పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని కాఫీ రైతులందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే ప్రోత్సాహక సొమ్ము చెల్లించాలని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవడం, మండల కేంద్రాల్లో కొత్త బ్యాంకుల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, కాఫీ రైతులు, ఉపాధి కూలీలకు చెల్లింపులు, బ్యాంకు లింకేజి రుణాలపై పీవో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ ప్రాజెక్టు ద్వారా అమలు చేస్తున్న ప్రోత్సాహక నగదు సక్రమంగా అందకపోవడంతో బ్యాంకు ఖాతాల ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో 7786 మంది కాఫీ రైతుల్లో 4704 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. మిగిలిన 3082 మంది యుద్ధప్రాతిపదికన ఖాతాలను తెరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ మండలంలోను 3 నుంచి 4వరకు బ్యాంకులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎం బి.జయబాబును పీవో ఆదేశించారు. చింతపల్లి, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో బ్యాంకుల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తామన్నారు. భౌగోళికంగా 60 శాతం విస్తీర్ణంలో గిరిజన ప్రాంతాలు ఉన్నాయని, జనాభా ప్రతిపాదికన చూసుకుంటే బ్యాంకులు అదనంగా అవసరమన్నారు.
ఉపాధి కూలీలకు గ్రామైఖ్య సంఘాల ఖాతాల్లో జమ అవుతాయని, అయితే కూలీలకు చెల్లింపులు జరపకుండా బ్యాంకు అధికారులు వీవోల ఖాతాల నుంచి బకాయిలను రీకవరి చేయడం నేరమన్నారు. గొలుగొండ, ఐఎల్‌పురం, శరభన్నపాలెం, కేడీ పేటల్లో బ్యాంకుల ద్వారా జీడి తోటల రైతులకు కూడా ఖాతాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఏజెన్సీలోని 9500 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయని, వాటి బలోపేతానికి కూడా ఐటీడీఏ చర్యలు తీసుకుంటుందని పీవో తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.