రైతును వరుణుడు కరుణిస్తున్నా... బ్యాంకులు మాత్రం దయ చూపడంలేదు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరుమీదున్నాయి. పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇటువంటి తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ రైతును ఇబ్బంది పెడుతున్నాయి. గత వారం పది రోజులుగా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ వర్షాలు లేక ఆగిన వరి నాట్లు ఇక పుంజుకోనున్నాయి. వారం రోజుల క్రితం వరకు 28 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 17 జిల్లాలకే పరిమితమైంది.
– సాక్షి, హైదరాబాద్
సాగు విస్తీర్ణాలిలా...
- ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 75.81 లక్షల (70%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 41.96 లక్షల (97%) ఎకరాల్లో సాగైంది.
- ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.90 లక్షల (33%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. తాజా వర్షాలతో అవి ఊపందుకోనున్నాయి.
- మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.26 లక్షల (66%) ఎకరాల్లో సాగైంది.
- పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.11 లక్షల (78%) ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.20 లక్షల ఎకరాలు, ఇప్పటివరకు 6.19 లక్షల (85%) ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ దాని సాధారణ సాగులో 80 శాతం వేశారు.
40 లక్షల మందికి.. పెట్టుబడి సాయం..
లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈసారి రైతులకు పెట్టుబడికింద ఇచ్చే రైతుబంధు సొమ్ము సరఫరా ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. ఖరీఫ్‌లో దాదాపు 50 లక్షల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా, ఇప్పటివరకు 40 లక్షల మందికి రూ. 4,400 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతుబంధు సొమ్ము వచ్చినట్లుగా తమకు మెసేజ్‌లు వచ్చాయని, కానీ బ్యాంకుల్లో సొమ్ము పడలేదని కొందరు రైతులు ఆందోళనతో వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశారు.
మూడో వంతే రుణాలు..
సాగు విస్తీర్ణం 70 శాతం కాగా, పంట రుణాలు మాత్రం లక్ష్యంలో దాదాపు 34 శాతానికే పరిమితమైనట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ. 29 వేల కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.10 వేల కోట్లకే పరిమితమైందని తెలిపాయి. వాస్తవంగా పంటల సాగు కంటే అంటే మే నెల నుంచే బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇప్పటికీ సాగు శాతంలో ఇచ్చిన రుణాలు సగమే. మూడు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి.
బ్యాంకుల వాదన ఇదీ..
2015–16 సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు పేరుకుపోయిన రూ.777 కోట్ల పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం తమకు చెల్లించలేదని బ్యాంకర్లు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండటంతో రిజర్వుబ్యాంకు నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వస్తాయని అంటున్నారు. మరోవైపు పంటల రుణమాఫీపై తమకు ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, దీంతో రైతులు బకాయిలు చెల్లించడంలేదని చెబుతున్నారు. పాత రుణాలను రైతులు రీషెడ్యూల్ చేసుకోకపోతే నిబంధనల ప్రకారం తాము కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే ఉండదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment