రైతులకు ఝలక్ | Jhalak farmers | Sakshi
Sakshi News home page

రైతులకు ఝలక్

Published Thu, Sep 4 2014 1:06 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Jhalak farmers

  •     వసూలుకాని లోన్లను ఏజెన్సీలకు అమ్మేసిన బ్యాంకులు!
  •      60 శాతంతో రుణాలను కొనుగోలు చేసిన ఏఆర్‌సీసీ
  •      నిరర్థక ఆస్తులుగా విక్రయించిన బ్యాంకర్లు
  •      అమ్మిన రుణాల విలువ రూ.12 కోట్లకు పైమాటే
  •      ఇక రుణ వసూళ్లు ఏజెన్సీల చేతుల్లోనే
  •      ఆందోళనలో పలువురు బకాయిదారులు
  •  
    పలమనేరు: బ్యాంకుల్లో అప్పు తీసుకుని సకాలంలో చెల్లించక మొండి బకాయిదారులుగా మారిన వారికి ఇది పిడుగులాంటి వార్తే. ఎందుకంటే ఆ రుణాలను ప్రైవేటు ఏజెన్సీలకు బ్యాంకులు అమ్మేశాయి. రుణగ్రహీతల నుంచి రికవరీ చేసే పూచీ ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు ఆ ఏజెన్సీలు తాకట్టులోని ఆస్తులను జప్తు చేసేందుకు అధికారం చిక్కినట్టైంది. ఈ విషయం బ్యాంకర్లు గుట్టుగానే కానిచ్చేశారు. ఈ మధ్య రుణమాఫీ హడావిడితో తమ రుణాలేమైనా మాఫీ అవుతాయేమోనని బ్యాంకులకెళ్లిన రుణగ్రహీతలకు ఈ విషయంతెలిసి లబోదిబోమంటున్నారు.
     
    నిరర్థక ఆస్తులను ఏఆర్‌సీసీకి అమ్మేసిన బ్యాంకులు..
     
    పలమనేరు ప్రాంతంలోని ఇండియన్ బ్యాంక్, ఎస్‌బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులు మొండి బకాయిలను ఎన్‌పీఏలు (నాన్ ఫెర్ఫార్మెన్స్ అసెట్)గా మార్చాయి. దీంతో గతం లో రుణాలు తీసుకున్న క్రాప్, టర్మ్, బిజినెస్ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. సంబంధిత బ్యాంకుల నుంచి మొండిబకాయిల వివరాలను పరిశీలించిన ప్రధాన కార్యాలయాలు ఈ రుణాలను ప్రైవేటు ఏజెన్సీలకు గతంలోనే విక్రయించేసినట్లు తెలిసింది. ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్‌లకు సంబంధించి వసూలు కాని రుణాలను ఏఆర్‌సీఎల్ (అసెట్ రికన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు అమ్మేసినట్లు తెలిసింది. ఇందులో రిలయన్స్ సంస్థే భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వసూలు కాని రుణాలను 60 శాతం వెలకట్టి కొనుగోలు చేసినట్లు బ్యాంకర్లే చెబుతున్నారు.
     
    విక్రయించిన లోన్ల విలువ రూ.12 కోట్ల పైమాటే..
     
    పలమనేరు ప్రాంతంలోని పలు బ్యాంకుల్లో ఎన్‌పీఏలుగా మారిన రుణాలను ఏజెన్సీలకు అమ్మేసిన లోన్ల విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. జిల్లా మొత్తం మీద ఇలాంటి మొండిబకాయిలను వంద కోట్లకు పైగా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియని రైతులు మహా అయితే బ్యాంకుల నుంచి నోటీసులు రావడం లేదా తాకట్టు భూములపై కోర్టు కేసులు జరుగుతాయిలేనని అనుకుంటున్నారు.  
     
    రుణగ్రహీతల ఆస్తులకు ఎసరే..
     
    స్థానిక బ్యాంకుల్లో పలువురు తమ ఆస్తులను, ఇళ్లను తాకట్టుగా పెట్టి పలు రకాల రుణాలు పొందారు. వీటిని సకాలంలో కట్టలేకపోవడంతో మొండిబకాయిదారులయ్యారు. వీరి రుణాలను ప్రైవేటు ఏజెన్సీలు కొనుగోలు చేయడంతో రికవరీల బాధ్యత ఏజెన్సీలదే. దీంతో వారు రుణగ్రహీతలకు నోటీసులివ్వడం, నిర్ణీత గడువులోపు డబ్బు చెల్లించకపోతే ఆస్తుల జప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఇండియన్ బ్యాంక్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణరావ్‌ను వివరణ కోరగా బ్యాంకుల్లోని ఎన్‌పీఏలుగా మారిన రుణాలను ఏఆర్‌సీఎల్‌కు అమ్మేసిన మాట నిజమేనన్నారు. హెడ్ ఆఫీస్ ఉత్తర్వులతో అన్ని బ్యాంకుల్లోనూ ఈ విక్రయాలు జరిగిపోయాయన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement