
అప్పు ఇచ్చిన వారింట్లోనే ఘటన
హత్యేనని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు
అచ్చియ్యమ్మపేటలో విషాదం
విశాఖపట్నం: అచ్చియ్యమ్మపేటలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీసుకున్న ఇంట్లోనే ఆమె శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
టూటౌన్ సీఐ బి.తిరుమలరావు తెలిపిన వివరాలివి.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన బొడ్డు సుగుణ(34), తన భర్త అప్పన్న, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. సుగుణ అచ్చియ్యమ్మపేటకు చెందిన ధనలక్ష్మి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ సమయంలో ధనలక్ష్మి డబ్బులు ఇచ్చినందుకు వీడియో కూడా తీసింది. రూ.లక్షకు వారానికి రూ.20 వేలు అసలు, వడ్డీ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే, సుగుణ సకాలంలో వడ్డీ చెల్లించలేకపోవడంతో, ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ గురువారం సుగుణ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు.
వెంటనే డబ్బులు చెల్లించాలని, లేకపోతే వీడియోను అప్పన్నకు పంపిస్తానని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన సుగుణ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో రూ.40 వేలు పట్టుకుని ధనలక్ష్మి ఇంటికి బయలుదేరింది. డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లగా.. ధనలక్ష్మి లేరు. ఇంట్లో ఆమె చిన్న కుమారుడు ఒక్కడే ఉన్నాడు. కాగా.. రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన ధనలక్ష్మి.. గదిలో ఫ్యానుకు వేలాడుతున్న సుగుణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దల గొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. విషయం తెలుసుకున్న సుగుణ భర్త అప్పన్న, తన భార్యను ధనలక్ష్మి కుటుంబ సభ్యులే హత్య చేశారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు కూడా వారితో కుమ్మక్కయ్యారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం అప్పన్న, అతని ఇద్దరు కుమారులు, మృతురాలి బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుగుణ చనిపోయే ముందు బయట నుంచి స్టూలు పట్టుకుని ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయి ఉందని పోలీసులు వెల్లడించారు.
‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’
మరణించే ముందు సుగుణ తన భర్త అప్పన్నకు వాయిస్ మెసేజ్ పంపింది. ‘నా చావుకు ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ కారణం. నా కోసం బాధపడవద్దు. నేను అప్పులు మాత్రమే చేశాను. నా వల్ల నువ్వు, పిల్లలు సుఖపడలేరు. ధనలక్ష్మి నన్ను టార్చర్ పెడుతోంది. ఈ టార్చర్ నాతోనే పోవాలి. నా వల్ల మీరు బాధపడకూడదు. పిల్లలను హాస్టల్‌లో చేర్పించి బాగా చదివించు. నువ్వు నా కోసం బాధపడవద్దు’అని సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాయిస్ మెసేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.