కాపు నేతలపై నిఘా రెట్టింపు
రెండు జిల్లాల్లో ముఖ్య నేతలపై పోలీస్ కన్ను
కీలక ప్రాంతాల్లో పహారా
నిరసనలు నిర్వహించకుండా ముందస్తు కట్టడి యత్నాలు
నేతలపై బైండోవర్ కేసులు
ముద్రగడ దీక్ష నేపథ్యంలో చర్యలు
విజయవాడ : కాపు ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో ఆ సామాజిక వర్గ నేతలపై పోలీసు నిఘా మరింత పెరిగింది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగానే కట్టడి వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో ముఖ్య కాపు నేతలు, కాపు సంఘాల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు.
ముందుగానే అదుపులోకి...
ముద్రగడ ఉద్యమం తీవ్రమైన నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో గత వారం రోజుల నుంచే పూర్తిస్థాయి నిఘా కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షి స్తూ పోలీస్ కమిషనర్‌కు నివేదిస్తున్నారు. ముద్రగడ ఆస్పత్రిలోనే ఉండి దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించటానికి యత్నించే కాపు నేతల్ని ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. విజయవాడలో కాపులు అధికంగా నివసించే కృష్ణలంక, భవానీపురం, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో పికెటింగ్‌లు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బెంజ్‌సర్కిల్, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ పహరా కొనసాగుతోంది. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమం నిర్వహించినా చర్యలు తప్పవని స్థానిక స్టేషన్ల సీఐల ద్వారా కాపు నాయకులకు సమాచారం పంపారు. దీంతో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించకుండా ముందుగా కట్టడి చేశారు. మరోవైపు గుంటూరు నగరంలోనూ నిరసన కార్యక్రమాల కట్టడికి నిఘా పెట్టారు. తెలగ, బలిజ, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రామును ముందస్తు విచారణ పేరుతో రెండు రోజుల పాటు లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి పంపటం, మళ్లీ ఉదయం స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెట్టడం చేస్తున్నారు. గుంటూరు, పెదకాకాని, రేపల్లె, పొన్నూరుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. బైండోవర్ హడావుడితో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కాపు నేతలు విమర్శిస్తున్నారు.
ఉద్యమంపై ఉక్కుపాదం...
రాష్ట్ర ప్రభుత్వం కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపే దిశగా కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రెండు జిల్లాల్లో ఉద్యమం జరగకుండా ముందస్తు చర్యలతో పాటు కాపు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై పోలీస్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతల కదలికలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అవసరమైతే వినియోగించటానికి వీలుగా స్పెషల్ పార్టీ పోలీసులను సిద్ధంగా ఉంచారు.