రూ.196కోట్ల టర్నోవర్ లక్ష్యం
జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి అధ్యక్షుడు
నంద్యాల: 2016–17లో 331 లక్షల లీటర్ల పాలను సేకరించి, రూ.196కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా ఎంచుకున్నామని జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి అధ్యక్షుడు భూమా నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక పాల డెయిరీలో ఆయన అధ్యక్షతన బుధవారం 27వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015–16లో 378లక్షల లీటర్ల పాలను విక్రయించి రూ.181కోట్ల టర్నోవర్ సాధించామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రైతులకు పశుగ్రాస క్షేత్రాలు, కల్యాణమస్తు పథకాలు, సాంకేతిక వనరుల కోసం గత ఏడాది రూ.48.83 లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ.80.3 లక్షలను కేటాయించామని చెప్పారు. అనంతరం అధిక నాణ్యతతో పాలను సేకరించిన రైతులకు, మహిళా పాల సంఘాలకు ప్రోత్సాహాక బహుమతిని, బాగా పని చేసిన సిబ్బందికి ఉత్తమ ఉద్యోగి అవార్డులను అందజేశారు. సమావేశంలో డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, మార్కెటింగ్ ప్లాంట్ ప్రొటెక్షన్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు సుబ్రమణ్యం, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కర్నూలు డెయిరీ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగపుల్లయ్య, అసిస్టెంట్ డెయిరీ ఇంజినీర్ శ్యాంసన్‌బాబు పాల్గొన్నారు.