సర్పవరం జంక్షన్ జయలక్ష్మి సొసైటీ వద్ద ఆందోళనగా ఉన్న డిపాజిటర్లు
కాకినాడ రూరల్(కాకినాడ జిల్లా): ఆకర్షణీయమైన వడ్డీల మోజులో పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న సొమ్ములను జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేసుకున్న సభ్యులు.. నేడు సొసైటీ దివాళా దశకు చేరిందని తెలిసి లబోదిబోమంటున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ప్రధాన బ్రాంచితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచిలు కలిగిన జయలక్ష్మి సొసైటీ నష్టాల ఊబిలో చిక్కుకున్నట్టు తేటతెల్లమవుతోంది. సుమారు 19,911 మంది సభ్యులు కలిగిన ఈ సొసైటీ అన్ని శాఖల్లో సుమారు 10 వేల మంది వరకూ తమ సొమ్ములను ఎఫ్‌డీలు గాను, నెలవారీ వడ్డీలకు గాను డిపాజిట్ చేసుకున్నారు. అయితే రెండు నెలలుగా సొమ్ములను డిపాజిట్ చేసుకుంటున్న సొసైటీ ఉద్యోగులు.. గడువు ముగిసినా బాండ్లకు చెల్లింపులు మాత్రం జరపలేదు. దీంతో సుమారు రూ.520 కోట్ల డిపాజిట్ల సొమ్ముల విషయం ప్రశ్నార్థకమైంది.
పోలీసులకు ఫిర్యాదు
తొలుత పిఠాపురం బ్రాంచి నుంచి ఈ వ్యవహారం బయటకు రాగా, ఇప్పుడు అన్ని బ్రాంచిల పరిధిలోని డిపాజిటర్లు తమ సొమ్ములపై భయాందోళన చెందుతున్నారు. సర్పవరం జంక్షన్‌లోని ప్రధాన బ్రాంచి వద్ద రెండో రోజైన గురువారం కూడా డిపాజిటర్లు భారీగా క్యూ కట్టారు. జయలక్ష్మి సొసైటీ పాలకవర్గం అందుబాటులో లేకపోగా.. మీడియాలో కథనాల నేపథ్యంలో తరలిస్తున్న సభ్యులకు సమాధానం చెప్పేవారు కూడా లేకుండా పోయారు. సొసైటీలో కీలక అధికారిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుండడంతో తాళాలు కూడా తెరవలేదు. సుమారు 200 మంది డిపాజిటర్లు కాకినాడ టూ టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
మరోవైపు సొసైటీ ఉద్యోగి సుధాకర్ ఫిర్యాదు నేపథ్యంలో డీసీఓ ఆదేశాల మేరకు తొలి రోజు రికార్డుల తనిఖీ ప్రారంభించిన ముగ్గురు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు.. గురువారం ఉదయం నుంచీ తాళాలు తెరకవపోడంతో మూడు గంటల పాటు బయటే వేచి ఉన్నారు. ఆ తరువాత పోలీసులు అదుపులో ఉన్న ఉద్యోగి వచ్చి తాళం తీయడంతో రికార్డులు పరిశీలించారు. తొలి రోజు రికార్డులు పరిశీలించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జవహర్, లక్ష్మి, ఉమా శంకర్‌లతో పాటు రెండో రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన డిప్యూటీ రిజిస్ట్రార్ కృష్ణకాంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు రికార్డుల పరిశీలనలో పాల్గొన్నారు.
నష్టాలకు అనేక కారణాలు
మ్యాక్స్ చట్టం–95 ప్రకారం స్వయంప్రతిపత్తి కలిగిన జయలక్ష్మి సొసైటీని సభ్యులు, పాలకవర్గమే నిర్వహించుకోవాల్సి ఉంది. దీనిలో ఇతరుల జోక్యం లేదు. దాదాపు 23 ఏళ్ల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సొసైటీలో వేలాది మంది సభ్యులు ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడంతో సుమారు 10 వేల మంది వరకూ ఎఫ్‌డీలు చేశారు. ఆ సొమ్ములకు 12.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలంటే అంతకంటే ఎక్కువగా వ్యాపారం చేయాల్సి ఉంది. ఇది అధిక వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడే సొసైటీ నష్టాలకు బీజం పడినట్టు తెలుస్తోంది.
సుమారు రూ.520 కోట్ల వరకూ వివిధ రూపాల్లో రుణాలు ఇవ్వడం, అవి సకాలంలో రికవరీ కాకపోవడం సొసైటీని నష్టాల ఊబిలోకి నెట్టింది. తగిన సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడంతో వాటి వసూళ్లు కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే చార్టర్డ్ అకౌంటెన్సీ కంపెనీ, కన్సల్టెన్సీ వైఫల్యం సొసైటీని ముంచిందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. సొసైటీ పాలకవర్గాన్ని ముందుగా హెచ్చరించి ఉంటే అన్ సెక్యూర్డ్ రుణాలు ఇచ్చేవారు కాదని అంటున్నారు. ఇదిలా ఉండగా జయలక్ష్మి సొసైటీ డిపాజిటర్లకు ఏవిధంగా న్యాయం చేయాలనే అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. సొసైటీ ఆస్తులు, నగదును తమ అ«దీనంలోకి తీసుకుని డిపాజిటర్లకు చెల్లించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
ఆందోళనగా ఉంది
దివాలా తీస్తుందని ప్రచారం ఉండడంతో జయలక్ష్మి సొసైటీలో దాచుకున్న సుమారు రూ.35 లక్షల డిపాజిట్లపై మా కుటుంబం ఆందోళనలో ఉంది. ప్రభుత్వం న్యాయం చేయాలి.
– మాదిరెడ్డి ఉమామహేశ్వరరావు, డిపాజిటర్, కాకినాడ
వారం క్రితమే గాంధీ నగర్ బ్రాంచిలో డిపాజిట్
ఎక్కువ వడ్డీ వస్తుందని, నెల వారీగా తీసుకునేందుకు మార్చి 29న గాంధీ నగర్ బ్రాంచిలో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేశాను. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన సొమ్మును ఆ బ్రాంచి ఉద్యోగులు చెప్పడంతోనే ఎస్‌బీఐ నుంచి తీసుకుని ఇక్కడ పొదుపు చేశాను. ఇప్పుడు బోర్డు దిప్పే దశలో ఉండడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను.
– గన్నవరపు గిరికుమార్, సాఫ్‌్టవేర్ ఉద్యోగి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment