- తవ్వకాలకు వ్యతిరేకంగా ‘మావో’ల కమిటీలు!
- మూడు వారాల నుంచి నియామకాలు?
- కమిటీల నిర్వహణలో యువతకు భాగస్వామ్యం
పెదబయలు : మన్యంలో బాక్సైట్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పీసా చట్టం అమలుకు ప్రభుత్వం గ్రామసభల ద్వారా కమిటీలు ఏర్పాటు చేస్తుంటే, దానికి దీటుగా ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు మావోయిస్టులు మన్యంలోని 11 మండలాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మూడు వారాల నుంచి కమిటీల ఏర్పాటు జరుగుతుండగా, గ్రామాల్లో ఉన్న మిలీషియా కమిటీలు, మండలాల్లో దళాలు నూతనంగా ఏర్పడిన బాక్సైట్ వ్యతిరేక కమిటీలకు సూచనలు, సలహాలిస్తూ పని చేస్తుందని సమాచారం. మన్యంలో ఉన్న బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢంకాపథంగా చెబుతుండంతో ఇప్పటికే గిరిజన సంఘాలు గిరిజనులను ఉద్యమాలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
ఇక్కడ మావోయిస్టుల ఉనికి బలహీన పడిందని ప్రభుత్వం, పోలీసు నిఘావర్గాలు వెల్లడిస్తున్న ఈ తరుణంలో, వారు తమ ఉనికి కోల్పోకుండా గిరిజనులకు మరింతా చేరువయ్యేందుకు తమ వంతుగా బాక్సైట్ ఉద్యమానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నూతన కమిటీల ద్వారా గ్రామాల్లో బస చేసి బాక్సైట్ తవ్వకాల వల్ల జరిగే నష్టాలు, ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టే వ్యూహంపై కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిసింది.
దీనికి కీలకంగా యువతపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు భోగట్టా. గ్రామాల్లో ఉన్న యువతను, ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఈ కమిటీల్లో చేర్పి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు వినికిడి. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మన్యంలో ఎక్కడ రోడ్లు వేసినా, ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా వాటిని అడ్డుకోవాలని కమిటీలకు సూచనలు చేస్తున్నట్లు తెలిసింది.