(చింతపల్లి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు) : దేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో నిర్మించిన ఏఎస్‌ఆర్ జిల్లా చింతపల్లిలోని కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ లాభాల పంట పండిస్తోంది. కాఫీ రైతులకు మద్దతు ధర దక్కేలా చేయడంతోపాటు అంతకు మించి బోనస్ రూపంలో ఆదాయాన్ని రుచి చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో రూ.4.56 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని నిర్మించింది. 3 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పల్పింగ్ యూనిట్‌ను నెలకొల్పింది.
దీనికి అనుబంధంగా మరో రెండు ఎకరాల్లో రూ.1.68 కోట్లతో వెయ్యి మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించింది. ప్రాసెస్ అయిన పార్చ్‌మెంట్ కాఫీ గింజల్ని త్వరగా ఆరబెట్టుకునేలా గతేడాది మరో రూ.45 లక్షలతో రోటరీ డ్రయ్యర్‌ను ఐటీడీఏ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పల్పింగ్ యూనిట్ నిర్వహించేలా ఎకో ఫ్రెండ్లీగా నిర్మించడం విశేషం.
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నేతృత్వంలో ఏజెన్సీలోని 11 మండలాలకు చెందిన కాఫీ పండ్ల (ఫ్రూట్స్)ను సేకరిస్తున్నారు. ఏటా అపెక్స్ కమిటీ నిర్ణయించిన మద్దతు ధరకు కాఫీ పండ్లను సేకరించడంతో బయటి డీలర్లు సైతం అంతకు మించిన ధర చెల్లించి కొనుగోలు చేసేలా పోటీ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కాగా, చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ సేకరించిన కాఫీ పండ్లను ప్రాసెస్ చేసి (కాయలపై తొక్క తొలగించి) పార్చ్‌మెంట్ (కాఫీ గింజలు)గా చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన పార్చ్‌మెంట్ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని విక్రయించి లాభాల పంట పండిస్తున్నారు.
మరో రెండు యూనిట్లు
చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ మంచి ఫలితాలు సాధించడంతో ప్రభుత్వం మరో రెండు ఎకో పల్పింగ్ యూనిట్లు నిర్మిస్తోంది. జి.మాడుగుల, జీకే వీధిలో రూ.7 కోట్ల 70 లక్షల 32 వేలతో వీటిని నెలకొల్పుతోంది. గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ రెండు యూనిట్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 2024 సీజన్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టారు. – ఎన్.అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్ట్
లాభాలు సాధిస్తోంది
దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన రైతుల ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తోంది. గిరిజన సంక్షేమ, ఐటీడీఏ, ఏపీ ట్రైకార్ అధికారుల పర్యవేక్షణలో చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌ను లాభాల బాటలో నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సహకార సంఘంలో 1,500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మరో వెయ్యి మందిని చేర్చుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ఈ ప్రాంత గిరిజనులకు రోజువారీ పనులు కల్పించి ఉపాధి చూపిస్తున్నాం. పల్పింగ్ యూనిట్‌లో పార్చ్‌మెంట్ కాఫీ ప్రాసెస్‌కు రోజుకు కనీసం వంద మందికి పైగా పనిచేస్తారు. పగటిపూట మహిళలకు రూ.320, మగవాళ్లకు రూ.350, రాత్రి వేళ అయితే రూ.450 చొప్పున వేతనం చెల్లిస్తున్నాం. – సెగ్గే కొండలరావు, అధ్యక్షుడు, విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం
గిరిజన రైతులకు ఏటా బోనస్
ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసిన చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ లాభాలు సాధించడంతోపాటు కాఫీ రైతులకు ఏటా బోనస్ అందిస్తోంది. కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ హామీతో చింతపల్లి యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ సంస్థ రూ.1.56 కోట్ల రుణం ఇచ్చింది. రుణ మొత్తాన్ని గత ఏడాది చెల్లించాం. రూ.2 కోట్లు లాభాలు సాధించాం. ప్లాంట్ నిర్వహణ వ్యయం పోగా మిగిలిన సొమ్ముతో కాఫీ ఫ్రూట్ సేకరణ చేపట్టాం. – పీవీవీ సత్యనారాయణ, ఇన్‌చార్జ్, చింతపల్లి కాఫీ పల్పింగ్ యూనిట్
Comments
Please login to add a commentAdd a comment