కొనసా...గుతున్న రుణమాఫీ జాబితా | Continue ... gutunna debt waiver list | Sakshi
Sakshi News home page

కొనసా...గుతున్న రుణమాఫీ జాబితా

Published Tue, Sep 23 2014 12:57 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Continue ... gutunna debt waiver list

  • రెండుసార్లు గడువు పొడిగించినా పూర్తి కాని వైనం
  •  11 శాతం మంది వివరాలే సేకరించిన కోర్ బ్యాంకులు
  •  మళ్లీ 25వ తేదీ వరకు గడువు పెంపు
  •  అప్పటికీ సేకరణ డౌటే!
  • విశాఖ రూరల్: రుణమాఫీ లబ్ధిదారుల వివరాల సేకరణ కొనసా..గుతోంది. ప్రక్రియను ప్రారంభించి రెండు వారాలు దాటినా ఇప్పటికీ పూర్తి కాలేదు. రెండుసార్లు గడువు పొడిగించిన కోర్ బ్యాంకులు కేవలం 11 శాతం మాత్రమే రైతుల వివరాలను సేకరించాయి. దీంతో వివరాల సేకరణకు మూడోసారి ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ జాప్యం జరుగుతోందని బ్యాంకర్లు చెబుతున్నారు.

    నాన్‌కోర్ బ్యాంకులు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ లేని బ్యాంకు బ్రాంచ్‌లో రైతుల వివరాలను అప్‌లోడ్ చేయడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. దీంతో వారు ఎక్సెల్ ఫార్మాట్‌లో వివరాలు పొందుపరిచి విశాఖ పరిధిలో ఉన్న బ్రాంచ్‌ల నుంచి ఎన్‌ఐసీ వెబ్‌సైటీలో అప్‌లోడు చేయాల్సి వస్తోంది. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూపించకుండా కావాలనే తాత్సారం చేయడానికి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    2013, డిసెంబర్ 31వ తేదీ వరకు రైతులు పొందిన రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు 31 అంశాలతో కూడిన ప్రొఫార్మాను తయారు చేసి వాటి ఆధారంగా రైతుల నుంచి ఆ వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో రైతుల వివరాలను బ్యాంకర్లు ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.

    వాస్తవానికి ఈ నెల 7 నుంచి 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ముందు సూచించింది. కానీ 7వ తేదీ నాటికి ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌ను బ్యాంకర్లకు అందుబాటులో ఉంచలేకపోయింది. 11వ తేదీ నుంచి బ్యాంకర్లు ఎన్‌ఐసీలో రైతుల వివరాలను పొందుపరుస్తున్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇబ్బందులు ఉన్న బ్యాంకు బ్రాంచ్‌ల నుంచి వివరాలు అప్‌లోడ్ చేయడం సాధ్యం కావడం లేదు.
     
    25వ తేదీకీ డౌటే : రెండుసార్లు గడువు పొడిగించినప్పటికీ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో మళ్లీ ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. కోర్ బ్యాంకులు ఇప్పటి వరకు కేవలం 11 శాతం మంది రైతుల వివరాలను మాత్రమే సేకరించాయి. ఇందులో అత్యధికంగా ఎస్‌బీఐ 99 శాతం వివరాలను సేకరించింది. అలాగే ఆంధ్రాబ్యాంక్ 24 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 64 శాతం, ఐసీఐసీఐ 35 శాతం, ఐడీబీఐ 15 శాతం, కరూర్ వైశ్యా బ్యాంక్ 55 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 75 శాతం, సిండికేట్ బ్యాంకు 27 శాతం మంది రైతుల వివరాలను సేకరించగలిగాయి.

    మొత్తంగా కోర్ బ్యాంకులు 1.27 లక్షల మంది రైతులకు రుణాలివ్వగా ఇప్పటి వరకు కేవలం 14,443 మంది రైతుల వివరాలను మాత్రమే అప్‌లోడ్ చేశాయి. నాన్‌కోర్ బ్యాంకులైన డీసీసీబీ, కో-ఆపరేటివ్ బ్యాంకులు 1.7 లక్షల మంది రైతులకు రుణాలిచ్చాయి. ఈ బ్యాంకులు రైతుల వివరాలను ఎక్సేల్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయడంతో ఎంత మంది వివరాలు సేకరించాయన్న విషయంపై స్పష్టత లేదు. కేవలం మూడు రోజుల్లో 89 శాతం మంది రైతుల వివరాల సేకరణ అసాధ్యమని అధికారులు సైతం చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement