రైతులకు అప్పులిస్తలే! | Bank restrictions in the Crop loans | Sakshi
Sakshi News home page

రైతులకు అప్పులిస్తలే!

Published Thu, Aug 16 2018 3:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Bank restrictions in the Crop loans - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ పంట రుణాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో లక్ష్యానికి మించి పంట రుణాలిచ్చిన బ్యాంకులు.. నాలుగేళ్లుగా మాత్రం ఆ లక్ష్యాలు చేరుకోవడం లేదు. 2011–12 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 115 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 103 శాతం ఇవ్వగా.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014–15లో లక్ష్యంలో 93 శాతమే రైతులకు ఇచ్చాయి. అలా తగ్గుతూ వచ్చిన రుణాలు గతేడాది 79 శాతానికి చేరుకున్నాయి. 2017–18లో పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు కాగా, రూ. 31,410 కోట్లే అందించాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. భూమి చదును చేయడం, బావులు తీయడం తదితర మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే ఈ రుణాల విషయంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం చూపాయి. 2011లో లక్ష్యానికి మించి 205 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 200 శాతం రుణాలిచ్చిన బ్యాంకులు.. 2014–15లో కేవలం 62 శాతమే ఇచ్చాయి. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.  

కొత్త రుణమే లేదు 
ప్రస్తుత ఖరీఫ్‌లో రుణాల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఈ ఖరీఫ్‌లో 83 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవగా ఇప్పటివరకు బ్యాంకులు 30 శాతానికి మించి రుణాలివ్వలేదు. ఈ ఖరీఫ్‌ పంట రుణాల లక్ష్యం రూ. 25,496 కోట్లు, కానీ తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకులు రూ. 7,300 కోట్లే ఇచ్చాయి. విచిత్రమేంటంటే ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రుణాలు తీసుకున్న వారంతా రెన్యువల్‌ చేసుకున్న వారే. అంటే పాత బాకీలు చెల్లించి రెన్యువల్‌ చేసుకున్నవారే. ఇతరులకు కొత్తగా రుణం ఇవ్వలేదని సర్కారుకు పంపిన బ్యాంకు నివేదికే స్పష్టం చేసింది. బ్యాంకులు సహకరించక, మరోదారి లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద రైతులు అప్పులు చేస్తున్నారు. ఈ విషయమై ప్రభు త్వం మొత్తుకుంటున్నా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నా బ్యాంకుల వైఖరిలో మార్పు రావడం లేదన్న విమర్శలున్నాయి.  

సర్కారు, బ్యాంకుల మధ్య దూరమే!: 
భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో రైతుల సంఖ్య 58.33 లక్షలుంది. కానీ వారిలో 46.50 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. అయితే రైతుల వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో సరిచూసుకొని రుణాలు ఇవ్వాలన్న సర్కారు నిబంధనే రుణాల విడుదలకు శాపమైందని చెబుతున్నారు. వెబ్‌సైట్‌ ఇప్పటికీ అమలులోకి రాకపోవడంతో రెన్యువల్‌ చేసుకున్న వారికి తప్ప కొత్త రుణం రాలేదు. ఇలా కొందరు బ్యాంకు వర్గాలు ధరణిని సాకుగా చూపిస్తుండగా.. మరికొందరు ప్రభుత్వమే కారణమంటున్నారు. సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రుణాలపై వడ్డీ ఎలా చెల్లిస్తారో చెప్పకుండా గాలికొదిలేశారన్న ఆరోపణలున్నాయి. పావలా వడ్డీ సొమ్ము కూడా చెల్లించలేదని చెబుతున్నారు. ఇలా ప్రభుత్వం, బ్యాంకుల మధ్య తీవ్రమైన అగాథమే పంట, దీర్ఘకాలిక రుణాల్లో సమస్యలకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement