ఖాకీల తీరుతో కలకలం | Police, Maoist-dominated Fighting | Sakshi
Sakshi News home page

ఖాకీల తీరుతో కలకలం

Published Tue, Jan 12 2016 1:10 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Police, Maoist-dominated Fighting

పోలీసులు, మావోయిస్టుల ఆధిపత్య పోరులో సమిధలవుతున్న గిరిజనం
మాజీ సర్పంచ్ హత్య సంఘటనలో గిరిజనులను నిర్బంధించిన పోలీసులు
తమ వారిని విడిచిపెట్టాలని విలపించిన కుటుంబసభ్యులు
బాధితల వేదన చూసి కంటతడిపెట్టిన ఎమ్మెల్యే ఈశ్వరి

 
 విశాఖపట్నం/చింతపల్లి: మన్యంలో బాక్సైట్ వ్యవహారం గిరిజనుల స్వేచ్ఛకు, మనుగడకు భంగం కలిగిస్తోంది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం సాగిస్తున్న గిరిజనులకు అడుగడుగునా నిర్బంధాలు ఎదురవుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 97ను జారీ చేసిన నేపథ్యంలో మావోయిస్టులు మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరు సాగిస్తున్నారు. తాజాగా ఈ బాక్సైట్ వ్యవహారంలో ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరు మొదలవడంతో గిరిజనులకు ప్రాణసంకటంగా మారింది. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల చర్యల మూలంగా గిరిజన నలిగిపోతున్నారు. బాక్సైట్ వ్యవహారంలో మావోయిస్టులు టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణను హత్య చేసిన ఘటనపై పోలీసులు పలు గ్రామాల గిరిజనులను అదుపులోకి తీసుకొని నిర్బంధించారు. దీంతో చింతపల్లి ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో పోలీసు యంత్రాంగం ఇదే తరహాలో వ్యవహరించి తీవ్ర వైఫల్యాలను చవిచూసి తమ పంథా మార్చుకున్నారు.  గిరిజనులతో మైత్రికి  ప్రయత్నించి  గిరిజనుల్లో ధైర్యాన్ని నింపి ఏడాదిగా మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. అయితే   గత అనుభవాలను, గిరిజనులతో మైత్రిని విస్మరించి పోలీసులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. తెల్లారకముందే గ్రామాల్లోకెళ్లి అనుమానితులుగా భావించి గిరిజనులను తీసుకొచ్చే ఒరవడి ప్రారంభించడంతో విశాఖ మన్యం ఒక్కసారిగా వేడెక్కింది.

గిరిజనులతో మైత్రి బూటకమా?
ఇంతకాలం గిరిజనులతో మైత్రి పేరిట చేసిన సేవలన్నీ మావోయిస్టుల కట్టడికోసమేనా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మావోయిస్టులు ఎంతోమందిని ఇన్‌ఫార్మర్ల పేరిట హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో భాగంగా జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రవిశంకర్‌ను,  ఆయన స్థానంలో  బాధ్యతలు చేపట్టిన  ఉగ్రంగి సోమలింగంను  మావోయిస్టులు కాల్చి చంపారు.   ఆయితే ఏ సంఘటనలోనూ ఏజెన్సీ పోలీసు యంత్రాంగం గిరిజనులను ఈ హత్యలకు బాధ్యులను చేస్తూ  ఎవరినీ వే ధించిన దాఖలాలు లేవు. నేరుగా మావోయిస్టులనే టార్గెట్ చేస్తూ గిరిజనుల మద్దతుతో మావోయిస్టు కార్యకలాపాలకు అడుగడుగునా కళ్లెం వేస్తూ గిరిజనుల మన్ననలు పొందిన పోలీసుల తీరు  వెంకటరమణ హత్య సంఘటనలో   పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు వరకు   గిరిజనులతో చెలిమికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.

దీనికి ప్రతిఫలంగా మావోయిస్టు కార్యకలాపాలకు కంచుకోటగా ఉండే చింతపల్లి మండలం కోరుకొండ నడిబొడ్డులో మావోయిస్టు నాయకుడు శరత్‌ను గిరిజనుల మట్టుపెట్టి ఏకే47 తుపాకీతో సహా పోలీసులకు అప్పగించారు.  దీనిని  అప్పటి డీజీపీ ఓ శుభపరిణామంగా పేర్కొన్నారు. మరి మావోయిస్టులు నేడు చేసిన హత్యా నేరాన్ని గిరిజనులపై రుద్ది,  చిత్రహింసలకు గురిచేస్తూ గిరిజనులను గ్రామాల నుంచి తీసుకువచ్చి ఇంటరాగేషన్ పేరిట ఎక్కడుంచారో కూడా తెలియని ఆందోళనకర పరిస్థితిని ఎందుకు సృష్టిస్తున్నారో? అంతుచిక్కడం లేదని బాధిత కుటుంబాలు విలపిస్తున్నాయి.
 
విలపించిన బాధిత కుటుంబాలు
మావోయిస్టులు  సాగిన వెంకటరమణను హత్య చేసిన నేపథ్యంలో  మూడు రోజులుగా పోలీసులు జర్రెల, అసంపల్లి, కోండ్రుపల్లి, గిల్లగొంది గ్రామాల నుంచి 28 మందిని నిర్బధించారని బాదిత కుటుంబాలతోపాటు  ఆయా గ్రామాల గిరిజనులు సోమవారం చింతపల్లి చేరుకున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలీసు స్టేషన్ మెయిన్ గేటువద్ద  తమ వారిని వదిలిపెట్టాలంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.  చంటి పిల్లల్ని చంకన పెట్టుకొని పస్తులతో వారు పడిన బాధలు వర్ణనాతీతం. ‘అయ్యా   మాకేపాపం తెలియదు.. నా భర్తను మూడు రోజులుగా  నిర్బంధించారు.. ఒక్కసారి చూడనీయండంటూ జెర్రెల ఎంపీటీసీ ఉగ్రంగి జగ్గమ్మ ..  బాబూ నా కొడుకును ఒక్కసారి చూపించండి అంటూ ఓ తల్లి... నా ఏడాది పాప నాన్నకోసం ఏడుస్తోంది నన్ను అతని దగ్గర కు పంపండి’ అంటూ ఓ మహిళ   రోదించారు.

కంటతడిపెట్టిన ఎమ్మెల్యే
ఈ సంఘటన తెలుసుకొని చింతపల్లి చేరుకొన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని బాధిత గ్రామాల గిరిజనులంతా చుట్టుముట్టి బోరున విలపించారు. పోలీసులు తమవారిని ఎత్తుపోయారంటూ  ఆవేదనకు లోనయ్యారు. దీంతో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సైతం వారితో పాటు విలపించడంతో అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.  ఆ బాధలోనే ఆమె పోలీసు అధికారులకు ఫోన్ చేసి అయ్యా మా గిరిజనులకు ఈ దుస్థితి నుంచి విముక్తి కలింగించండంటూ  దగ్ధద స్వరంతో ప్రాధేయ పడ్డారు. ఇంత అన్యాయం ఏమిటని, ప్రజాస్వామ్యంలో ఉన్న గిరిజనులపై ఇంతటి నిర్బంధ వాతావరణం ఏమటని వాపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement