ఉత్సవ్ టెన్షన్
26న మావోయిస్టుల ఏవోబీ బంద్
నిరసన వారోత్సవాల్లో అరకు ఉత్సవం
ఆందోళనలో అధికారగణం క్రైస్తవుల నుంచీ అభ్యంతరం
విశాఖపట్నం: శీతాకాలమైనా భగభగలాడుతున్న మన్యంలో ప్రభుత్వం మరో వేడిని రాజేస్తోంది. బాక్సైట్ తవ్వకాల జీవోకు నిరసనగా కొన్నాళ్ల నుంచి ఏజెన్సీలో తీవ్ర అలజడి రేగుతోంది. అయినప్పటికీ అరకు ఉత్సవ్ నిర్వహించి ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది. గిరిజనులతోపాటు మావోయిస్టులు బాక్సైట్‌పై గుర్రుగా ఉన్నారు. పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ పండగ వేళ విశాఖ, అరకు ఉత్సవాలు నిర్వహించడంపై క్రైస్తవుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఈ నెల 25, 26, 27ల్లో జరగాల్సిన విశాఖ ఉత్సవ్‌ను జనవరి 1, 2, 3 తేదీలకు వాయిదా వేసింది. మూడు రోజుల క్రితం వరకు అరకు ఉత్సవ్ తేదీలు ఇంకా ఖరారు కాలేదని సాక్షాత్తూ పాడేరు సబ్‌కలెక్టర్ శివశంకర్ కూడా చెబుతూ వచ్చారు. ఇంతలో అనూహ్యంగా సోమవారం 25 నుంచే అరకు ఉత్సవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే అరకు ట్రైబల్ మ్యూజియం ఎదుట అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం మరోసారి ధర్నా, ర్యాలీ నిర్వహించారు. బాక్సైట్ జీవోను రద్దు చేయకుండా ఉత్సవ్ జరగనీయబోమన్నారు. ఈ నెల 11న అరకు మండలం గెమ్మెల అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అరకు ఉత్సవ్‌ను బహిష్కరించాలని ఇప్పటికే మావోయిస్టులు పిలుపునిచ్చారు. పైగా సోమవారం నుంచి వీరు నిరసన వారోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. 26న ఏవోబీ బంద్ చేపట్టనున్నారు. తొలిరోజే ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని కాల్చి చంపి ఉనికిని చాటుకున్నారు.
బలగాలను దింపి..
అరకు ఉత్సవ్ నిర్వహణపై ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. నాలుగు రోజుల క్రితం కలెక్టర్ పాడేరులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి మీడియాను అనుమతించలేదు. ప్రభుత్వం మూడు రోజుల క్రితం నుంచి ఏజెన్సీలో భారీగా సాయుధ బలగాలను దించి కూంబింగ్ జరిపిస్తోంది. చుట్టూ భద్రతా దళాలను మోహరించి అరకు ఉత్సవ్‌ను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ మొండివైఖరి అధికారుల్లోనూ భయాందోళనలను రేకెత్తిస్తోంది. మూడు రోజులపాటు ఉత్సవ్ నిర్వహణ కత్తిమీద సామేనని, మావోయిస్టుల నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని వీరు ఆందోళన చెందుతున్నారు. అరకు ఉత్సవ్‌పై క్రైస్తవుల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్రిస్మస్ దృష్ట్యా విశాఖ ఉత్సవ్‌ను వాయిదా వేసిన ప్రభుత్వం అరకు ఉత్సవ్‌ను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
అరకు ఉత్సవ్‌ను అడ్డుకుంటాం..
ప్రభుత్వం క్రిస్మస్ రోజున అరకు ఉత్సవ్‌కు పూనుకోవడం అన్యాయం. ఇది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయడమే. విశాఖ ఉత్సవ్‌ను వాయిదా వేసి అరకు ఉత్సవ్‌ను ఎలా నిర్వహిస్తారు. క్రిస్మస్ రోజు జాతీయ సెలవు దినం. ప్రభుత్వ ఉద్యోగులు, క్రైస్తవులు ఆరోజు అరకు ఉత్సవాలకు ఎలా వెళ్తారు? ఏజెన్సీలో క్రైస్తవులు లేరా? రాష్ట్రంలోని క్రైస్తవ పెద్దలందరితోనూ చర్చిస్తాం. అరకు ఉత్సవ్‌ను అడ్డుకుంటాం. వాయిదా వేసే దాకా ఉద్యమిస్తాం.
-డాక్టర్ ఎం.జేమ్స్ స్టీఫెన్,
క్రైస్తవ ప్రతినిధి. విశాఖ