విత్తు లేక విపత్తు
- మన్యంలో ‘రాజ్‌మా’యం
- విత్తనాల కొరత
- రెండేళ్లుగా పంపిణీ చేయని ఐటీడీఏ
- ఈ ఏడాది ప్రతిపాదనలకే పరిమితం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో ప్రధాన వాణిజ్య పంట అయిన రాజ్‌మాకు విత్తనాల కొరత ఏర్పడింది. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉన్నా విత్తనాలు లేకపోవడంతో గిరిరైతులు దిక్కులు చూస్తున్నారు. విత్తే సమయం ఆసన్నమైనప్పటికీ విత్తనాల పంపిణీకీ ఐటీడీఏ, వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
రెండేళ్ల నుంచీ సబ్సిడీ విత్తనాల్లేవు
రెండేళ్ల నుంచి ఐటీడీఏ, వ్యవసాయశాఖ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయకపోవడంతో ఏజెన్సీవ్యాప్తంగా రాజ్‌మా సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. గతేడాది దిగుబడి తక్కువ కావడంతో మంచి ధర పలకడంతో రైతులు వ్యాపారులకు విక్రయించేశారు. కొద్దిమంది మాత్రమే దాచుకున్నారు. వాస్తవానికి ఏజెన్సీ వ్యాప్తంగా మూడు వేల ఎకరాల్లో రాజ్‌మా సాగవుతున్నట్లు అంచనా. కానీ రెండేళ్ల నుంచి వెయ్యెకరాలు కూడా దాటినట్లు లేదు.
ప్రతిపాదనలకే పరిమితం
ఈ ఏడాది వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వెయ్యెకరాల విస్తీర్ణానికి సరిపడా రాజ్‌మా విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు ప్రకటించడంతో గిరిజన రైతులంతా సంతోష పడ్డారు. అయితే నెల రోజుల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైంది.
ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధరలు
మార్కెట్‌లో కిలో రాజ్‌మా విత్తనాలు రూ.80 నుంచి 90 పలకడంతో గిరి రైతులు వెనుకంజ వేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ గత ఏడాది పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో ఆ సంస్థ వద్ద కూడా రాజ్‌మా నిల్వలు లేకపోయాయి. గిరిజన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే రాజ్‌మా విత్తనాలనుపంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
ఏజెన్సీలో కనీసం వెయ్యెకరాల్లో రాజ్‌మా సాగు లక్ష్యంగా విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సబ్సిడీపై వీటిని గిరి రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు.