
రగిలిన బాక్సైట్ చిచ్చు
ఉధృతం కానున్న ఉద్యమం
మావోయిస్టుల చర్యలతో వేడెక్కిన మన్యం
గూడెంకొత్తవీధి: బాక్సైట్ చిచ్చు మన్యంలో సెగలు రేపుతుంది. అదను చూసి మావోయిస్టులు పంజా విసిరారు. ఈసారి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా బాక్సైట్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. బాక్సైట్ ప్రభావిత ప్రాంతాలైన జర్రెల, మొండిగెడ్డ పంచాయతీల్లో కొందరు గిరిజన యువకులు పునరావాస కమిటీలుగా ఏర్పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ 13 మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించింది. బాక్సైట్ ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ మావోయిస్టులు గతంలో ప్రజాకోర్టులు నిర్వహించి కమిటీ సభ్యులను హెచ్చరించి వదిలేశారు. 2011లో ఈ సంఘటన జరిగినప్పటికీ అదే గిరిజన యువకులు యథావిధిగా చింతపల్లి ఏపీ ఖనిజ అభివృద్ధి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వీరు పద్ధతి మార్చుకోకపోవడం మావోయిస్టులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జర్రెల, మొండిగెడ్డ పంచాయితీ కేంద్రాల్లో సాయుధులైన 30 మంది మావోయిస్టులు, వందలాది మంది మిలీషియా సభ్యులతో కలిసి కోరాబు లక్ష్మీ నారాయణ, రీమలి శ్రీను, కొలగాని బాబూరావు, సాగిన బంగారయ్య ఇళ్లను ధ్వంసం చేసి నిప్పంటించారు.
బాక్సైట్ ఉద్యమం ఉధృతం కానుందా..?
ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. అప్పుడప్పుడు చప్పగా సాగే బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం 2010 లో మావోయిస్టులు చర్యలతో వేడెక్కింది. బాక్సైట్‌కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడాన్ని నిరశిస్తూ, దీనికి ప్రతీకారంగా అప్పటి జెడ్పీ ఉపాధ్యక్షుడు ఉగ్రంగి సోమలింగంను చౌడుపల్లి గ్రామంలో దళసభ్యులు హతమార్చారు. రాజకీయ పార్టీల నాయకులంతా తమ పదవులకు రాజీనామా చే సి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా సుమారు 3 నెలల పాటు అజ్ఞాతంలోని వెళ్లిపోయారు. మావోయిస్టుల పిలుపుతోనే మళ్ళీ వెనక్కి వచ్చిన వీరు బాక్సైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. కాలక్రమంలో బాక్సైట్ ఉద్యమం చల్లబడింది. మావోయిస్టులకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సైతం ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు బాక్సైట్ తవ్వకాల అంశాన్ని గతేడాది తెరపైకి తెచ్చింది. మన్యంలో వేలాది హెక్టార్లలో నిక్షిప్తమైవున్న ఖనిజ తవ్వకాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆ శాఖ కార్యాలయంచింతపల్లిలో కొనసాగుతోంది. ఇందులో పని చేస్తున్న గిరిజన యువకుల ఇళ్లను ఈ కారణంగానే మావోయిస్టులు ధ్వంసం చేసి నిప్పటించారు.
ప్రజాకోర్టులో లొంగిపోండి.. ఈస్ట్ డివిజన్ కమిటీ పిలుపు
బాక్సైట్ పునరావాస కమిటీ సభ్యులుగా పని చేస్తున్న వారంతా వారం రోజుల్లోగా ప్రజా కోర్టులో లొంగిపోవాలని ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి జర్రెల, మొండిగెడ్డ ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడిన మావోయిస్టులు సంఘటన ప్రదేశం వద్ద పెద్ద పెద్ద గోడపత్రికలు అతికించి వెళ్లారు. పునరావాస కమిటీ సభ్యులారా! మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి గ్రామాల్లో సాధారణ జీవితాలను గడపాలని, కుటుంబ సభ్యులు వీరిపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో వారిని కూడా గ్రామం నుంచి తరిమేస్తామని, జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కు వ్యతిరేకంగా కరపత్రాలను అతికించారు. ఎస్‌ఆర్ కంపెనీ ప్రయోజనాల కోసమే మన్యంలో పోలీసు బలగాలు తిరుగుతున్నాయని, తమ ఆరోపణలకు సమాధానం చెప్పి గిరిజన గ్రామాల్లో దత్తత నిజస్వరూపాన్ని నిరూపించుకోవాలంటూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.