రాజ్‌మా పంటకు వేళాయె.. | Velaye crop rajma .. | Sakshi
Sakshi News home page

రాజ్‌మా పంటకు వేళాయె..

Published Mon, Aug 25 2014 1:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

రాజ్‌మా పంటకు వేళాయె.. - Sakshi

రాజ్‌మా పంటకు వేళాయె..

  •     సాగుకు గిరిజనులు సన్నద్ధం
  •      చల్లని వాతావరణం అనుకూలం
  • మన్యం సిరుల పంట రాజ్‌మా చిక్కుళ్లు. దీని సాగుకు గిరిజనులు సన్నద్ధం అవుతున్నారు. కాఫీ తరువాత గిరిజనులు దీనినే ప్రధాన వాణిజ్య పంటగా చేపడతారు. ఏజెన్సీలో 10 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏజెన్సీలో ఏటా సుమారు 16 వేల టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ పండిన రాజ్‌మాను ముంబయ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌లో ఈ పంటకు మంచి ధర పలుకుతుండటంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కొద్దిపాటి సస్యరక్షణ చేపడితే ఎక్కువ దిగుబడులు సాధించ వచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
     
    చింతపల్లి: ఏజెన్సీలోని చల్లని వాతావరణం రాజ్‌మా సాగుకు అనుకూలం. ఇది స్వల్పకాలిక పంట. అధిక మంచు, ఉష్ణోగ్రతలను తట్టుకొనలేదు. ఉత్తరాదిలో సూప్‌గా వినియోగించే వీటికి మంచి డిమాండ్. ఇందులో ఆరు రకాలు ఉన్నప్పటికి గిరిజనులు ముఖ్యంగా ఎరుపు, తెలుపు రకాలనే పండిస్తున్నారు. 90 శాతం మంది ఎరుపు రాజ్‌మానే చేపడుతున్నారు. ఎకరాకు మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇవి గతేడాది కిలో రూ.60 నుంచి 80లు ధర పలికాయి. పంట కాలపరిమితి 3 నెలలు. ఎరుపు రాజ్‌మాకు డిమాండ్ ఉండటంతో సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. 50 రోజులలోపు దిగుబడి వచ్చే కంటైండరీ, బౌంట్‌ఫుల్, ఆర్కాకోమల్, రిమూవర్ వంటి రకాలను రైతులు ఇంటి అవసరాల కోసం పండిస్తున్నారు.
         
    సాగు విధానం: ఏజెన్సీలో సెప్టెంబరు నుంచి నవంబరు వరకు దీనిని పండిస్తారు. ఇసుకతో కూడిన గరుకు నేలలు, సారవంతమైన గరపనేలలు, బరువైన నేలలు దీనికి అనుకూలం. ఎకరాకు10 నుంచి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. భూమిని బాగా దున్ని చక్కని పదును వచ్చేట్లు చేయాలి. 30 నుంచి 45 సెం.మీ బోదెలు చేసి వాటిపై 25 నుంచి 30 సెం.మీ దూరంలో విత్తనాలు నాటుకోవాలి. భూమిలో కావలసినంత తేమ ఉండేట్లు చూసుకోవాలి.
         
    విత్తన శుద్ధి: రాజ్‌మా విత్తనాలను రైజోబియం జపానికం అనే బాక్టీరియాతో విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల వాతావరణంలోని నత్రజని మొక్కలకు లభ్యమవుతుంది.
         
    ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 10 టన్నుల పశువుల గెత్తం వేసి బాగా కలియదున్నాలి. విత్తనాలు వేసే వారం రోజుల ముందు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి.
         
    అంతరకృషి: ఒకటి రెండు సార్లు గొప్పు తవ్వి కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి. రాజ్‌మా మొక్కల వేళ్లు పైపైనే ఉంటాయి. అధిక తేమను తట్టుకోలేవు. పూత దశకు ముందు, కాయలు ఏర్పడిన తరువాత రెండుసార్లు నీటి తడులు అందించాలి.
         
    ఆశించే కీటకాలు: రసంపీల్చు పురుగులైన తేనెబంక, తెల్లదోమ, కాయతొలుచు పురుగులు ఈ పంటను ఎక్కువగా ఆశిస్తాయి. రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఐదు మిల్లీలీటర్ల పాస్మామిడాన్ లీటరు నీటిలో కలిపి నెల రోజుల తర్వాత పిచికారీ చేయాలి. హెక్టారుకు 450 లీటర్ల మందు ద్రావణం అవసరం అవుతుంది.
     
    ప్రధానంగా ఆశించే తెగుళ్లు: వెర్రి తెగులు, కాయకుళ్లు, తుప్పు, ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా రాజ్‌మా పంటను ఆశిస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 10 లీటర్లు నీటిలో కలిపి విత్తిన 7 వారాల తర్వాత చేనులో జల్లుకోవాలి. హెక్టార్‌కు 540 లీటర్ల మందు ద్రావణం అవసరం అవుతుంది.
     
    సస్యరక్షణ తప్పనిసరి
    రాజ్‌మా సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. దుక్కులు దున్నేటప్పుడు మొదలుకొని పంట చేతికి అందేంత వరకు ప్రత్యేక దృష్టి సారించాలి. ఏజెన్సీవాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉండటం వల్ల కొద్దిపాటి జాగ్రతలు తీసుకున్నా మరింత దిగుబడులు సాధించ వచ్చు.
     - డాక్టర్ ఉమా మహేశ్వరరావు, శాస్త్రవేత్త,  చింతపల్లి, 9441075852
     
     మంచి ఆదాయం
     నాది చింతపల్లి మండలం చిక్కిసలబంద. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. అందులో మూడు ఎకరాల్లో పదేళ్లుగా రాజ్‌మా పంట చేపడుతున్నాను గతేడాది వెయ్యి కిలోల దిగుబడి వచ్చింది. రూ.65వేలు ఆదాయం సమకూరింది. సేంద్రియ పద్ధతిలో పండించడం, ఇంటిల్లిపాదీ కష్టపడడంతో మదుపులు రూ. 10వేలకు మించలేదు. ఈ ఏడాది శాస్త్రవేత్తల సలహాలతో దిగుబడి పెంచుకునేందుకు కృషి చేస్తున్నాను.         
    - జి.రాజుబాబు
     
     మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
     నాది చింతపల్లి మండలం సమ్మగిరి. రెండు ఎకరాలలో గతేడాది పంట చేపట్టాను. ఈ ఏడాదీ అదే స్థాయిలో పంటకు అనుకూలంగా భూములను సిద్ధం చేశాను. రాజ్‌మ్లాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరిన్ని లాభాలు వస్తాయి. ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నప్పటికి ప్రభుత్వపరంగా కొనుగోలు చేయడం లేదు. దీంతో దళారులు నిర్ణయించిన ధరలకే విక్రయించాల్సి వస్తోంది. మార్కెటింగ్ ఉంటే మరిన్ని లాభాలు సాధిస్తాం.    
         - వి.వెంకటరావు
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement