ఉద్యోగిపై ఒత్తిడి
బాక్సైట్ ఉద్యమానికి సహకరించాలంటున్న మావోయిస్టులు
వెళితే బైండోవర్ కేసులు పెడతామంటున్న పోలీసులు
చింతపల్లి: మన్యంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా పనిచేయాలంటూ ఇంతకాలం ఆదివాసీలు, గిరిజన ప్రజాప్రతినిధులను కోరిన మావోయిస్టులు ఇప్పుడు ఉద్యమానికి సహకరించాలంటూ ఏజెన్సీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. శుక్రవారం రాత్రి సిరిబాల సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల కిట్‌బ్యాగుల్లో ఈమేరకు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. జీకేవీధి అటవీ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని కొద్ది రోజులుగా ప్రజా ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకొని బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలకు సహకరించాలని కోరినట్టు సమాచారం. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య ఇంత వరకు అమాయక గిరిజనులు, ప్రజా ప్రతినిధులే నలిగిపోయారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. బాక్సైట్ తవ్వకాలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులపైనే ఒత్తిడి తెచ్చేవారు. తాజాగా ఉద్యమాలు చేపట్టాలంటూ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మన్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయి.
ఏజెన్సీలోని చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 1350 హెక్టార్‌లలో 246 మిలియన్ టన్నులు, అనంతగిరి,అరకులోయ ప్రాంతాల్లో 318 మిలియన్ టన్నుల బాక్సైట్ ఖనిజం వెలికితీతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా సూచన ప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం ఖనిజ తవ్వకాలకు చాపకింద నీరులా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొన్నేళ్ళుగా బాక్సైట్‌ను ఆదివాసీలతోపాటు మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తవ్వకాల వల్ల వందలాది గ్రామాలు ఖాళీ అయిపోతాయని, ప్రధానంగా వాణిజ్య సంపద అయిన కాఫీ తోటలు దెబ్బ తింటాయని, భూగర్భ జ లాలు అడుగంటి పోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని పర్యావరణవేత్తలు తలలు బాదుకుంటున్నారు. తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీతోపాటు వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు ఉద్యమాలు చేస్తునే ఉన్నాయి.
ఎన్నో విధ్వంసాలు..
బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలో మావోయిస్టులు సమిడి రవిశంకర్, ఉగ్రంగి సోమలింగం, జీకేవీధి వైస్ ఎంపీపీ సాగిన సోమలింగంలను దారుణంగా హత్య చేశారు. పలు విధ్వంసాలు సృష్టించారు. ఏపీఎండీసీలో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న పలువురు గిరిజన యువకుల ఇళ్లను ఇటీవల జర్రెలలో కూల్చివేశారు. ఇలా బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఇంత వరకు గిరిజనప్రజా ప్రతినిధులపైనే ఒత్తిడి తెచ్చిన దళసభ్యులు ఇటీవల ఉద్యోగుల సహకారం కోరుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.