సీఈఓల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మల్లికార్జునరెడ్డి
– ఎకరాకు రూ. లక్ష రుణం
– ఒక్కో సహకార సంఘానికి రూ. 10 కోట్లు
– కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి
కోవెలకుంట్ల: జిల్లాలోని సహకార సంఘాల ద్వారా రైతులకు పంటరుణాలు అందజేస్తున్నట్లు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి చెప్పారు. శుక్రవారం స్థానిక కేడీసీసీ బ్యాంకు పరిధిలోని సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఒక్కో సహకార సంఘానికి పంట రుణాల కింద రూ. 10 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఐదు ఎకరాలు పైబడిన రైతులకు ఎకరాకు రూ. లక్ష రుణం అందజేస్తామన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందజేసిన రుణాల వసూళ్లను వేగవంతం చేయాలని, వందశాతం వసూళ్లపై సీఈఓలు దష్టి సారించాలని సూచించారు. రుణాల రికవరీలో కర్నూలు జిల్లా ముందంజలో ఉందన్నారు. కోవెలకుంట్ల కేడీసీసీ బ్యాంకు పరిధిలో డైలీ డిపాజిట్లు వసూలు చేసి ఏజెంట్ కనిపించకుండా పోయాడన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన రూ. 15 లక్షల డిపాజిట్లను బ్యాంకు చెల్లిస్తుందని, డిపాజిట్‌దారులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహకార సంఘాల అధ్యక్షులు గువ్వల సుబ్బారెడ్డి, భూపాల్‌రెడ్డి, నాగిరెడ్డి, గోవిందరెడ్డి, సీఈఓలు ఇస్మాయిల్, సుబ్బారావు, అక్బర్ పాల్గొన్నారు.