సెమీస్‌లో మహారాష్ట్ర, కర్ణాటక | Maharashtra and Karnataka enter semi finals of Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో మహారాష్ట్ర, కర్ణాటక

Published Sun, Jan 12 2025 2:29 AM | Last Updated on Sun, Jan 12 2025 4:10 AM

Maharashtra and Karnataka enter semi finals of Vijay Hazare Trophy

అర్షిన్‌ కులకర్ణి, దేవదత్‌ పడిక్కల్‌ సెంచరీలు 

నేడు మరో రెండు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు 

వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శనివారం జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్లో పంజాబ్‌పై మహారాష్ట్ర 70 పరుగుల తేడాతో విజయం సాధించగా... బరోడాపై కర్ణాటక 5 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 

యువ ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి (137 బంతుల్లో 107; 14 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... అంకిత్‌ బావ్నె (85 బంతుల్లో 60; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు. ఆఖర్లో వికెట్‌ కీపర్‌ నిఖిల్‌ (29 బంతుల్లో 52 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించడంతో మహారాష్ట్ర మంచి స్కోరు చేయగలిగింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (5), సిద్ధేశ్‌ వీర్‌ (0), రాహుల్‌ త్రిపాఠి (15) విఫలమయ్యారు. 

పంజాబ్‌ బౌలర్లలో టీమిండియా పేసర్‌ అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3, నమన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ జట్టు 44.4 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. తాజా సీజన్‌లో రికార్డు స్కోర్లు తిరగరాసిన పంజాబ్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (14), అభిõÙక్‌ శర్మ (19) ఎక్కువసేపు నిలవకపోవడంతో పంజాబ్‌కు మెరుగైన ఆరంభం లభించలేదు. 

అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (77 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా ఫలితం లేకపోయింది. రమణ్‌దీప్‌ సింగ్‌ (2), నేహల్‌ వధేర (6), విఫలమయ్యారు. చివర్లో అర్‌‡్షదీప్‌ సింగ్‌ (39 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేశ్‌ చౌధరీ 3 వికెట్లు, ప్రదీప్‌ రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో పాటు ఒక వికెట్‌ తీసిన అర్షిన్‌ కులకరి్ణకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

కర్ణాటకను గెలిపించిన పడిక్కల్‌ 
విజయ్‌ హజారే టోర్నీలో నాలుగుసార్లు టైటిల్‌ గెలిచిన కర్ణాటక జట్టు... హోరాహోరీగా సాగిన నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో బరోడాను మట్టికరిపించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కెప్టన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (6) విఫలం కాగా... దేవదత్‌ పడిక్కల్‌ (99 బంతుల్లో 102; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. అనీశ్‌ (64 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో మెరిశాడు. 

బరోడా బౌలర్లలో రాజ్‌ లింబానీ, అతిత్‌ సేత్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో తుదికంటా పోరాడిన బరోడా... చివరకు 49.5 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఓపెనర్‌ శాశ్వత్‌ రావత్‌ (126 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేయగా... అతిత్‌ సేత్‌ (56; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకం సాధించాడు. కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా (30) ఫర్వాలేదనిపించాడు. బరోడా విజయానికి చివరి 5 ఓవర్లలో 44 పరుగులు అవసరం కాగా... ప్రధాన ఆటగాళ్లు క్రీజులో ఉండటంతో విజయం ఖాయమనిపించింది. 

అయితే టీమిండియా పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ కట్టుదిట్టమైన బంతులతో బరోడా బ్యాటర్లను కట్టడి చేశాడు. 47వ ఓవర్‌లో సెంచరీ హీరో శాశ్వత్‌ రావత్‌తో పాటు మహేశ్‌ పిటియా (1)ను ఔట్‌ చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా...  బరోడా 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ, వాసుకి కౌషిక్, అభిలాశ్, శ్రేయస్‌ గోపాల్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. పడిక్కల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఆదివారం జరగనున్న క్వార్టర్‌ ఫైనల్స్‌లో గుజరాత్‌తో హర్యానా, విదర్భతో రాజస్థాన్‌ తలపడతాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement