cooperative society
-
కాఫీ.. రైతులు హ్యాపీ
(చింతపల్లి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు) : దేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో నిర్మించిన ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లిలోని కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ లాభాల పంట పండిస్తోంది. కాఫీ రైతులకు మద్దతు ధర దక్కేలా చేయడంతోపాటు అంతకు మించి బోనస్ రూపంలో ఆదాయాన్ని రుచి చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో రూ.4.56 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని నిర్మించింది. 3 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పల్పింగ్ యూనిట్‌ను నెలకొల్పింది. దీనికి అనుబంధంగా మరో రెండు ఎకరాల్లో రూ.1.68 కోట్లతో వెయ్యి మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించింది. ప్రాసెస్ అయిన పార్చ్మెంట్ కాఫీ గింజల్ని త్వరగా ఆరబెట్టుకునేలా గతేడాది మరో రూ.45 లక్షలతో రోటరీ డ్రయ్యర్‌ను ఐటీడీఏ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పల్పింగ్ యూనిట్ నిర్వహించేలా ఎకో ఫ్రెండ్లీగా నిర్మించడం విశేషం. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నేతృత్వంలో ఏజెన్సీలోని 11 మండలాలకు చెందిన కాఫీ పండ్ల (ఫ్రూట్స్)ను సేకరిస్తున్నారు. ఏటా అపెక్స్ కమిటీ నిర్ణయించిన మద్దతు ధరకు కాఫీ పండ్లను సేకరించడంతో బయటి డీలర్లు సైతం అంతకు మించిన ధర చెల్లించి కొనుగోలు చేసేలా పోటీ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కాగా, చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ సేకరించిన కాఫీ పండ్లను ప్రాసెస్ చేసి (కాయలపై తొక్క తొలగించి) పార్చ్మెంట్ (కాఫీ గింజలు)గా చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన పార్చ్మెంట్ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని విక్రయించి లాభాల పంట పండిస్తున్నారు. మరో రెండు యూనిట్లు చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ మంచి ఫలితాలు సాధించడంతో ప్రభుత్వం మరో రెండు ఎకో పల్పింగ్ యూనిట్లు నిర్మిస్తోంది. జి.మాడుగుల, జీకే వీధిలో రూ.7 కోట్ల 70 లక్షల 32 వేలతో వీటిని నెలకొల్పుతోంది. గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ రెండు యూనిట్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 2024 సీజన్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టారు. – ఎన్.అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్ట్ లాభాలు సాధిస్తోంది దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన రైతుల ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తోంది. గిరిజన సంక్షేమ, ఐటీడీఏ, ఏపీ ట్రైకార్ అధికారుల పర్యవేక్షణలో చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌ను లాభాల బాటలో నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సహకార సంఘంలో 1,500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మరో వెయ్యి మందిని చేర్చుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ఈ ప్రాంత గిరిజనులకు రోజువారీ పనులు కల్పించి ఉపాధి చూపిస్తున్నాం. పల్పింగ్ యూనిట్లో పార్చ్మెంట్ కాఫీ ప్రాసెస్‌కు రోజుకు కనీసం వంద మందికి పైగా పనిచేస్తారు. పగటిపూట మహిళలకు రూ.320, మగవాళ్లకు రూ.350, రాత్రి వేళ అయితే రూ.450 చొప్పున వేతనం చెల్లిస్తున్నాం. – సెగ్గే కొండలరావు, అధ్యక్షుడు, విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం గిరిజన రైతులకు ఏటా బోనస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసిన చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ లాభాలు సాధించడంతోపాటు కాఫీ రైతులకు ఏటా బోనస్ అందిస్తోంది. కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ హామీతో చింతపల్లి యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ సంస్థ రూ.1.56 కోట్ల రుణం ఇచ్చింది. రుణ మొత్తాన్ని గత ఏడాది చెల్లించాం. రూ.2 కోట్లు లాభాలు సాధించాం. ప్లాంట్ నిర్వహణ వ్యయం పోగా మిగిలిన సొమ్ముతో కాఫీ ఫ్రూట్ సేకరణ చేపట్టాం. – పీవీవీ సత్యనారాయణ, ఇన్చార్జ్, చింతపల్లి కాఫీ పల్పింగ్ యూనిట్ -
‘కొంప’ముంచిన ‘కార్తికేయ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సహకార చట్టాలను చట్టుబండలు చేస్తూ కొన్ని కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు ఖాతాదారుల కొంప ముంచేస్తున్నాయి. కాకినాడ జయలక్ష్మి మ్యూచువల్లీ కోఆపరేటివ్ బ్యాంకు రూ.560 కోట్లకు బోర్డు తిప్పేసి, సుమారు 20 వేల మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారం మరచిపోకుండానే మరో సంస్థ అయిన కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ డిపాజిటర్ల సొమ్ములు తిరిగి ఇవ్వకుండా దాటవేస్తోంది. దీంతో వారందరూ లబోదిబోమంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ సొసైటీకి 300 మందికి పైగానే డిపాజిటర్లు ఉన్నారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఉన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన సుమారు 100 మంది డిపాజిటర్లు తాము మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నగరంతో పాటు కోనసీమలో నాలుగైదు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, మెట్ట ప్రాంతం, తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారు ఈ సొసైటీలో డిపాజిట్లు చేశారు. పదిహేనేళ్ల క్రితం కాకినాడ ప్రధాన కూడలి నూకాలమ్మ ఆలయానికి సమీపాన సహకార రంగంలో కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఏర్పాటైంది. ఇది డిపాజిట్ల రూపంలో రూ.12 కోట్లు సేకరించింది. రూ.5 కోట్ల వరకూ రుణాలూ ఇచ్చింది. మెచ్యూరిటీ గడువు తీరినా.. ఇక ఈ డిపాజిట్లలో రూ.10 కోట్ల డిపాజిట్ల గడువు తీరిపోయింది. డిపాజిటర్లను రేపు మాపు అని బ్యాంకు సిబ్బంది నాలుగైదు నెలలుగా తిప్పి పంపేస్తున్నారు. దీంతో బాధితులు జిల్లా సహకార అధికారులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యాన ప్రాథమిక విచారణ జరిగింది. సొసైటీ ఇచ్చిన రుణాల్లో రూ.4.50 కోట్లకు సంబంధించి తనఖా కింద ఎటువంటి డాక్యుమెంట్లూ లేవని తేలింది. సొసైటీ ఆడిట్ కూడా ప్రైవేటు ఆడిటర్లతో నిర్వహిస్తున్నారు. మరోవైపు.. డిపాజిటర్లు సహకార అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన రికార్డుల కోసం సహకార శాఖ సమన్లు జారీచేసినా సొసైటీ నిర్వాహకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సహకార శాఖ విచారణకు ఆదేశించింది. డిపాజిట్లు సరిచూసుకోవాలి డిపాజిటర్లు తమ సొమ్ము సొసైటీ ఖాతాలో డిపాజిట్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. సొసైటీ వద్ద విచారణాధికారి అందుబాటులో ఉన్నారు. సొమ్ము డిపాజిటర్ల ఖాతాలో జమకాకుంటే చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి, కాకినాడ రూ.7.80 లక్షలు డిపాజిట్ చేశాం కార్తికేయ సొసైటీలో నేను, నా భార్య కలిసి రూ.7.8 లక్షలు డిపాజిట్ చేశాం. నాలుగేళ్ల పాటు వడ్డీ ఇచ్చారు. ఏడాది నుంచి ఇవ్వడంలేదు. సమాధానం కూడా చెప్పడంలేదు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – సజ్జాద్ హుస్సేన్, బాధితుడు, నగరం రూ.44 లక్షలు డిపాజిట్ చేశాం ప్రలోభాలకు గురిచేసి మాతో ఈ బ్యాంకులో డిపాజిట్ చేయించారు. నగరం నుంచి సుమారు రూ.7 కోట్లు డిపాజిట్ చేశారు. మా కుటుంబ సభ్యులు రూ.44 లక్షలు డిపాజిట్ చేశాం. బాధ్యులపై చర్యలు తీసుకుని, మా సొమ్ములు మాకు ఇప్పించాలి. – అన్వర్ తాహిర్ హుస్సేన్, బాధితుడు, నగరం -
పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
రాయదుర్గం: పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబరాబాద్ పోలీసు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం పునరుద్ధరించిన సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించడం జరుగుతుందని, సొసైటీ సభ్యులంతా కలిసి సొసైటీని ముందుకు తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొసైటీ సభ్యులకు మేలు చేసే కొత్త ఆలోచలనకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధమన్నారు. సైబరాబాద్ అన్ని రకాల ఫార్మాట్లలో ముందుగా ఉందని, ముఖ్యంగా క్రైమ్ డిటెన్షన్ సైబర్ క్రైమ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్, 17 ఫంక్షనల్ వరి్టకల్స్లో టాప్‌లో ఉందన్నారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క సర్విసులు, సొసైటీ యాప్ ద్వారా సభ్యులు చూసుకోవచ్చన్నారు. సొసైటీలో లావాదేవీలు అన్నీ పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో 72 ఏళ్ల చరిత్ర గల పాత సొసైటీని మూసివేస్తూ కోఆపరేటివ్ సొసైటీ ఆర్డర్ల ప్రకారం కొత్త సొసైటీని ప్రారంభించనున్నారు. సొసైటీలో గతేడాది ఏప్రిల్ 1 నాటికి ఉన్న షేర్ హోల్డర్లకు 40 శాతం, 2022–23 ఏడాదికి ఉన్న షేర్ హోల్డర్లకు 11 శాతం డివిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సభ్యులు నెలవారీ పొదుపునకు ఇచ్చే వడ్డీ 7.5 శాతం నుంచి 8 శాతానికి నిర్ణయించారు. ప్రతి సభ్యుడికి రూ.10 లక్షల గాను 8.5 శాతం వడ్డీపై లోన్లు ఇవ్వడానికి సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, అడ్మిన్ డీసీపీ యోగేష్ గౌతమ్, సొసైటీ సెక్రెటరీ, ఏసీపీ సురేందర్‌రావు, కోశాధికారి జి.మల్లేశం, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, డైరెక్టర్లు, ఎస్ఈ రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ సరిత, హెడ్‌కానిస్టేబుల్ రాజారెడ్డి, కె.మాధవీలతా, ఇతర సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. -
‘జయలక్ష్మి’ పాలకవర్గం రద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన కాకినాడలోని ది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ (ఎంఏఎం) కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం రద్దు అయ్యింది. చైర్మన్ సహా 10 మంది డైరెక్టర్లపై మహాజనసభ అనర్హత వేటు వేసింది. డిపాజిట్లకు 12.5 శాతం వడ్డీలు ఇస్తామని ఆశ చూపి రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లలో 19,971 మంది విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు ఇలా అన్ని వర్గాల నుంచి రూ.520 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించారని ప్రాథమికంగా నిర్ధారించారు. డిపాజిట్ల గడువు ముగిసినా సొమ్ములు చెల్లించకపోవడంతో ‘జయలక్ష్మి’ గత ఏప్రిల్ 6న బోర్డు తిప్పేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న సొసైటీ పాలకవర్గంపై బాధితుల ఫిర్యాదులతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీబీసీఐడీ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. సొసైటీ రికార్డులను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకార శాఖలోని రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు విచారణ చేస్తున్నారు. సొసైటీ నిర్వహణ లేక కుంటుపడుతోందని.. వెంటనే మహాజన సభ ఏర్పాటు చేయాలని డిపాజిటర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌కు అందిన లేఖతో శనివారం కాకినాడలో మహాజనసభ ఏర్పాటు చేశారు. ఇందులో పలు తీర్మానాలు ఆమోదించారు. అడ్హాక్ కమిటీకి పాలకవర్గం బాధ్యతలు సుమారు రూ.520 కోట్లు డిపాజిట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితులు, సొసైటీ పరిపాలన మందగించడం, వారిపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో చైర్మన్ సహా 10 మంది సభ్యులు డైరెక్టర్లుగా కొనసాగే అర్హత లేదని మహాజనసభ నిర్ణయించింది. 30 రోజుల్లోపు పాలకవర్గం మహాజనసభ ఏర్పాటు చేయకపోవడంతో సంఘం బైలా ప్రకారం సభ్యులపై అనర్హత వేటు వేసింది. పరారీలో ఉన్న పాలకవర్గ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా మరో తీర్మానాన్ని ఆమోదించింది. పాలకవర్గ చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ ఆర్బీ విశాలాక్షి, ట్రెజరర్ ఏపీఆర్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.జయదేవ్‌మణి, డైరెక్టర్లు.. నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఎస్.చక్రభాస్కరరావు, వి.నరసయ్య, జి.నారాయణమూర్తి, మాజీ ట్రెజరర్ డి. వెంకటేశ్వరరావులను పాలకవర్గంలో కొనసాగేందుకు అనర్హులుగా ప్రకటించారు. వీరిని పాలకవర్గం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. తొలగించిన సభ్యుల స్థానంలో సొసైటీ బైలా ప్రకారం కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునే వరకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా 10 మందితో అడ్హాక్ కమిటీని నియమించారు. దీనికి చైర్మన్‌గా వీఎస్వీ సుబ్బారావు, సభ్యులుగా.. గోదావరి శ్రీనివాస చక్రవర్తి, ఎండీ మెహబూబ్ రెహ్మాన్, పీవీ రమణమూర్తి, అంగర నరసింహారావు, సూరి రామ్‌ప్రసాద్, చింతలపూడి సుబ్రహ్మణ్యం, షేక్ జానీ బాషా, ఏవీఎస్ రవికుమార్, జ్యోతుల స్వామిప్రసాద్‌లను నియమించారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు చేసే వరకు సొసైటీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగించారు. -
ఎంత దా’రుణ’మో.. నష్టాల ఊబిలో జయలక్ష్మి సొసైటీ
కాకినాడ రూరల్(కాకినాడ జిల్లా): ఆకర్షణీయమైన వడ్డీల మోజులో పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న సొమ్ములను జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) చేసుకున్న సభ్యులు.. నేడు సొసైటీ దివాళా దశకు చేరిందని తెలిసి లబోదిబోమంటున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ప్రధాన బ్రాంచితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచిలు కలిగిన జయలక్ష్మి సొసైటీ నష్టాల ఊబిలో చిక్కుకున్నట్టు తేటతెల్లమవుతోంది. సుమారు 19,911 మంది సభ్యులు కలిగిన ఈ సొసైటీ అన్ని శాఖల్లో సుమారు 10 వేల మంది వరకూ తమ సొమ్ములను ఎఫ్డీలు గాను, నెలవారీ వడ్డీలకు గాను డిపాజిట్ చేసుకున్నారు. అయితే రెండు నెలలుగా సొమ్ములను డిపాజిట్ చేసుకుంటున్న సొసైటీ ఉద్యోగులు.. గడువు ముగిసినా బాండ్లకు చెల్లింపులు మాత్రం జరపలేదు. దీంతో సుమారు రూ.520 కోట్ల డిపాజిట్ల సొమ్ముల విషయం ప్రశ్నార్థకమైంది. పోలీసులకు ఫిర్యాదు తొలుత పిఠాపురం బ్రాంచి నుంచి ఈ వ్యవహారం బయటకు రాగా, ఇప్పుడు అన్ని బ్రాంచిల పరిధిలోని డిపాజిటర్లు తమ సొమ్ములపై భయాందోళన చెందుతున్నారు. సర్పవరం జంక్షన్‌లోని ప్రధాన బ్రాంచి వద్ద రెండో రోజైన గురువారం కూడా డిపాజిటర్లు భారీగా క్యూ కట్టారు. జయలక్ష్మి సొసైటీ పాలకవర్గం అందుబాటులో లేకపోగా.. మీడియాలో కథనాల నేపథ్యంలో తరలిస్తున్న సభ్యులకు సమాధానం చెప్పేవారు కూడా లేకుండా పోయారు. సొసైటీలో కీలక అధికారిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుండడంతో తాళాలు కూడా తెరవలేదు. సుమారు 200 మంది డిపాజిటర్లు కాకినాడ టూ టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు సొసైటీ ఉద్యోగి సుధాకర్ ఫిర్యాదు నేపథ్యంలో డీసీఓ ఆదేశాల మేరకు తొలి రోజు రికార్డుల తనిఖీ ప్రారంభించిన ముగ్గురు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు.. గురువారం ఉదయం నుంచీ తాళాలు తెరకవపోడంతో మూడు గంటల పాటు బయటే వేచి ఉన్నారు. ఆ తరువాత పోలీసులు అదుపులో ఉన్న ఉద్యోగి వచ్చి తాళం తీయడంతో రికార్డులు పరిశీలించారు. తొలి రోజు రికార్డులు పరిశీలించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జవహర్, లక్ష్మి, ఉమా శంకర్‌లతో పాటు రెండో రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన డిప్యూటీ రిజిస్ట్రార్ కృష్ణకాంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు రికార్డుల పరిశీలనలో పాల్గొన్నారు. నష్టాలకు అనేక కారణాలు మ్యాక్స్ చట్టం–95 ప్రకారం స్వయంప్రతిపత్తి కలిగిన జయలక్ష్మి సొసైటీని సభ్యులు, పాలకవర్గమే నిర్వహించుకోవాల్సి ఉంది. దీనిలో ఇతరుల జోక్యం లేదు. దాదాపు 23 ఏళ్ల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సొసైటీలో వేలాది మంది సభ్యులు ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడంతో సుమారు 10 వేల మంది వరకూ ఎఫ్డీలు చేశారు. ఆ సొమ్ములకు 12.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలంటే అంతకంటే ఎక్కువగా వ్యాపారం చేయాల్సి ఉంది. ఇది అధిక వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడే సొసైటీ నష్టాలకు బీజం పడినట్టు తెలుస్తోంది. సుమారు రూ.520 కోట్ల వరకూ వివిధ రూపాల్లో రుణాలు ఇవ్వడం, అవి సకాలంలో రికవరీ కాకపోవడం సొసైటీని నష్టాల ఊబిలోకి నెట్టింది. తగిన సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడంతో వాటి వసూళ్లు కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే చార్టర్డ్ అకౌంటెన్సీ కంపెనీ, కన్సల్టెన్సీ వైఫల్యం సొసైటీని ముంచిందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. సొసైటీ పాలకవర్గాన్ని ముందుగా హెచ్చరించి ఉంటే అన్ సెక్యూర్డ్ రుణాలు ఇచ్చేవారు కాదని అంటున్నారు. ఇదిలా ఉండగా జయలక్ష్మి సొసైటీ డిపాజిటర్లకు ఏవిధంగా న్యాయం చేయాలనే అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. సొసైటీ ఆస్తులు, నగదును తమ అ«దీనంలోకి తీసుకుని డిపాజిటర్లకు చెల్లించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఆందోళనగా ఉంది దివాలా తీస్తుందని ప్రచారం ఉండడంతో జయలక్ష్మి సొసైటీలో దాచుకున్న సుమారు రూ.35 లక్షల డిపాజిట్లపై మా కుటుంబం ఆందోళనలో ఉంది. ప్రభుత్వం న్యాయం చేయాలి. – మాదిరెడ్డి ఉమామహేశ్వరరావు, డిపాజిటర్, కాకినాడ వారం క్రితమే గాంధీ నగర్ బ్రాంచిలో డిపాజిట్ ఎక్కువ వడ్డీ వస్తుందని, నెల వారీగా తీసుకునేందుకు మార్చి 29న గాంధీ నగర్ బ్రాంచిలో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన సొమ్మును ఆ బ్రాంచి ఉద్యోగులు చెప్పడంతోనే ఎస్బీఐ నుంచి తీసుకుని ఇక్కడ పొదుపు చేశాను. ఇప్పుడు బోర్డు దిప్పే దశలో ఉండడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. – గన్నవరపు గిరికుమార్, సాఫ్్టవేర్ ఉద్యోగి, కాకినాడ -
కరీంనగర్: రూ.34 లక్షలు.. కాదు కాదు.. రూ.14లక్షలు...!
సాక్షి కరీంనగర్: కరీంనగర్‌లోని ముకరాంపురలో గల సేవా మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. మూడు గంటల్లోనే పోలీసులు ఈ చోరీని ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ సత్యనారాయణ వెల్లడించారు. సేవా మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో వడ్డీ లేకుండా రుణాలు అందిస్తూ తిరిగి వసూలు చేస్తుంటారు. 19న శనివారం, 20న ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో వసూలు చేసిన నగదు మొత్తం సొసైటీ కార్యాలయంలోని క్యాష్ చెస్ట్‌లో భద్రపరిచారు. సోమవారం ఉదయం కార్యాలయం షట్టర్ తాళం పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా నగదు, బంగారు నగలు భద్రపరిచిన చెస్ట్ కనిపించలేదు. ఉదయం 11 గంటలకు పోలీసులకు సమాచారమందించగా, వన్‌టౌన్ పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్), టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ సీహెచ్ నటేశ్, ఎస్సై ఎస్.శ్రీనివాస్ నేరం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. సేవా సొసైటీని పరిశీలిస్తున్న అధికారులు మూడు గంటల్లోనే.. చోరీ కేసులో పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో పాటు సీసీ కెమెరాలు పరిశీలించారు. వెంటనే నిందితుడికి సంబంధించిన సీసీ వీడియోలను సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ చేయడంతో పలువురు గుర్తు పట్టి పోలీసులకు సమాచారమందించారు. నిందితులు నగరం దాటకముందే పట్టుకోవాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు. మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్ బస్టాండ్‌లో నిందితులు నగరానికి చెందిన షేక్ సాధిక్(24), మహమ్మద్ షాబాజ్(22)లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.14.03 లక్షలు, 13 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సాధిక్ ఆటోడ్రైవర్ కాగా, షాబాజ్ ఇదివరకే సెల్‌ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. -
సహకార వ్యవస్థలపై సీఎం జగన్ కీలక సూచనలు
సాక్షి, అమరావతి : సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సహకార రంగంపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరాలు అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని అధికారులు నివేదించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని వెల్లడించారు. 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని, తక్కువగా రుణాలు ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంటరుణాలకే పరిమితం అవుతున్నాయని తెలిపిన అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకారశాఖ స్పెషల్ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సోసైటీస్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సహకార వ్యవస్ధ బలోపేతం–సిఫార్సులు సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్ధవంతగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో ఎన్ఏబిసీఓఎన్ఎస్ (నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్-నాబ్కాన్స్) సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. సమగ్రమైన బ్యాంకు సేవలు కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలని సీఎం జగన్ సూచించారు. పీఏసీఎస్‌లు క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలు కూడా అందించాలని, పీఏసీఎస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతీ 3 ఆర్బీకేలకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలని అన్నారు. వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలని సిఫార్సు చేశారు. బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలని, బోర్డులో సగం మంది ప్రతి రెండున్నర సంవత్సరాలకు విరమించేలా ఏపీసీఎస్ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే పీఏసీఎస్‌ల్లో కూడా మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలని, గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావాలని తెలిపారు. ఈ మేరకు చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్‌కు నిర్ణయం తీసుకోగా రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏంచేయాలన్న దానిపైన కూడా కార్యాచరణ ఉండాలని సీఎం అన్నారు. థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని ఆదేవఙంచారు. (చదవండి: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు) డీసీసీబీల్లో మెరుగైన పనితీరు ► డీసీసీబీల నుంచి చక్కగా రుణాలు అందాలని సీఎం జగన్ అన్నారు. ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే... ►రుణాలు ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నదానిపై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలి. ►ఈ విధివిధానాలకు లోబడే అందరి పనితీరు ఉండాలని స్పష్టీకరణ ►వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలిచేలా పలు సిఫార్సులు ►కోఆపరేటివ్ బ్యాంకుల మార్కెట్షేర్ 20 శాతం వరకు పెంచాలని నిర్ణయం ►ఆర్బీకేల కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా డీసీసీబీల రుణ ప్రణాళికలు ►అలాగే ఫుడ్ ప్రాససింగ్ చేసే ఎంఎస్ఎంఈలకు దన్నుగా ఉండేలా రుణ కార్యక్రమాలు ►డీసీసీబీ బ్యాంకుల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల స్వభావం పోవాలి ►విశ్వాసం, నమ్మకం కలిగించాలి (చదవండి: మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే హవా) నాణ్యమైన సేవలు అందాలి ►సహకార సంఘం ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు ►డీసీసీబీ బ్యాంకుల సమర్థత పెరగాలి, మంచి యాజమాన్య పద్దతులు రావాలి ►పీఏసీఎస్‌లలో నిర్దిష్ట సమయంలోగా కంప్యూటరీకరణ ►రుణాలు ఇవ్వడంలో మంచి ప్రమాణాలు పాటించాలి ►మూడు నెలల్లో కంప్యూటరీకరణకు ప్రణాళిక ►వచ్చే ఏడాది మార్చి లోగా స్థిరీకరణ ►చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించాలి ►దీనివల్ల చక్కెర కర్మాగారాలకు ఊరట లభిస్తుంది (చదవండి: ఏపీ అన్ని విధాలా అనుకూలం) మల్టీపర్పస్ సెంటర్లపై సీఎం సమీక్ష.. వ్యవసాయం అనుబంధరంగాల్లో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం చేపడుతున్న మల్టీపర్పస్ సెంటర్ల నిర్మాణంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ► గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్ 15 కల్లా టెండర్ల ఖరారు. ► ఏడాది కాలంలో నిర్మాణాల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక ► ప్రతి ఆర్బీకే పరిధిలోనూ మల్టీపర్సస్ సెంటర్లు ► మల్టీపర్సస్ సెంటర్లలో రానున్న గోడౌన్లు, డ్రైయింగ్యార్డులు, కోల్డు రూమ్‌లు, పంటల సేకరణకేంద్రాలు ఇతర వ్యవసాయ పరికరాలు, సామగ్రి ► మొత్తం వీటన్నింటి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం పాలవెల్లువ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులకు మంచి రేటు దొరుకుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. మిగతా జిల్లాలకూ ప్రాజెక్టును విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ► వైఎస్సార్ జిల్లాలో గతంలో లీటరు గేదెపాలు రూ. 44.31, ఇప్పుడు 53.95 ► రైతుకు అదనంగా రూ. 9.64 లబ్ధి ► అదే లీటరు ఆవుపాలకు గతంలో వచ్చే రేటు రూ.25, ప్రస్తుతం 32.80 ► రైతుకు అదనంగా లబ్ధి రూ.7.80 ► చిత్తూరు జిల్లాలో గతంలో లీటరు గేదెపాలు రూ. 43.25, ప్రస్తుతం రూ. 52 ► రైతుకు అదనంగా రూ. 8.75 ► అదే లీటరు ఆవుపాలకు గతంలో వచ్చే రేటు రూ.26, ప్రస్తుతం 34.13 ► రైతుకు అదనంగా లబ్ధి రూ.8.13 ► ప్రకాశం జిల్లాలో గతంలో రూ.45, ప్రస్తుతం రూ. 59.15 ► రైతుకు అదనంగా రూ.14.15 ► అదే లీటరు ఆవుపాలకు గతంలో వచ్చే రేటు రూ.24, ప్రస్తుతం 32.78 ► రైతుకు అదనంగా లబ్ధి రూ.8.78 -
వేలం వెర్రి..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ షెట్పల్లి సహకార సంఘం డైరెక్టర్, చైర్మన్ పదవులకు నిర్వహించిన వేలం పాటలో రూ.25 లక్షల వరకు ధర పలికింది. ఏర్గట్ల సొసైటీ రూ.15 లక్షలకు వేలం పాడారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు జిల్లాలో అనేక సొసైటీల పదవులకు వేలం పాటలు జరిగాయి. ఆర్మూర్ మండలం పిప్రి సొసైటీకి నిర్వహించిన వేలంలో రూ.77 లక్షల విలువైన పనులు చేçస్తామనే ఒప్పందంతో ఏకగ్రీవం చేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్ జిల్లాలో డైరెక్టర్, చైర్మన్ స్థానాలను వేలం పాటల ద్వారా దక్కించుకున్నారు. జిల్లాలో 89 సహకార సంఘాలు, వీటి పరిధిలో 1,157 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా, రాష్ట్రంలోనే అత్యధికంగా 26 సహకార సంఘాలు, 736 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కొన్ని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఏకగ్రీవం చేసిన స్థానాలు ఉండగా, ఎక్కువ భాగం వేలం పాటల ద్వారానే రూ.లక్షలు వెచ్చించి దక్కించుకున్నవే ఉండటం గమనార్హం. అయితే,, ఈ విషయమై గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాలనకు దీటుగా సమాంతర పాలన కొనసాగిస్తాయి. ఎవరైనా వీడీసీల కట్టుబాట్లను ధిక్కరిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, బహిష్కరణకు గురి కావాల్సి వస్తుంది. గ్రామాభివృద్ధికి నిధుల సమీకరణ పేరుతో సహకార సంఘాలకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వేలంలో అత్యధిక ధర పలికి పదవిని కొనుక్కున్న వారు నిర్ణయించిన తేదీలోగా డబ్బులు కమిటీకి జమ చేయాల్సి ఉంటుంది. ఆధారాల్లేక చర్యలు తీసుకోలేకపోతున్నాం సహకార ఎన్నికల్లో వేలం పాటలు నిర్వహించకూడదనే జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఆదేశాలను వీడీసీలు ఖాతరు చేయలేదు. డైరెక్టర్, సొసైటీల చైర్మన్ స్థానాలకు యథేచ్ఛగా వేలం పాటలు నిర్వహించాయి. సరైన ఆధారం లేకపోవడంతోనే చర్యలు తీసుకోలేకపోయామని జిల్లా సహకారశాఖాధికారి సింహాచలం ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే పోలీసులతో విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. -
భారీ మోసం : లోన్లు ఇస్తామని చెప్పి..
సాక్షి, ఖమ్మం : కోఆపరేటివ్ సొసైటీ సంస్థ పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి దాదాపు 5000మంది ఖాతాదారులను నిండా ముంచిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. హాపీ ప్యూచర్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ సంస్థ ప్రజల వద్ద నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి రూ. 80,000 చొప్పున సేకరించింది. మూడున్నర లక్షల వరకు లోన్లు ఇస్తామని ఖాతాదారులకు నమ్మబలికింది. తీరా లోన్లు ఇవ్వాల్సిన టైం వచ్చేసరికి చేతులెత్తేశారు. దీంతో బాధితులు ఖమ్మం టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హ్యాపీ ఫ్యూచర్ కో ఆపరేటివ్ సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్ తో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 45 బ్రాంచీలు తెరిచిన సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 5 కోట్ల మేర వసూలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 600 మంది ఉద్యోగులు, సుమారు 5000 మంది ఖాతాదారులు మోసపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సహకార సంఘాల ఎన్నికలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు ప్రస్తుతం కొనసాగుతున్న పర్సన్ ఇన్చార్జులను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్), జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు కూడా మరో ఆరు నెలలు పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నట్లు సహకారశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో సహకార ఎన్నికలు కూడా ఇప్పట్లో లేనట్టేనని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. వాస్తవానికి కొన్ని సహకార సంఘాలలోని పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 30వ తేదీ, ఫిబ్రవరి 3న, టెస్కాబ్‌కు ఫిబ్రవరి 26న, డీసీఎంఎస్‌లు, డీసీసీబీలకు ఫిబ్రవరి 18న ముగిసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పర్సన్ఇన్చార్జులను నియమించాలని సిఫార్సు చేయడంతో పాలకవర్గంలో ఉన్నవారినే పర్సన్ ఇన్చార్జులుగా ఆరు నెలలు కొనసాగించారు. పొడిగించిన సమయం మరో నెల రోజుల్లో ముగియనుంది. ఎన్నికలకు 45 రోజుల ముందుగానే.. ప్యాక్స్లకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఆయా పర్సన్ ఇన్చార్జుల పదవీకాలం ముగియడానికి కనీసం 45 నుంచి 60 రోజుల ముందుగా ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు అవసరమైన నివేదికలను సహకార శాఖ ప్రభుత్వానికి ముందస్తుగానే నివేదించినా ఇప్పటివరకూ స్పందించలేదు. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మరో ఆరు నెలలు పొడిగించేందుకు సంకేతమిచ్చినట్లైంది. సహకార చట్టం ప్రకారం ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించే వెసులుబాటు ఉంది. అయితే ఎన్నిసార్లు అలా పొడిగింపు ఇవ్వవచ్చనేది స్పష్టంగా లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో ఓసారి ఏకంగా 11 ఏళ్ల పాటు సహకార సంఘాల పాలకవర్గాలు కొనసాగిన చరిత్ర ఉందని అంటున్నారు. -
సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
సాక్షి, ఒంగోలు అర్బన్ : సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంచుతూ వెంటనే జీఓను వెంటనే విడుదల చేయాలని ఏపి స్టేట్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి రావూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ జీఓ 151 వచ్చినా 2014 నుంచి వేతనాలు, అరియర్స్ చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. గ్రాడ్యుయుటీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సహకార సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ధర్నాకు పెంట్యాల హనుమంతరావు, నాయకులు కె. లక్ష్మీనారాయణ, షేక్ మౌళాలి, శ్రీకాంత్, ఈశ్వర్, రామాంజనేయరెడ్డి, రత్నకుమారి, పాల్గొన్నారు. -
‘సహకార’ ఓటరు జాబితాకు రెడీ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఓటరు జాబితాలు తయారుచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని ఈసారి ఓటుహక్కు ఉన్న రైతు ఫొటోలతో కూడిన జాబితాలు తయారుచేయాలని నిర్ణయించారు. జాబితా తయారీకి ఫిబ్రవరి 15వ తేదీని గడువు విధించారు. కథలాపూర్(వేములవాడ) : జిల్లాలోని 18 మండలాల్లో 51 సహకార సంఘాలున్నాయి. ఇందులో 95,386 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఓటరు జాబితా తయారీ సహకార సంఘాలవారీగా చేపట్టాల్సి ఉండడంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఓటరుజాబితాల ఫైళ్లను వెతికి సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. వీటికితోడు కొత్తగా ఓటు హక్కు కావాలనుకునే రైతులకు అవకాశం కల్పిస్తున్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. ముగుస్తున్న గడువు... సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 31తో ముగియనుంది. పాలకవర్గాల పదవీకాలం పొడిగిస్తారా.. లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా, ఎన్నికలు నిర్వహిస్తారా? అనే విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సిఉంది. గడువు ముగియనుండడంతో సహకార ఎన్నికల బరిలో ఉండాలనుకునే వారు ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు. ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తయారుచేయాలని ఆదేశాలు రావడం.. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో గ్రామాల్లో సహకార సంఘాల ఎన్నికల వేడి రాజుకుంటోంది. సహకార సంఘాల అధ్యక్ష, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న నాయకులు తమ అనుచురుల పేర్లు ఓటరు జాబితాలో చేర్పించే ప్రయత్నంలో మునిగిపోయారు. గ్రామాల్లో ముఖ్యనేతలు కూడళ్ల వద్ద తమ అనుచరగణంతో మంతనాల్లో మునిగి తేలుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే... సహకార సంఘాల్లో ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు పట్టదారు పాసుబుక్కు, ఆధార్‌కార్డ్ జిరాక్స్‌తోపాటు రూ.350 చెల్లించి రెండు ఫొటోలు తమ పరిధిలోని కార్యాలయాల్లో అందించాలి. గతంలో ఓటరు జాబితాలో పేర్లున్న రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్‌తోపాటు రెండు ఫొటోలు ఇవ్వాలి. ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులు సమర్పించాలి సహకార సంఘాల ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలని, తప్పులు లేకుండా తయారు చేయాలని అధికారులకు సూచించాం. ఓటరు జాబితాను రైతు ఫొటోలతో అనుసంధానం చేసేందుకు ఫిబ్రవరి 15 వరకు చివరి గడువు విధించాం. ఓటరు జాబితాలో పేర్లున్న రైతులు ఫొటోలను సహకార సంఘం కార్యాలయాల్లో గడువులోగా అందించాలి. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకునే రైతులు పరిధిలోని సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించాలి. –రామానుజచార్యులు, జిల్లా సహకార అధికారి -
కంది కొనుగోళ్లలో దళారులకు చెక్
మోర్తాడ్(బాల్కొండ) : కంది కొనుగోళ్లలో దళారుల దగాకు చెక్ పెట్టింది తాళ్లరాంపూర్ సహకార సంఘం. వ్యాపారుల బారిన పడకుండా రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటికే నాలుగు వేల సంచులను కొనుగోలు చేసింది. కందికి రూ.5,450 చొప్పున మద్దతు ధర చెల్లిస్తూ రైతులకు భరోసా కల్పిస్తోంది. వాస్తవానికి బయట మార్కెట్లో దళారులు క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,200 వరకు మాత్రమే ధర చెల్లిస్తూ రైతులను మోసగిస్తున్నారు. అయితే, తాళ్ల రాంపూర్‌లో కంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు మద్దతు ధర లభిస్తోంది. మోర్తాడ్, ఏర్గట్ల, మెండోర మండలాలకు సంబంధించిన తాళ్ల రాంపూర్ కొనుగోలు కేంద్రంలోనే పంట ఉత్పత్తులు విక్రయించి మద్దతు ధర పొందుతున్నారు. పది రోజుల కింద ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, ఇప్పటివరకు నాలుగు వేల సంచుల కందులను కొనుగోలు చేశారు. కందులు విక్రయించిన రైతులకు వారం రోజుల్లోనే సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు తాము పండించిన కందులను మంచి ధర పొందేందుకు అవకాశం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాన్ని మరిన్ని రోజులు కొనసాగిస్తామని, రైతులు నాణ్యమైన కందులను తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సొసైటీ చైర్మన్ సోమ చిన్న గంగారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. -
‘కుప్ప’కూలిన మహిళా రైతు
కొనుగోలు కేంద్రంలో ఆగిన గుండె సాక్షి జగిత్యాల/బుగ్గారం: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామనుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన ఓ మహిళా రైతు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండలోని సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ఆదివారం కుప్పకూలింది. వెల్గొండకు చెందిన మహిళా రైతు పల్లపు రాజవ్వ(50), భర్త నర్సయ్యకు ఐదెకరాల సాగు భూమి ఉంది. వారికి 20 క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చింది. పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి ఇరవై రోజుల క్రితమే పంటను తీసుకెళ్లింది. కానీ, మొదటి పది రోజులు తేమ శాతం ఉందంటూ నిర్వాహకులు కొనుగోళ్లు నిరా కరించారు. ఆ తర్వాత గన్నీ బ్యాగులు అందుబాటులో లేక తూకానికి జాప్యం జరిగింది. ఇది వరకే.. తన భర్త నర్సయ్య అనారోగ్యం పాలవడంతో రాజవ్వ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే వదిలిపెట్టి తరుచూ ఆస్పత్రికి.. ఇంటికెళ్లి వచ్చేది. చివరకు ఈ నెల 27న రాత్రి రాజవ్వకు కొనుగోలు కేంద్రంలో రాజవ్వకు గన్నీ సంచులు దొరికాయి. దీంతో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకే కొనుగోలు కేంద్రానికి వచ్చిన రాజవ్వ.. తన పంట దగ్గర ఎండలోనే నిలబడి గన్నీలో ధాన్యం నింపడం ప్రారంభించింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురై.. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలింది. విషయాన్ని గ్రహించిన స్థానిక రైతులు రాజవ్వను వెంటనే చెట్టు నీడకు తీసుకొచ్చి... పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోయింది. -
రూ.196కోట్ల టర్నోవర్ లక్ష్యం
జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి అధ్యక్షుడు నంద్యాల: 2016–17లో 331 లక్షల లీటర్ల పాలను సేకరించి, రూ.196కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా ఎంచుకున్నామని జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి అధ్యక్షుడు భూమా నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక పాల డెయిరీలో ఆయన అధ్యక్షతన బుధవారం 27వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015–16లో 378లక్షల లీటర్ల పాలను విక్రయించి రూ.181కోట్ల టర్నోవర్ సాధించామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రైతులకు పశుగ్రాస క్షేత్రాలు, కల్యాణమస్తు పథకాలు, సాంకేతిక వనరుల కోసం గత ఏడాది రూ.48.83 లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ.80.3 లక్షలను కేటాయించామని చెప్పారు. అనంతరం అధిక నాణ్యతతో పాలను సేకరించిన రైతులకు, మహిళా పాల సంఘాలకు ప్రోత్సాహాక బహుమతిని, బాగా పని చేసిన సిబ్బందికి ఉత్తమ ఉద్యోగి అవార్డులను అందజేశారు. సమావేశంలో డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, మార్కెటింగ్ ప్లాంట్ ప్రొటెక్షన్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు సుబ్రమణ్యం, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కర్నూలు డెయిరీ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగపుల్లయ్య, అసిస్టెంట్ డెయిరీ ఇంజినీర్ శ్యాంసన్‌బాబు పాల్గొన్నారు. -
మార్క్‌ఫెడ్ ద్వారా ముతక ధాన్యం కొనుగోలు
జొన్న, సజ్జ తదితరాలకు మద్దతు ధర ప్రకటించిన కేంద్రం అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలుకు రాష్ట్రం సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (2016-17)లో మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ వంటి ముతక ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముతక ధాన్యం దిగుబడులను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం సేకరించే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలకు ముతక ధాన్యం అవసరం లేకున్నా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇటీవల ముతక ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా.. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. 2016-17 ఖరీఫ్ సీజన్‌కు గాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,365, సజ్జకు రూ.1,330, జొన్న (హైబ్రిడ్)కు రూ.1,625, జొన్న (సాధారణ) రూ.1,650, రాగులకు రూ.1,725 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. కాగా, ప్రస్తుత సీజన్లో 2.5 లక్ష ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నతో పాటు.. ఇతర ధాన్యాలను దిగుబడి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, జిల్లాల వారీగా దిగుబడిని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. మెరుగైన పనితీరు ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు (డీసీఎంఎస్‌లు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు), గ్రామైఖ్య సంఘాలను కూడా కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా.. ముతక ధాన్యాన్ని ఎక్కువగా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ముతక ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీకి అప్పగించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాల్సిన బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో పీడీ (డీఆర్డీఏ), డీసీఓ, జేడీ (అగ్రికల్చర్), ఏడీ (మార్కెటింగ్), జిల్లా మేనేజర్ (మార్క్‌ఫెడ్), ఏరియా మేనేజర్ (ఎఫ్‌సీఐ) తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణా, గన్నీ సంచుల ధరలు తదితరాలను కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు.. తదితరాలను నిర్ణయించేందుకు స్థానికంగా కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ధాన్యం నిలువ చేసేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు, ఎఫ్‌సీఐ, వ్యవసాయ మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
సహకార సంఘాల ద్వారా పంట రుణాలు
– ఎకరాకు రూ. లక్ష రుణం – ఒక్కో సహకార సంఘానికి రూ. 10 కోట్లు – కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి కోవెలకుంట్ల: జిల్లాలోని సహకార సంఘాల ద్వారా రైతులకు పంటరుణాలు అందజేస్తున్నట్లు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి చెప్పారు. శుక్రవారం స్థానిక కేడీసీసీ బ్యాంకు పరిధిలోని సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఒక్కో సహకార సంఘానికి పంట రుణాల కింద రూ. 10 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఐదు ఎకరాలు పైబడిన రైతులకు ఎకరాకు రూ. లక్ష రుణం అందజేస్తామన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందజేసిన రుణాల వసూళ్లను వేగవంతం చేయాలని, వందశాతం వసూళ్లపై సీఈఓలు దష్టి సారించాలని సూచించారు. రుణాల రికవరీలో కర్నూలు జిల్లా ముందంజలో ఉందన్నారు. కోవెలకుంట్ల కేడీసీసీ బ్యాంకు పరిధిలో డైలీ డిపాజిట్లు వసూలు చేసి ఏజెంట్ కనిపించకుండా పోయాడన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన రూ. 15 లక్షల డిపాజిట్లను బ్యాంకు చెల్లిస్తుందని, డిపాజిట్‌దారులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహకార సంఘాల అధ్యక్షులు గువ్వల సుబ్బారెడ్డి, భూపాల్‌రెడ్డి, నాగిరెడ్డి, గోవిందరెడ్డి, సీఈఓలు ఇస్మాయిల్, సుబ్బారావు, అక్బర్ పాల్గొన్నారు.