు అధికారులు ఉపయోగించేందుకు నల్లరంగు బొలేరో వాహనాలు 40 ఉన్నట్లు భోగట్టా. ప్రధానంగా కూంబింగ్ పార్టీల పర్యవేక్షణ, పోలీసు స్టేషన్ల తనిఖీలు, గస్తీ తదితర కార్యక్రమాల కోసం పోలీసు అధికారులు వీటినే ఉపయోగిస్తారు. ఇవి కాకుండా కొత్తగా 5 మారుతీ డిజైర్ వాహనాలను కేటాయించారు.
ఇక కూంబింగ్ ఆపరేషన్ల కోసం ఏజెన్సీకి బలగాల తరలింపుపైనా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. అందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చనున్నారు. కొత్తగా 25 మినీ ట్రక్కులు, 10 బస్సులను ఇవ్వనున్నారు. ఏజెన్సీలో పోలీసుల గస్తీ కోసం కొత్తగా 60 మోటారు బైక్‌లను కేటాయించనున్నారు. పోలీసు సామగ్రి తరలింపు కోసం మరో 5 ఆటో మ్యాక్స్‌లు కూడా జిల్లా పోలీసు శాఖకు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వాహనాలు వస్తే ఏజెన్సీలో పోలీసింగ్ మరింత పటిష్టమవుతుందని జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు.