నాలుగో వంతు కూడా ఇవ్వలేదు!
ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.32,909 కోట్లు
జూన్ వరకు ఇచ్చింది రూ.7,263 కోట్లే
రుణ మాఫీ జాప్యంతోనే రైతుకు రుణం కరువు
మహిళా సంఘాలకూ నామమాత్రంగానే మంజూరు
నేడు సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. అయినప్పటికీ ఖరీఫ్ రుణాల లక్ష్యంలో నాలుగో వంతు మేరకు కూడా బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేయలేదు. దీనికంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయకుండా జాప్యం చేయడమేనని బ్యాంకర్లు అంటున్నారు. రుణ మాఫీ హామీతో రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదని, రైతులు కానీ.. ప్రభుత్వం కానీ రుణ మొత్తాలను బ్యాంకులకు చెల్లించకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పంట రుణాలు అందలేదని పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో వ్యవసాయ రంగానికి మొత్తం రూ.32,909 కోట్లు రైతులకు రుణాలుగా అంజేయూలని బ్యాంకులు లక్ష్యంగా నిర్ధారించుకున్నాయి. అరుుతే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ వరకు వ్యవసాయ రంగానికి కేవలం రూ.7,263 కోట్లు మాత్రమే రుణాలిచ్చారుు. ఇక కౌలు రైతులకు రుణ మంజూరు పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ప్రస్తుత ఖరీఫ్‌లో కౌలు రైతులకు కేవలం రూ.3.81 కోట్లు మాత్రమే రుణంగా మంజూరు చేశారు. మరోపక్క పంటల బీమా గడువు కూడా ఈ నెల 15వ తేదీతోనే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం తొలి త్రైమాసికంలో రుణ పరపతి అమలుపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో సమీక్షించనున్నారు. ఇలావుండగా మహిళా సంఘాలకు రుణ మంజూరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. గ్రామీణ మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.12,275 కోట్ల మేరకు రుణాల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం రూ.610 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. పట్టణ మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.1,516 కోట్లు మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం రూ.176 కోట్లు మాత్రమే మంజూరు చేశారు.
పంటల బీమా.. దక్కని పరిస్థితి
రుణ మాఫీ వ్యవహారంతో రైతులకు రుణం దొరకపోగా పంటల బీమా కూడా లేకుండా పోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంటల బీమా కింద ఇటీవల రూ.68 కోట్లు విడుదల కాగా బ్యాంకులు ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వకుండా రుణాలకు జమ చేసుకున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి చెందిన పంటల బీమా కింద ఏపీకి రూ.680 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు పైసా రాలేదు. రుణ మాఫీ చేస్తున్నందున పంటల బీమా సొమ్మును సర్కారే తీసుకుంటుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.