Baindovar cases
-
పందేలకు నై!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంప్రదాయం పేరుతో సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సన్నద్ధం అవుతున్నారు. కోడిపందేలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఉండటంతో వాటిని అడ్డుకునేందుకు పోలీసులు బైండోవర్ కేసులతో ముందుకు వెళ్తున్నారు. అయినా పండగ మూడు రోజులు కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే కోడిపందేలు నిర్వహించే మండలాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సేవాసంస్థల బృందాలతో కమిటీలు వేశారు. ఇప్పటివరకు జిల్లాల్లో సుమారు 638 కేసులు నమోదు చేయగా, 2,730 మందిపై బెండోవర్ కేసులు పెట్టి కోడి కత్తులు స్వా«ధీనం చేసుకున్నారు. గతనెల 14 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఏలూరు సబ్‌డివిజన్‌లో 276 మందిపై 81 కేసులు, కొవ్వూరు సబ్‌డివిజన్ పరిధిలో 520 మందిపై 144 కేసులు, నరసాపురంలో 1,611 మందిపై 309 కేసులు, జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌లో 188 మందిపై 54 కేసులు, పోలవరం సబ్‌డివిజన్ పరిధిలో 135 మందిపై 50 కేసులు నమోదు చేశారు. అయినా పందెంరాయుళ్లు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈసారి భారీగా పందేలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. సంక్రాంతి పండగకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో జిల్లావ్యాప్తంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సంక్రాంతి సెలవులు కూడా ఇవ్వడంతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో కోడిపందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుట్టుగా బరులు సిద్ధం : పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల బరులను పోలీసులు ధ్వంసం చేస్తుండటంతో కబడ్డీ ఇతర క్రీడాపోటీలు అంటూ బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడా పోలీసుల కళ్లుకప్పి పందేలు మొదలయ్యాయి. కోడిపందేల నేపథ్యంలోనే పెదవేగి ఎస్సైపై జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వేటు వేయడంతో మిగిలిన అధికారుల్లో భయం మొదలైంది. దీంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బైండోవర్ కేసులను నమోదు చేశారు. కోడిపందేలకు ప్రసిద్ధి చెందిన భీమవరంతో పాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో సంక్రాంతి కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. గతంలో పందేలు జరిగిన గ్రామాల్లో పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయడంతోపాటు, గ్రామసభలు నిర్వహించి పందేలు, జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరి పని వారిది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు పోలీసుల బైండోవర్ కేసుల పేరుతో అడ్డుకున్నా చివరి నాలుగురోజులు అనుమతులు వస్తాయన్న నమ్మకంతో పందేల నిర్వాహకులు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
కాపు నేతలపై నిఘా రెట్టింపు
రెండు జిల్లాల్లో ముఖ్య నేతలపై పోలీస్ కన్ను కీలక ప్రాంతాల్లో పహారా నిరసనలు నిర్వహించకుండా ముందస్తు కట్టడి యత్నాలు నేతలపై బైండోవర్ కేసులు ముద్రగడ దీక్ష నేపథ్యంలో చర్యలు విజయవాడ : కాపు ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో ఆ సామాజిక వర్గ నేతలపై పోలీసు నిఘా మరింత పెరిగింది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగానే కట్టడి వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో ముఖ్య కాపు నేతలు, కాపు సంఘాల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగానే అదుపులోకి... ముద్రగడ ఉద్యమం తీవ్రమైన నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో గత వారం రోజుల నుంచే పూర్తిస్థాయి నిఘా కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షి స్తూ పోలీస్ కమిషనర్‌కు నివేదిస్తున్నారు. ముద్రగడ ఆస్పత్రిలోనే ఉండి దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించటానికి యత్నించే కాపు నేతల్ని ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. విజయవాడలో కాపులు అధికంగా నివసించే కృష్ణలంక, భవానీపురం, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో పికెటింగ్‌లు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బెంజ్‌సర్కిల్, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ పహరా కొనసాగుతోంది. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమం నిర్వహించినా చర్యలు తప్పవని స్థానిక స్టేషన్ల సీఐల ద్వారా కాపు నాయకులకు సమాచారం పంపారు. దీంతో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించకుండా ముందుగా కట్టడి చేశారు. మరోవైపు గుంటూరు నగరంలోనూ నిరసన కార్యక్రమాల కట్టడికి నిఘా పెట్టారు. తెలగ, బలిజ, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రామును ముందస్తు విచారణ పేరుతో రెండు రోజుల పాటు లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి పంపటం, మళ్లీ ఉదయం స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెట్టడం చేస్తున్నారు. గుంటూరు, పెదకాకాని, రేపల్లె, పొన్నూరుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. బైండోవర్ హడావుడితో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కాపు నేతలు విమర్శిస్తున్నారు. ఉద్యమంపై ఉక్కుపాదం... రాష్ట్ర ప్రభుత్వం కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపే దిశగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రెండు జిల్లాల్లో ఉద్యమం జరగకుండా ముందస్తు చర్యలతో పాటు కాపు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీస్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతల కదలికలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అవసరమైతే వినియోగించటానికి వీలుగా స్పెషల్ పార్టీ పోలీసులను సిద్ధంగా ఉంచారు. -
టీడీపీ సర్పంచ్‌లపై బైండోవర్ కేసులు
చోడవరం: విశాఖ జిల్లా చోడవరం మండలం పరిధిలో ఉచిత ఇసుకకు డబ్బులు వసూలు చేస్తూ దందాకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ఇద్దరిపై పనోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. చోడవరం మండలం జుత్తాడ గ్రామ సర్పంచ్ కొణతాల రామపెద్దప్పడు, గౌరీపట్నం సర్పంచ్ వరహాలబాబులు ఉచిత ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు అందడంతో పోలీసులు సుమోటోగా బైండోవర్ కేసులు నమోదు చేసి ఆర్టీవో కోర్టుకు తరలించారు. -
ఉద్యోగిపై ఒత్తిడి
బాక్సైట్ ఉద్యమానికి సహకరించాలంటున్న మావోయిస్టులు వెళితే బైండోవర్ కేసులు పెడతామంటున్న పోలీసులు చింతపల్లి: మన్యంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా పనిచేయాలంటూ ఇంతకాలం ఆదివాసీలు, గిరిజన ప్రజాప్రతినిధులను కోరిన మావోయిస్టులు ఇప్పుడు ఉద్యమానికి సహకరించాలంటూ ఏజెన్సీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. శుక్రవారం రాత్రి సిరిబాల సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల కిట్‌బ్యాగుల్లో ఈమేరకు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. జీకేవీధి అటవీ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని కొద్ది రోజులుగా ప్రజా ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకొని బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలకు సహకరించాలని కోరినట్టు సమాచారం. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య ఇంత వరకు అమాయక గిరిజనులు, ప్రజా ప్రతినిధులే నలిగిపోయారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. బాక్సైట్ తవ్వకాలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులపైనే ఒత్తిడి తెచ్చేవారు. తాజాగా ఉద్యమాలు చేపట్టాలంటూ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మన్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయి. ఏజెన్సీలోని చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 1350 హెక్టార్లలో 246 మిలియన్ టన్నులు, అనంతగిరి,అరకులోయ ప్రాంతాల్లో 318 మిలియన్ టన్నుల బాక్సైట్ ఖనిజం వెలికితీతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా సూచన ప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం ఖనిజ తవ్వకాలకు చాపకింద నీరులా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొన్నేళ్ళుగా బాక్సైట్‌ను ఆదివాసీలతోపాటు మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తవ్వకాల వల్ల వందలాది గ్రామాలు ఖాళీ అయిపోతాయని, ప్రధానంగా వాణిజ్య సంపద అయిన కాఫీ తోటలు దెబ్బ తింటాయని, భూగర్భ జ లాలు అడుగంటి పోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని పర్యావరణవేత్తలు తలలు బాదుకుంటున్నారు. తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీతోపాటు వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు ఉద్యమాలు చేస్తునే ఉన్నాయి. ఎన్నో విధ్వంసాలు.. బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలో మావోయిస్టులు సమిడి రవిశంకర్, ఉగ్రంగి సోమలింగం, జీకేవీధి వైస్ ఎంపీపీ సాగిన సోమలింగంలను దారుణంగా హత్య చేశారు. పలు విధ్వంసాలు సృష్టించారు. ఏపీఎండీసీలో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న పలువురు గిరిజన యువకుల ఇళ్లను ఇటీవల జర్రెలలో కూల్చివేశారు. ఇలా బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఇంత వరకు గిరిజనప్రజా ప్రతినిధులపైనే ఒత్తిడి తెచ్చిన దళసభ్యులు ఇటీవల ఉద్యోగుల సహకారం కోరుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. -
చర్చలకు పిలిచి అరెస్టులా?
- సింథటిక్ కార్మికులపై పోలీసుల దాష్టీకం - యాజమాన్యం కొమ్ము కాసిన పోలీస్‌శాఖ - బైండోవర్ కేసులు బనాయించి విడిచిపెట్టిన వైనం - ఆందోళనలో కార్మిక కుటుంబాలు రాజాం రూరల్: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని అంతకాపల్లి పంచాయతీ సమీపంలో ఉన్న సింథటిక్ కర్మాగార యాజమాన్యం పోలీసులతో కుమ్మక్కై కార్మికులపై అమానుషంగా ప్రవర్తించింది. కర్మాగార అక్రమ లే-ఆఫ్‌కు నిరసగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు దిగివచ్చినట్టు నటించిన యాజమాన్యం పోలీసులను రాయబారిగా పెట్టి సెటిల్మెంట్ చేస్తామని పిలిపించి అరెస్టు చేయించింది. పోలీసులు సైతం యాజమాన్యానికి కొమ్ముకాసి కార్మికులపై నిర్దయగా వ్యవహరించారు. వివరాలివీ.. సింథటిక్ కర్మాగారం నష్టాల్లో నడుస్తోందని చెప్పి యాజమాన్యం ఈ ఏడాది ఆగస్టు 8న అకస్మాత్తుగా లేఆఫ్ ప్రకటించింది. దీంతో సుమారు 150 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆందోళన చేపట్టగా నెలలో సగం జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆగస్టు, సెప్టెంబర్ లేఆఫ్ జీతాలు చెల్లించి తర్వాత నెలల జీతాలు చెల్లించకుండా చేతులెత్తేసింది. దీంతో కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. అనంతరం స్పందించిన యాజమాన్యం కార్మికులకు పూర్తిగా సెటిల్మెంట్ చేస్తామని ఈ నెల 9న పిలిపించినా, ఎంతోకొంత పెట్టి పంపించేసే ధోరణిలో పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడారు. దీనిని వ్యతిరేకించిన కార్మికులు వెంటనే కర్మాగార సిబ్బందిని నిర్బంధించి ఆందోళన చేపట్టారు. ఇన్చార్జ్ సీఐ తమ్మినేని సీతారాం రంగప్రవేశం చేసి యాజమాన్యంతో మాట్లాడి రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు వెనుదిరిగారు. అయితే శుక్రవారం మరోమారు చర్చలు జరుపుకుందాం రమ్మంటూ కార్మికులను యాజమాన్యం పిలిచింది. అంతకు ముందే పోలీసులను ఆశ్రయించి కార్మగారం చుట్టూ రక్షణ ఏర్పాటు చేసుకుంది. సుమారు 10 మంది పోలీసులు ఉదయం 7 గంటలకే సంఘటన స్థలానికి చేరుకున్నారు. యథావిధిగా 10 గంటలకు వచ్చిన కార్మికులు శాంతియుతంగా ధర్నా కొనసాగించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నతాధికారుల ఒత్తిడి అధికమవ్వడంతో సీఐ సీతారాం తన సిబ్బందితో వచ్చి కార్మికులందరినీ అరెస్టు చేశారు. దీంతో కార్మిక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే ఎలా అంటూ నిలదీశారు. తక్షణమే యాజమాన్యం దిగి వచ్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే పోలీస్ స్టేషన్లోనే నిర శన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు పాలకొండ డీఎస్పీని సంప్రదించారు. ఆయన ఆదేశాల మేరకు కార్మికులందరిపైనా బైండోవర్ కేసులు నమోదు చేసి పూచీకత్తులపై విడిచిపెట్టారు.