- అయోమయం
- ముంచుకొస్తున్న గడువు
- రైతుల్లో ఆందోళన
రుణమాఫీ.. ఎన్నికల ఫలితాల వచ్చేవరకూ రైతులను ఆనందడోలికల్లో తేలియాడించిన పథకం. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో సునాయాసంగా ఇచ్చేసిన హామీ. తీరా సవాలక్ష కొర్రీల కారణంగా అమలు విషయం అయోమయంగా మారింది. ఇందుకు నిర్ణయించిన గడువుతో ముంచుకొస్తుండడంతో రైతన్నలకు భయం పట్టుకుంది.
విశాఖ రూరల్ : రుణమాఫీ వ్యవహారం అయోమయంగా మారింది. అమల విషయంలో రైతుల్లో భయం పట్టుకుంది. ప్రభుత్వం చెబుతున్నది ఒక రకంగా ఉంటే బ్యాంకుల తీరు మరో విధంగా ఉంటోంది. అసలు బ్యాంకులు, సహకార సంఘాలు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తుండడమే ఈ గందరగోళానికి కారణమవుతోంది. మరోవైపు అర్హుల జాబితా తయారీకి అధికారులు నానా తంటాలు పడుతున్నారు.
ఆధార్ సీడింగ్‌కు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. పాస్ పుస్తకంలో ఉన్న పేరు 1బీ అడంగల్‌లో ఉంటేనే కంప్యూటర్ స్వీకరిస్తుంది. లేనివి పక్కనపెడుతున్నారు. గతంలో అధికారులు నిర్లక్ష్య ధోరణితో రికార్డుల్లో సవరణలు చేయని కారణంగా ప్రస్తుతం తాము నష్టపోవాల్సి వ స్తోందని రైతులు వాపోతున్నారు. ఆధార్ వివరాల సమర్పణకు ఈ నెల 15 ఆఖరు తేదీగా ప్రకటించడంతో కార్డులు లేని వారు కలవరానికి గురవుతున్నారు.
అనేక ఇబ్బందులు
జిల్లాలో రైతులకు సంబంధించి భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్) రెవెన్యూ అధికారులు చాలా వరకు అందజేశారు. అయితే ఆ తర్వా యజమాని మరణం, భాగం పంపిణీ తదితరాలకు సంబంధించి వెంటనే క్లయిమ్ చేసుకుని తదుపరి హక్కు పొందాల్సి ఉంటుంది. దీనిపై సరైన అవగాహన లేక కొత్త పాస్‌పుస్తకాలు పొందని వారు అనేక మంది ఉన్నారు. అదే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో యజమాని పేరు మార్చేటప్పుడు వీఆర్వోలు, ఆర్‌ఐలు, తహశీల్దార్లు, ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో అందరి సంతకాలు అవసరమవుతాయి.
అయితే కొన్ని చోట్ల యజమాని ఫొటోపై కొత్తగా ఎవరికి కేటాయిస్తున్నారో వారి ఫొటో అంటించి పేరు మార్చి వదిలేశారు. అడంగల్, 1బీలలో పేరు మార్పు జరగలేదు. అలాంటివి ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్నాయి. ఆధార్ సీడింగ్‌లో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నప్పటికీ 1బీ, అడంగల్‌లో పేరు మార్పు జరగని కారణంగా సీడింగ్ జరగడం లేదు. దీంతో తాము రుణమాఫీకి అర్హులంకామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నకిలీల నేపథ్యంలో నిశిత పరిశీలన : గతంలో అనేక చోట్ల నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపి బ్యాంకులకు టోకరా వేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా నిబంధనల మేరకు పుస్తకాలుంటేనే వాటిని పరిగణలోకి తీసుకోవాలని బాంకర్లు నిర్ణయించడంతో, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవానికి ఆధార్ అనుసంధానం అయితే సదరు పట్టాదారు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు పొందితే ఆ విషయం బయటపడుతుంది. కానీ సాంకేతికపరమైన అంశాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆధార్ అవస్థలు : గడువు ముగుస్తున్నా అనేక మంది రైతులకు నేటికీ ఆధార్‌కార్డులు లేవు. దీంతో మీసేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పథకం, సంక్షేమ కార్యక్రమానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో కేంద్రాల వద్ద జనాలు క్యూలు కడుతున్నారు. అందుకు అనుగుణంగా ఆయా కేంద్రాల వద్ద ఏర్పాట్లు లేవు. గడువులోగా కనీసం ఆధార్ రసీదు నంబర్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కొన్ని చోట్ల నెలకొన్నాయి. నిర్ణీత వ్యవధిలోపు రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఉంటుంది. అయితే రుణమాఫీ ప్రకటనలో అనేక మంది రైతులు రుణాలు చెల్లించలేదు. రుణమాఫీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే రైతులపై వడ్డీ భారం పడింది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.