రుణమాఫీ వడ్డీకే సరి! | SLBC meeting today | Sakshi
Sakshi News home page

రుణమాఫీ వడ్డీకే సరి!

Published Fri, Oct 16 2015 3:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

రుణమాఫీ వడ్డీకే సరి! - Sakshi

రుణమాఫీ వడ్డీకే సరి!

నాలుగు విడతలుగా రుణమాఫీ వల్లే గందరగోళం
రెండు విడతల సొమ్మును వడ్డీ కిందే జమచేసుకున్న బ్యాంకులు
గడువులోగా చెల్లించలేదంటూ అధిక వడ్డీ
ఆ వడ్డీని అసలు రుణంలో కలిపేస్తున్న వైనం
మాఫీ సొమ్ము వడ్డీ కింద జమ.. రుణమంతా అలాగే ఉన్నట్లు లెక్కలు
సర్కారుకు నివేదించిన ఇంటెలిజెన్స్ విభాగం
వడ్డీ సహా అప్పు చెల్లిస్తున్నామన్న సర్కారు
అడకత్తెరలో పోకచెక్కలా అన్నదాత
అప్రమత్తమైన ఆర్థిక శాఖ.. నేడు ఎస్‌ఎల్‌బీసీ సమావేశం
లబ్ధిదారుల రుణాల సమగ్ర వివరాల ప్రకటనకు నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసిన తొలి రెండు విడతల సొమ్మును బ్యాంకులు వడ్డీ కిందే జమ చేసుకున్నాయని... రైతుల ఖాతాల్లో ఇంకా ఎక్కువ బాకీ ఉన్నట్లుగా చూపిస్తున్నాయని ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నాలుగు విడతలుగా రుణమాఫీయే ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేసింది. వడ్డీ చెల్లింపుల విషయంలో కొన్ని బ్యాంకులకు ఇప్పటికీ అవగాహన లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని తేల్చి చెప్పింది. అందువల్లే రైతులకు కొత్త రుణాలు అందడం లేదని, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది.

‘‘మీరు తీసుకున్న రుణాలను గడువులోగా చెల్లించలేదు. అందుకే నిబంధనల ప్రకారం గడువు మీరిన పంట రుణాలకు వర్తించే 11 శాతం వడ్డీ చెల్లించాలి.’’ అంటూ కొన్ని బ్యాంకులు 11 శాతం వడ్డీని రైతుల ఖాతాల్లో అప్పు కింద జమ చేసుకుంటూ పోతున్నాయని తెలిపింది. కొన్నిచోట్ల పంట రుణాలకు సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఖాతాల్లో అప్పు రికవరీ, జమ అవుతుందని.. బ్రాంచి మేనేజర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదికలు అందజేసింది.

ఈ నివేదికలతో అప్రమత్తమైన ప్రభుత్వం రుణమాఫీ, వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని గుర్తించింది. వెంటనే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కావాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మరోవైపు రైతులకు ఎంత రుణం మాఫీ అయింది, ఇంకా ఎంత ఉందనే వివరాలతో జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
బ్యాంకుల తిరకాసు వల్లే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష వరకు పంట రుణాలను వడ్డీతో సహా మాఫీ చేసింది. దీంతో 36.33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. గత ఏడాది మార్చి 31 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు ఆగస్టు వరకు అయ్యే వడ్డీని సైతం లెక్కగట్టి ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. మొత్తం రూ.17 వేల కోట్లు అవసరంకాగా.. నాలుగు విడతలుగా చెల్లించేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది.

ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి రూ.8,450 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసుకుని, కొత్త రుణాలు ఇవ్వాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. కానీ కొన్ని చోట్ల బ్యాంకులు వడ్డీ చెల్లింపులకు సంబంధించి తిరకాసు పెట్టడంతో రుణమాఫీ పథకం ప్రయోజనం నెరవేరకుండా పోయిందని సర్కారు భావిస్తోంది. దీంతోపాటు రుణమాఫీ గందరగోళం, రైతుల ఆత్మహత్యలు ఇటీవల అసెంబ్లీ సమావేశాలను కుదిపేశాయి. వీటిపై విపక్షాల నిలదీతతో ఒక దశలో అధికార పార్టీ ఇరుకునపడింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌తో సర్వే చేయించింది.
 
ఇప్పుడేం చేద్దాం..
రుణమాఫీతో లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని.. అయితే ఇప్పటికీ తమ రుణం ఎంత మాఫీ అయింది, ఎంత మిగులు ఉందనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ పథకంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యను పక్కాగా తెలుసుకునేందుకు గతంలో ప్రభుత్వం బ్యాంకులు, బ్రాంచీల వారీగా జాబితాలను ప్రకటించింది. అదేతీరులో లబ్ధిదారుల రుణ వివరాలను సైతం వెల్లడిస్తే... ఈ గందరగోళానికి తెరపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. బ్రాంచీల వారీగా లబ్ధిదారులు తీసుకున్న రుణమెంత, ఎంత వడ్డీ చెల్లించాలి, అందులో ఎంత మొత్తం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది, మిగులు రుణమెంత..? అనే వివరాలన్నీ పేర్కొనాలని నిర్ణయించారు.

వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని, మొండికేస్తున్న కొన్ని బ్యాంకులతో అమీతుమీ తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట రుణాలకు వర్తించే వడ్డీమాఫీ పథకం అమల్లో ఉందని... కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం వడ్డీని ఏటా చెల్లిస్తున్నాయని బ్యాంకులకు స్పష్టత ఇవ్వటం ద్వారా రైతులపై ఒత్తిడిని తగ్గించాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement