karif Season
-
చేయి చేయి కలిపి...
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : ఆ ఏడు గ్రామాల్లోని ప్రజల కడుపు నిండాలంటే...పంట పొలాల్లోకి బాహుదానది నీరు చేరాలి. సాగునీరు పంట పొలాల్లోకి చేరాలంటే కరకట్టల నిర్మాణానికి రైతులు నడుం కట్టాలి. చేయి చేయి కలపాలి...సొంత సొమ్ము ఖర్చుపెట్టాలి. ఇదీ గత ఐదేళ్ల నుంచి ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు పంచాయతీ పరిధిలో ఉన్న 7 గ్రామాలకు చెందిన రైతన్నల ఖరీఫ్ కష్టాలు. స్థానిక బాహుదానది నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి కేశుపురం, బూర్జపాడు గ్రామ పంచాయతీలకు చెందిన 3 వేల మందికి పైగా రైతులు సుమారు 2,500 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఈదుపురం వంతెనకు సమీపంలో ఉన్న ఓల్డ్ కేశుపురం గ్రోయిన్నే నమ్ముకొని రైతులు పంటలు పండిస్తుంటారు. ఖరీఫ్ సీజన్లో అధికంగా వర్షాలు కురిసినప్పుడు వరద నీరు పంట పొలాల వైపుకు దూసుకు రాకుండా ఈ గ్రోయినే రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. పంట పొలాలకు కావాల్సిన నీటిని తీసుకొని మిగతా నీటిని బంగాళాఖాతానికి మళ్లిస్తూ తమ పంట పండించుకుంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు ఈ గ్రోయిన్ మరమ్మతులకు గురైతే రైతులే శ్రమదానం చేస్తూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. విషయాన్ని రైతులు గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ రూ.71 లక్షలతో 2016–17 సంవత్సరంలో గ్రోయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో తమ ఆశలు ఫలిస్తాయంటూ స్థానిక రైతులు సంబరాలు చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులకు సత్కారాలు చేశారు. గ్రోయిన్ మరమ్మతులు పేరిట రాయిని పేర్చి చేతులు దులుపుకున్నారు. అంతే గ్రోయిన్ నిర్మాణం సంగతినే సదరు ప్రజాప్రతినిధులు మరిచిపోయారు. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్‌కు బాహుదానదిలో అధికంగా వరద నీరు చేరడంతో మరమ్మతుకు గురైన గ్రోయిన్ పూర్తిగా ధ్వంసమయింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను ఓదార్చారు. తమ ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన పనులు వెంటనే చేయిస్తామంటూ మాట సైతం ఇచ్చి తప్పించుకున్నారు. ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా’ అన్న సినీ గేయాన్ని ఐదేళ్లలో బాగా వంటబట్టించుకున్న రైతులు ఖరీఫ్ సీజన్లో తమ పంటలను తామే రక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగానే 7 గ్రామల రైతులంతా చేయిచేయి కలిపారు. రూ.7 లక్షలతో శ్రమదానం ఈ ఏడాది తాత్కాలిక పనులు చేపట్టి పంటను రక్షించుకునే ఆరాటంలో రైతులు పడ్డారు. పనులు చేపట్టాలంటే సుమారు రూ.7లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని కేశుపు రం, బూర్జపాడు పంచాయతీలకు చెందిన రైతులే భరించుకునేందుకు ముందుకు వచ్చా రు. సెంటు భూమికి రూ.5 చొప్పున్న ఎకరా రైతుకు రూ.5 వేలు చందాగా ఇవ్వాలని రైతులు తీర్మానించారు. అనుకున్నదే తడువుగా శ్రమదానంతో పనులు మొదలుపెట్టారు. స్పందించిన కలెక్టర్ అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీపైనే రైతులు ఆధారపడ్డారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ రైతులంతా కలసి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజును కలిసి విన్నవించుకున్నారు. తక్షణమే స్పందించిన ఆయన గత నెల కలెక్టర్ నివాస్‌ను స్వయంగా కలిసి విన్నవించుకున్నా రు. తాత్కాలిక మరమ్మతుల కోసం తక్షణ సా యం రూపంలో సంబంధిత శాఖ ద్వారా రూ. 4 లక్షల 80 వేలు నిధులు మంజూరు చేస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పదిహేను రోజుల నుంచి రైతులు తమ సొంత సొమ్ముతో జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో పనులు ప్రారంభించారు. వందలాది ఇసుక బస్తాలతో కరకట్ట నిర్మించి తమ పంట పొలాలకు సాగునీరు అందేటట్టు దీక్షబూనారు. ప్రతి ఏటా పంటను కోల్పోతున్నాం బాహుదానదిలో నీరు అధికం కావడంతో ప్రతి ఏటా పంటను కోల్పోతున్నాం. గ్రోయిన్ పాడైపోవడంతో పంట పొలాలకు కావాల్సినంత సాగునీరు దొరకడంలేదు. అవసరమైన పరిస్థితుల్లో సాగునీరు వృథాగా సముద్రంలో కలసిపోతుంది. పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – దున్న లోకనాథం, రైతు, డొంకూరు గ్రామం చందాలు పోగుచేసి శ్రమదానం చేస్తున్నాం గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల మా రైతులమంతా భారీగా నష్టపోయాం. పదవులపై ఉన్న చిత్తశుద్ధి పనులపై లేకపోవడంతో గ్రోయిన్ పనులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ప్రతీ రైతు ఎకరా పొలంకు రూ.5 వేలు చందా ఇవ్వాల్సివస్తోంది. అధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. – పిలక వెంకటరావు, రైతు, కేశుపురం -
పల్లె కన్నీరుపెడుతుందో..
వర్షాలు లేక పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. కాలం కలిసిరాక బీళ్లుగా మారిన భూములు చూసి రైతులు బావురు మంటున్నారు. పొట్టకూటీ కోసం కూలీగా మారుతున్నారు. పనులు లేక కుటుంబ పోషణ కోసం పట్టణాల బాట పడుతున్నారు. పనులు లేక ఏం చేయాలో తోచని రైతులు ఊళ్లో అష్టా చెమ్మా ఆడుతూ, హోటళ్లలో కబుర్లు చెప్పుకుంటూ, కూడ ళ్ల వద్ద కాలక్షేపం చేస్తున్నారు. వరుణుడి కోసం రైతన్నలు ఆకా శం వైపు ఆశగా చూస్తున్నారు. సాక్షి, తానూరు (ముథోల్) : ఖరీఫ్ ప్రారంభంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉండడంతో రైతన్నల మొహంలో ఆనందం కనిపించింది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలున్నాయని వాతావరణశాఖ అధికారుల సూచనల మేరకు తమ పంటలకేమి డోకా లేదని ధీమాగా ఉన్నారు. జూన్ రెండవ వారంలో కొద్దిపాటి వర్షాలు కురియడంతో ఇక వర్షాలు కురియకుండా పోతాయా అని రైతులు తమ పంటపొలాల్లో విత్తనాలు వేసుకున్నారు. పక్షం రోజులు గడుస్తున్న మళ్లీ వర్షం కురియకపోవడంతో మొలకెత్తిన పత్తి, మినుము, సోయా మొలకలు పూర్తిగా ఎండిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. మరో వారం రోజుల తర్వాత వర్షం కురియడంతో రెండోసారి విత్తనాలు విత్తుకున్నారు. వారం రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో రెండవ సారి విత్తిన విత్తనాలు మొలకెత్తే దశలో వాడిపోతున్నాయి. తానూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి నష్ట పరిహారం అందించి అదుకోవాలని వేడుకుంటున్నారు. కరుణించని వరుణుడు.. జిల్లాలో జూన్ రెండవ వారంలో కొద్దిపాటి వర్షాలు కురియడంతో రైతన్నలు మురిసిపోయి పంటలను వేసుకున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తగా మరి కొన్ని మండలాల్లో వర్షాలు లేక ఎండిపోయాయి. తానూరు మండలంలోని మొగ్లి, మసల్గా, మసల్గా తండా, బెంబర, బోరిగాం, ఉమ్రి(కే), బెల్‌తరోడా, మహలింగి, బామ్ని, భోసి, బోల్సా, హిప్నెల్లి, ఎల్వి, ఎల్వత్, దాగాం, కళ్యాణి, కుప్టి, వడ్గాం, నంద్‌గాం, íసింగన్‌గాం, తానూరు, కోలూరు, జౌలా(బి), తొండాల గ్రామాల్లో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. పత్తి, సోయా, మినుము, పెసర పంటలు మొలకెత్తె దశలోనే వాడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో వర్షాలు కురియకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం సమయంలో మేఘాలు కమ్ముకోవడం, బలమైన గాలులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారుతోంది. అప్పులు తీరేదెట్ల.. తానూరు మండలంలో ఈ ఏడాది 17,329 హెక్టార్లలో రైతులు పంటల్ని సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో 6,500 హెక్టర్లలో పత్తి, 7,800 హెక్టర్లలో సోయా, 1200 హెక్టర్లలో మినుము, 16 50 హెక్టర్లలో కంది, 120 హెక్టర్లలో పెసర, 34 హె క్టర్లలో వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్ పం టలు తీసే దశలో అధిక వర్షాలు కురియడంతో పంట దిగుబడి రాలేదు. రబీలో వేసిన పంటలపై దిగుబడి పొందుదామనుకుంటే అకాల వర్షం కారణంగా రైతులు అంతగా దిగుబడి పొందలేక పొ యారు. ఈ ఏడాదైన పంటల దిగుబడి పొంది చేసిన అప్పులు తీర్చుదామనుకున్న రైతన్నలకు ని రాశే మిగిల్చింది. రెండవ సారి విత్తనాలు వేయడంతో అప్పులు బాగా పెరిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మూడు రోజలు క్రితం మొగ్లి, మసల్గా, మసల్గా తండా, గ్రామాలకు ఏడీఏ అం జిప్రసాద్, వ్యవసాయ అధికారి గణేష్‌లు వెళ్లి వా డిపోతున్న పంటలను పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమయం దా టిపోతుందని రైతులకు 50 శాతం సబ్సిడీపై వి త్తనాలు అందించి తానూరు మండలాలన్ని కరువు మండలంగా ప్రకటించి నష్టపరిహారం అందించా లని రైతులు ఏడీఏ అంజిప్రసాద్కు వినతి పత్రం అ టందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హమీ ఇచ్చారు. కుటుంబ పోషణ కోసం పట్టణాలకు.. ఎండ కాలంలో గ్రామంలో జాతీయ ఉపాధి హా మీ పథకంలో కూలీలకు చేతినిండా పని కల్పిం చా రు. దీంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. జూ న్ మొదటి వారంలో ఉపాధి హామీ పనులను అ ధికారులు నిలిపివేయడంతో వర్షాలు లేక కూలీ ల కు పనిదొరకడం లేదు. దీంతో పనుల కోసం ప ట్ట ణాల బాట పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కు రిస్తే చేతి నిండా పని ఉండేదని వర్షాలు లేక కొంత మంది రైతులు, కూలీలు గ్రామాల్లోని చా వడి వ ద్ద, ఆలయాల్లో, హోటళ్లలో అష్టాచెమ్మా ఆ డు తూ, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు అందేవిధంగా చూస్తాం తానూరు మండలంలోని ఆయా గ్రామాల్లో సం దర్శించి రైతుల పంటలను పరిశీలించారు. వర్షాలు లేక పంటలు మొలకెత్తలేదు. సోయా, పత్తి విత్తనాలు వేసుకునే సమయం దాటి పో యింది. వర్షాలు కురియగానే రైతులకు సబ్సి డీపై కంది విత్తనాలు అందించేందుకు సిద్దంగా ఉంచాం. పంటలకు బీమా చేసుకోవాలని రైతులకు సూచించాం. బీమా చేసుకున్న రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తాం. – ఏడీఏ, అంజిప్రసాద్ రెండు సార్లు విత్తనాలు వేశాం ఈ ఏడాది జూన్ రెండవ వారంలో కొంత మేరకు వర్షాలు కురియడంతో విత్తనాలు వేసుకున్నాం. వర్షం కురియకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. వారం రోజుల తర్వాత మరోసారి వర్షం కురిసింది. భూమిని దున్ని మరోసారి విత్తనాలు వేసుకున్నాం. విత్తనాలు మొలకెత్తినా వర్షాలు లేక మొలకలు వాడిపోతున్నాయి. రెండో సారి పంటలు వేయడంతో తీవ్రంగా నష్టపోయాం. రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే మొలకలు బతుకుతాయి. లేదంటే నష్టమే మిగులుతుంది. – నాగేశ్వర్ జకోటే, మొగ్లి రైతు నష్ట పరిహారం అందించాలి మొగ్లి గ్రామంలో వర్షాలు కురియక రైతులు వేసుకున్న పంటలు మొలకెత్తలేదు. ఖరీఫ్‌లో పంటలు వేసుకునే సమయం దాటిపోయింది. పంటలు వేసుకున్నా దిగుబడులు రావడం కష్టంగా మారింది. దీంతో రైతులు విత్తనాల కోసం చేసిన అప్పులు తీరని పరిస్థితి ఉంది. అధికా రులు తానూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలి. – దిగాంబర్, రైతు, మొగ్లి -
విత్తన కంపెనీల ప్రచార హోరు
బేల(ఆదిలాబాద్): ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో పత్తి విత్తన కంపనీలు ఊదరగొడుతున్నాయి. ప్రచార రథాలు, మైక్సెట్లు, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్లెక్సీలు, కటౌట్లతో హోరెత్తిస్తున్నాయి. ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాల్లో ప్రచారం చేపడుతూ రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రైతులను సమీకరించి సమావేశాలు పెడుతూ ఊదరగొడుతున్నారు. అధిక దిగుబడి వస్తుందంటూ నమ్మబలుకుతూ బుట్టలో వేసుకుంటున్నారు. కొందరు దళారులు నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ బీటీ పత్తి విత్తనాలను సరఫరా చేసే కొన్ని సంస్థలు వందల రకాలను మార్కెట్లో ఇప్పటికే సంసిద్ధం చేశాయి. రైతులు అప్రమత్తంగా ఉండకపోతే పంటలు నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. నాణ్యమైన పత్తి బీటీ విత్తనం 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.730కు లభిస్తుండగా నకిలీ విత్తనాల ప్యాకెట్ రూ.400నుంచి రూ.600 వరకు విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొందరు డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లకు పలు కంపనీలు విదేశీ, విహార యాత్రలకు అవకాశం కల్పిస్తూ అధిక మొత్తంగా విత్తనాలు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు నకిలీ విత్తనాలపై నిఘా వేసి, పూర్తిస్థాయిలో అరికట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో.. జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి భూములున్నాయి. దీంతో ప్రధాన పంటగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది వర్షభావ పరిస్థితులు ఉండడంతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఎక్కువ భూముల్లో నీటి సౌకర్యం లేకపోవడం, వర్షాధారంతో కూడా అధికంగా పత్తి పంట సాగు చేసే వీలుండటంతోనే కొన్నేళ్ల నుంచి పత్తిపంటపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కృత్రిమ కొరత ఇలా.. తొలకరి చినుకులు మొదలైతే రైతులు విత్తనాలకోసం విత్తన విక్రయకేంద్రాల ఎదుట బారులు తీరుతారు. ఇదే అదనుగా భావించి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. ఇదే సమయంలో కొత్త రకం విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు అంటగడుతుంటారు. కొన్నేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అప్పు రుపేణా.. జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు అప్పు రూపేణా విత్తనాలు అందిస్తుంటారు. ఇలాంటి సమయంలో నకిలీ విత్తనాలు అంటగడుతుంటారు. వారు ఇచ్చే విత్తనాలు తీసుకోవడమే గానీ, కావాలనుకున్న కంపనీల విత్తనాలు ఇవ్వరు. పంట పండినా, పండకపోయినా పంట దిగుబడి వచ్చే సమయంలో ఇచ్చిన సరుకుకు వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ∙నకిలీ విత్తనాలను గుర్తించేందుకు వాటిని తయారు చేసిన కంపనీ పేరు, లోగో, బ్యాచ్, లాట్ నంబర్, తయారు చేసిన తేదీ, వాడకానికి గరిష్ఠ గడువు వంటివి ఖచ్చితంగా పరిశీలించాలి. ∙గుర్తింపు పొందిన డీలర్ల నుంచే కొనుగోలు చేయాలి. ∙ఐఎస్ఓ స్టీక్కర్ ఉందో లేదో గమనించాలి. ∙జెర్మినేషన్(మొలకెత్తే శాతం) వివరాలు చూడాలి. ∙ఎలాంటి అనుమానాలున్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. -
ఖరీ...ఉఫ్
కర్నూలు(అగ్రికల్చర్) : ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా వేసిన దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరోగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగానికి చెందిన సహాయ గణాంక అధికారులు, వ్యవసాయశాఖకు చెందిన ఏఈవోలు, ఎంపీఈవోలు నిర్వహిస్తున్న పంటకోత ప్రయోగాల్లో ఈ విషయం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో ఖరీఫ్ దిగుబడులను అంచనా వేసేందుకు పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. వరికి గ్రామం యూనిట్‌గా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తున్నందున 1,580 పంటకోత ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన పంటల్లో 666 పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తారు. వరిలో ఇంకా పంటకోత ప్రయోగాలు మొదలు కాలేదు. మిగిలిన పంటల్లో కొద్దిరోజులుగా దిగుబడులను అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు 6,35,327 హెక్టార్లు ఉండగా జూన్, జూలై నెలల్లో 3 లక్షల హెక్టార్ల వరకు సాగు చేశారు. తరువాత సాగు.. 6,24,897 హెక్టార్లకు పెరిగింది. వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోవడంతో పలు గ్రామాల్లో దున్నేశారు. కొన్ని గ్రామాల్లో ఉన్నా..దిగుబడులు అసలు కనిపించలేదు. వేరుశనగతో పాటు కొర్ర, సజ్జ, మినుము పంటల్లో ఈ పరిస్థితి కనిపించింది. ఆలస్యంగా వేసిన పంటల్లో ఒక మోస్తరు దిగుబడులు.... సెప్టెంబరు నెలలో వివిధ మండలాల్లో భారీగా, మరికొన్ని మండలాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావంతో ఆలస్యంగా సాగుచేసిన పంటల్లో 20 నుంచి 40 శాతం వరకు దిగుబడులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా..ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతులు ర బీలో శనగ, జొన్న వంటి పంటలు వేసుకోవడానికి భూములను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు లేకపోవడంతో రబీ సాగు ప్రశ్నార్థకం అయింది. రబీలో సాధారణ సాగు 3.50 లక్షల హెక్టార్లు ఉండగా శనగ 2.20 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రూపాయి దిగుబడి లేదు నేను ఐదు ఎకరాల్లో సజ్జ, కంది, ఆముదం వేశాను. ఎకరాకు సగటున రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఒక్క రూపాయి విలువ పంట కూడా రాలేదు. ఇంతటి దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవు. అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. పశువులకు మేత కూడా లేకుండా పోయింది. దారుణమైన కరువు పరిస్థితులు ఉన్నా.. ప్రభుత్వం నుంచి చేయూత లేకుండా పోయింది. : ముసలన్న, నేరడుచెర్ల గ్రామం, ప్యాపిలి మండలం దిగుబడులే లేవు : జూన్‌లో వేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేసిన భూముల్లో ఇప్పటికే పంటలను దున్నేశారు. దీంతో రైతులు స్టేట్మెంట్ తీసుకొని.. జీరో దిగుబడులు ఉన్నట్లు నమోదు చేస్తున్నాం. ముందస్తుగా వేసిన వేరుశనగ, కొర్ర, ఆముదం తదితర పంటలన్నీ ఎత్తిపోయాయి. పంట కోత ప్రయోగాలపై విశ్లేషణ అమరావతిలో చేస్తారు. – రమణప్ప, డీడీ, జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు.. (మిల్లీమీటర్లలో) నెల సాధారణ వర్షపాతం నమోదైన వర్షపాతం జూన్ 77.2 65.2 జూలై 117.2 52.9 ఆగస్టు 135.0 65.8 సెప్టెంబరు 125.7 98.7 అక్టోబరు 114.5 32.3 -
చుట్టూ చెరువులు.. చేలు కుదేలు
నిడమర్రు : నిడమర్రు బాడవ ఆయకట్టులోని 250 ఎకరాల్లో ఖరీఫ్ వరినాట్లు పడలేదు. ఆ పొలాల చుట్టూ చేపల చెరువులు విస్తరించడమే ఇందుకు కారణమైంది. పొలాల్ని కౌలుకు పొలం ఇద్దామన్నా సాగుకు ఎవరూ ముందుకు రాలేదు. చేపల చెరువుల తవ్వకానికి అనుమతుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో సరిహద్దు రైతులు నష్టపోతున్నారు. పొలాన్ని చెరువు తవ్వుకునేందుకు అనుమతి మంజూరు చేసేప్పుడు జీవో నంబర్ 7 ప్రకారం సరిహద్దు రైతుల అభ్యంతరాలు పరిగణలో తీసుకోవాలి. చెరువు చుట్టూ బోదె నిర్మించాలి. ఈ బోదె గట్టుకు వరి పొలం గట్టుకు మధ్య దూరం 3 మీటర్లు ఉండాలి. రొయ్యల సాగుకు ఎటువంటి అనుమతి లేదు. ఈ విషయాలు పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు అనుమతులు లభిస్తున్నాయని రైతులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితులే బాడవ ఆయకట్టుకు ముప్పు తెచ్చాయి. ఈ ఆయకట్టులో సుమారు 400 ఎకరాల్లో వరి పొలాలు ఉన్నాయి. ఆయకట్టుకు పడమరవైపు చేపల చెరువులు తవ్వేశారు. తూర్పు వైపు ఏలూరు రోడ్డు వద్ద చెరువులు తవ్వేందుకు అనుమతుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 32 మంది సరిహద్దు రైతులు ఈ ఏడాది ఫిబ్రవరి 22న కలెక్టర్‌ను కలిసి చుట్టూ చెరువులు విస్తరిస్తే భవిష్యత్‌లో పొలాలకు వెళ్లేం దుకు మార్గం ఉండదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామన్న మత్స్యశాఖ అధికారులు స్పందించలేదు. మే నెలలో 2 ఎకరాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఐదు రోజుల్లో అక్కడ చెరువులు తవ్వి బోర్లు వేసి రొయ్యల సాగు ప్రారంభించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
చినుకు రాలలే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎండనకా, వాననకా, పగలనకా, రేయనకా ఆరుగాలం శ్రమించే రైతులే ఎప్పుడూ అన్యాయానికి గురవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు మొదలు ఉత్పత్తులను అమ్ముకునే వరకు ఇదే జరుగుతోంది. వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు బాగానే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు రైతులను సతమతం చేస్తున్నాయి. ప్రతి సీజన్లోనూ వర్షాభావం, విత్తనాలు, ఎరువుల కొరత పరిపాటిగా మారుతోంది. 2013-14 ఖరీఫ్‌లో పంటల సాగు వ్యవసాయ శాఖ అంచనాలను మించి 110 శాతానికి చేరింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి సోయా, పత్తి రైతులను దగా చేశారు. 2014-15 ఖరీఫ్‌లో సమస్య పునరావృత్తం కాకుండా చూడాలన్న రైతులు, రైతు సంఘాల డిమాండ్ మేరకు కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ శాఖ మా ర్పులు చేసింది. గత ఖరీఫ్‌లో 3,12,782 హెక్టార్లలో దిగులు తప్పడం లేదు. వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు బాగానే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు రైతులను సతమతం చేస్తున్నాయి. ప్రతి సీజన్లోనూ విత్తనాలు, ఎరువుల కొరత పరిపాటిగా మారుతోంది. 2013-14 ఖరీఫ్‌లో పంటల సాగు వ్యవసాయ శాఖ అంచనాలను మించి 110 శాతానికి చేరింది. వ్యాపారులు సిం డికేట్‌గా మారి సోయాబీన్, పత్తి రైతులను దగా చేశారు. 2014-15 ఖరీఫ్‌లో సమస్య పునరావృత్తం కాకుండా చూడాలన్న రైతులు, రై తు సంఘాల డిమాండ్ మేరకు కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ శాఖ మార్పులు, చేర్పులు చేసింది. గత ఖరీఫ్‌లో 3,12,782 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా, ఈసారి 4,18,100 హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తేవాల్సి ఉండగా ఇప్పటికీ, ఈ దిశగా కసరత్తు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. 2015 ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళిక ఇది 2014 ఖరీఫ్‌లో రూపొందించిన వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక పూర్తిగా తలకిందులయ్యింది. పది శాతం అధికంగా సాగు కాగా, 3,12,782 హెక్టార్లలో పంట లు వేశారు. ఈ నేపథ్యంలో సోయాబీన్ విత్తనాల కొరత ఏర్పడింది. ఈ ఖరీఫ్‌లో 4,18,100 హెక్టార్ల వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన అధికారులు ఇందు కోసం 1.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగు చేస్తారని నివేదిక పేర్కొంది. 55,000 హెక్టార్లలో మొక్కజొన్న, 15,000 హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని అంచనా. ఇందుకోసం 1,12,500 క్వింటాళ్ల సోయా, 11,000 క్విం టాళ్ల మొక్కజొన్న, 75,000 ప్యాకెట్ల అజిత్, మహికో, నూజివీడు, తులసి విత్తనాలు అవసరముంటుందన్నారు. ఏపీ సీడ్స్, హాకా, ఏపీ ఆయిల్‌ఫెడ్‌లతో పాటు ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు తదితర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా 1,12,500 క్వింటాళ్ల సోయా విత్తనాలను మాత్రం హాకా, ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్‌ల ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు. ఇదిలా వుంటే ఖరీఫ్ కోసం 1,32, 278 మెట్రిక్ టన్నుల యూరియా, 18,548 మె.టన్నుల డీఏపీ, 63,062 మె.టన్నుల కాంప్లెక్స్ 20,005 మె.టన్నుల ఎంఓపీ ఎరువులు కలిపి మొత్తం 2,34,303 మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే జూన్‌లో 67,925 మెట్రిక్ టన్నుల ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఆ మేరకు సరఫరా కాలేదంటున్నారు. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2760 కోట్లు 20 15-16 ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2760 కోట్లుగా పేర్కొనగా, ఇప్పటి వరకు బ్యాంకర్లు చాలాచోట్ల రైతులకు రుణాలిచ్చే ప్రక్రియను ప్రారంభించ లేదు. తొలకరి జల్లు కురి స్తే చాలు దుక్కులు చదును చేయడంతోపాటు విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పరుగులు పెడతారు. ఈలోగానే రైతులకు రుణాలు చేతికందితే ప్రయోజనకరంగా ఉ ంటుందన్న అభిప్రాయం ఉంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రాజెక్టులు నీరులేక వెల వెల పోతుండగా, ఆయకట్టుదారులు వరుణుడిపైనే ఆశలు పె ట్టుకున్నారు. గత ఖరీఫ్, రబీలో ప్రతికూల పరిస్థితులలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ ఖరీఫైనా కలిసి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో అధికారులు సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తేవడంతోపాటు ఖరీఫ్ రుణాలను వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
సాగు సాగేదెట్టా ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఖరీఫ్ సీజన్ ముంచుకువస్తోంది. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుకు ఆర్థిక వనరులను సమకూర్చలేదు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామన్న హామీని టీడీపీ ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో రైతులంతా బ్యాంకుల్లో డిఫాల్టర్లు అయ్యారు. పాత రుణాలు తీర్చనిదే కొత్త రుణాలు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా జూన్‌లో మెట్టదుక్కులు, నారుమళ్లు సిద్ధం చేసుకోవడం, విత్తనాలు, ఎరువుల సేకరణ, పాత రుణాలు తీర్చి కొత్త రుణాలు తీసుకునే పనుల్లో బిజీగా ఉంటారు. ఇప్పుడాపరిస్థితి తారుమారు అయింది. పాత అప్పు తీర్చు...కొత్త అప్పు తీసుకో అనే ధోరణితో బ్యాంకర్లు వ్యవహరిస్తుండటంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వడ్డీ వ్యాపారాన్ని నిలిపివేసిన పెట్టుబడిదారులు మళ్లీ ఆ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆరు నెలల ఖరీఫ్ సీజన్‌కు మూడు రూపాయల వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. దస్తావేజులు, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 2.39 లక్షల హెక్టార్లు. వరి, పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగవుతున్నాయి. సాధారణంగా ప్రతీ ఏటా జూన్ నాటికి బ్యాంకర్లు రైతులకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ మొత్తంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంతోపాటు వరి నాట్లకు అవసరమైన డబ్బును చేతిలో ఉంచుకుంటారు. 2014-15 లో రూ.3,797 కోట్లను పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా తీసుకుంటే ఖరీఫ్ పూర్తయ్యేనాటికి రూ. 980 కోట్లను మాత్రమే రుణాలుగా ఇచ్చాయి. ఈ మొత్తంలో సహకార బ్యాంకులు ఇచ్చింది రూ.500 కోట్ల వరకు ఉంది. ఈ బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోయినప్పటికీ, పాత రుణాలు తీర్చినట్టు, కొత్త రుణాలు ఇచ్చినట్టు బుక్ ఎడ్జెస్ట్‌మెంట్లు చేశాయి. ఇక మిగిలిన రూ.480 కోట్లను రైతులు కొత్తగా రుణాలు తీసుకున్నారు. 2015-16లో ఖరీఫ్ సీజనుకు రూ.7,415 కోట్లు రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా తీసుకుంటే, ఇప్పటి వరకు రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఏడాది కాలంగా రుణమాఫీని అమలు చేస్తామని ప్రభుత్వం చేస్తున్న హామీలను దృష్టిలో ఉంచుకుని రైతులు పాత రుణాలను తీర్చలేకపోయారు. డిఫాల్టర్లుగా మిగిలి పోయిన రైతులకు కొత్త రుణాలు మంజూరు కాకపోవడంతో ఆ రుణాల కేటాయింపు ఇప్పటికి నామమాత్రంగానే ఉంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లా యంత్రాంగం 17 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలను సిద్ధం చేసింది. యూరియా 20,004 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,243 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు 10,083 మెట్రిక్ టన్నులు, పొటాష్ 1,149 మెట్రిక్ టన్నులను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో పెరుగుతున్న వడ్డీ వ్యాపారులు ... బ్యాంకులు కొత్త రుణాల మంజూరు చేయకపోవడంతో రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో వడ్డీ వ్యాపారాన్ని మానేసిన పెద్ద రైతు లు, ధాన్యం వ్యాపారులు, మిల్లర్లు మళ్లీ ఆ బాట పట్టారు. ఆరు నెలల ఖరీఫ్ సీజ న్కు మూడు రూపాయల వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. ధాన్యం వ్యాపారులు ముం దుగా పెద్ద ఎత్తున విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సామాన్య రైతులకు అధిక రేటుపై అరువుకు విక్రయిస్తున్నారు. ఈ విధానంలో రైతు ఆ మొత్తాలకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రాజధాని నేపథ్యంలో వ్యవసాయ భూముల ధరలు కూడా పెరగడంతో దస్తావేజులు ఉంచుకుని, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని రుణాలు ఇస్తున్నారు. ఈ విధానంలో రైతులు మోసపోయే పరిస్థితులు దాపురించాయి. -
పిల్లల్ని ఎలా సాదేది?
* రైతుల ఆత్మహత్యతో కకావికలమైన కుటుంబాలు * తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులు * అప్పులు, ఎండిన పంటలతోనే మరణాలు * లోకాయుక్తకు గోడు వెళ్లబోసుకున్న మహిళలు * స్వతంత్ర కమిటీ వేయాలన్న రైతుసంఘం * ఆత్మహత్యల పిటిషన్‌పై విచారణ వచ్చేనెల 24 కు వాయిదా సాక్షి, హైదరాబాద్: పంటలు ఎండి, అప్పుల భారం పెరిగి రైతన్నలు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో కరవు పరిస్థితులు రైతుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. చనిపోయినవారిలో ఎక్కువమంది యువరైతులే ఉన్నారు. దీంతో తమ పిల్లలను ఎలా పెంచాలో తెలియక తల్లులు ఆవేదన చెందుతున్నారు. పంటలు పండుతాయన్న ఆశతో అప్పులు చేసి సాగుచేస్తే వర్షాలు రాక ఎండిపోయాయని, వడ్డీవ్యాపారులు బాకీలకోసం వేధిస్తున్నారని బాధితులు తల్లడిల్లుతున్నారు. సర్కారు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అంతేకాక మంగళవారం లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వేసిన పిటిషన్‌పై లోకాయుక్తలో జరిగిన విచారణకు బాధితకుటుంబాల వారు హాజరయ్యారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని, అనాథలైన పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతోనే విద్య చెప్పించాలని రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ కోరారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిటీ వేసి వివరాలు సేకరించాలని కోరారు. అయితే, రైతుల ఆత్మహత్యలపై ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ల నుంచే నివేదికలు అందాయనీ, మిగతా జిల్లాల నుంచి రావాల్సి ఉన్నందున విచారణను వచ్చే నెల 24వ తేదీకి లోకాయుక్త వాయిదా వేసిందని ఆమె చెప్పారు. కుటుంబసభ్యులను కోల్పోయిన మహిళలను ‘సాక్షి’ పరామర్శించి వివరాలు సేకరించింది. వారి మనోవేదన వారి మాటల్లోనే... నా కొడుకూ కోడలు ఇద్దరూ చనిపోయారు నా వయస్సు 78 ఏళ్లు. నా కోడలు యాదమ్మ (30) ఆర్థిక సమస్యలు, అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఆమె చనిపోయిన 10 రోజుల్లోనే కొడుకు నరసింహులు (35) పత్తి, మొక్కజొన్న, వరి ఎండిపోవడంతో గత నెల 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. నా మనవళ్లు శ్రీశైలం (7), శ్రీకాంత్ (4)లను అనాధలయ్యారు. నాకు పింఛన్ కూడా రావడంలేదు. నా కొడుకు చేసిన రూ. 2 లక్షల అప్పులు చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారు. ఏం చేయాలి దేవుడా? మమ్మల్ని ప్రభుత్వమే కాపాడాలె. - చంద్రమ్మ, సిరంగపురం, మహబూబ్‌నగర్ జిల్లా పంటలు ఎండిపోవడంతో.. నా భర్త రాజేందర్ (35) పంటలు ఎండిపోయి, అప్పులు పెరిగి గత నెల 20న బావి దగ్గర ఉరేసుకున్నడు. మూడెకరాల భూమిలో పత్తి ఏసిండు. మొలకెత్తకపోతే రెండుమూడుసార్లు విత్తనాలు నాటిండు. కౌలుకు తీసుకున్న ఇంకో 3 ఎకరాల్లో మొక్కజొన్న ఏసిండు రూ. 4 లక్షల అప్పు చేసిండు. పంటలు ఎండిపోయి, అప్పు మిగిలిపోగా ఆత్మహత్యే దిక్కనుకున్నడు. నన్ను ఒంటరి దాన్ని చేసిపోయిండు. నాకు ఏడాది కొడుకు, 13 ఏళ్ల బిడ్డ ఉంది. వాళ్లను ఎట్లా సాదాలే. అప్పులెట్ల తీర్చాలే. - విజయ, పీచుపల్లి, బెజ్జంకి మండలం, కరీంనగర్ జిల్లా పురుగుమందు తాగి నా భర్త శ్రీహరి (63) రెండెకరాల్లో పత్తి, ఒక ఎకరంలో వరి వేశాడు. పత్తి సరిగా మొలకెత్తకపోతే నాలుగుసార్లు విత్తాడు. అయినా అది ఎండిపోయి, రూ. 3.7 లక్షల అప్పులు కావడంతో మనోవేదనకు గురై చేనులోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. - కొల్లిపాక భాగ్యలక్ష్మి, వరంగల్ జిల్లా పత్తి ఎండిపోయి.. అప్పులు పెరిగి నా భర్త అంజయ్య (35) రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. పత్తి మొదటిసారి మొలకెత్తకపోవడంతో రెండోసారి వేశాడు. అయినా నీరు లేకపోవడంతో పత్తిపంట పోయింది. సాగు కోసం రూ. 2.50 లక్షలు అప్పులు చేశాడు. పంట ఎండి, అప్పులు పెరిగి మానసిక వేదనకు గురై జూలై 23వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వారిద్దరూ చిన్నారులే. నా జీవితం అంధకారమైంది. - అనూష, వరంగల్ జిల్లా పదెకరాలు కౌలుకు తీసుకుంటే.. నా భర్త నరసింహులు పంటలు ఎండిపోవడంతో 20 రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఎకరాలు కౌలుకు తీసుకొని, రూ. 2.5 లక్షలు అప్పు చేసి మొక్కజొన్న వేశాడు. వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది. నా జీవితం చీకటిమయం అయింది. - విమల, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా -
డ్రిప్పుతో వరి సాగు మేలు!
‘చుక్కల’తో చక్కని పంట! బిందు సేద్యం, బోదె పద్ధతిలో వరి సాగు సాధ్యమే దిగుబడి సాధారణం కంటే ఎక్కువే సాగు నీరు, విద్యుత్ ఆదా పలు రాష్ట్రాల్లో విస్తృత స్థాయి పరిశోధనలు ఖరీఫ్ కాలంలో వర్షం బాగా తగ్గి భూగర్భ జలాలు పరిమితంగా ఉన్నప్పుడు.. రబీలో దానికి తగ్గట్టుగా పంటలను, పంటల సాగు తీరును మార్చుకోవడం తెలివైన పని. సాగునీరు అధికంగా అవసరమయ్యే వరి పంటను నీటిని నిల్వగట్టే పద్ధతిలో కన్నా.. డ్రిప్పుతో సాగు చేయడం మంచిది. కంది వంటి పప్పుధాన్యపు పంటలను అంతరపంటగా వేసుకుంటే మరీ మంచిది. ప్రపంచ జనాభాలో అత్యధికుల రోజువారీ ప్రధాన ఆహారం వరి అన్నం. వాతావరణ వైపరీత్యాల కారణంగా భూగర్భ జలాలు త్వరితంగా అడుగంటుతున్నాయి. ఈ ఏడు దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కురిసిన మేర కూడా అదనులో కురిసినవి కావు. ఈ పరిస్థితుల్లో వరి పంట విస్తీర్ణం తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో వరిసాగును బురద దుక్కి చేసి సాగు చేయడం అలవాటు. పూర్వకాలంలో కొన్ని బెట్టను తట్టుకునే వరి వంగడాలను మెట్ట పంటగా సాగు చేసేవారు. ప్రస్తుతం వరి సాగు దమ్ముచేసి సాగు చేయడం ఆనవాయితీ. దీంతో 75 శాతం జల వనరులు వరి సాగుకే ఖర్చవుతున్నాయి. మన దేశంలో 150 గ్రాముల ధాన్యం పండించడానికి 1,000 లీటర్ల సాగు నీరు ఖర్చవుతోందని తమిళనాడు వాటర్ టెక్నాలజీ డెరైక్టర్ బీజే పాండ్యన్ వివరిస్తున్నారు. నీటి వనరులు కరువై, వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న ఈ నేపథ్యంలో వరి సాగుకు ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణ ప్రారంభమైంది. వాస్తవానికి వరి మొక్క నీటిలో పెరిగేది కాదు. నీరు నిల్వ లేని పరిస్థితుల్లోనూ మనగలగడమే కాకుండా బలంగా దుబ్బు కట్టే లక్షణం వరికి ఉంది. అయితే కలుపును అదుపు చేసేందుకే వరిలో నాటింది మొదలు వెన్ను వంచే వరకు 2 నుంచి 5 సెంటీమీటర్ల నీరు నిల్వగట్టడం అలవాటుగా మారింది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో వరుస తడుల్లో నీటిని పారించి పంట చేతికి అందుకుంటున్న అనుభవం మన రైతు సోదరులకు ఉంది. ఈ పరిస్థితుల్లో వరిని ఆరుతడి పంటగానూ, వరిలో అంతర పంటలను సాగు చేయడానికి సంబంధించిన పలు ప్రయోగాలు ఆచరణలోకి వస్తున్నాయి. సగం సాగునీరు ఆదా వర్షాభావ పరిస్థితుల్లో కూడా వరి సాగుకు అనువైన పద్ధతులను అన్వేషించినప్పుడు బిందు సేద్య పద్ధతి మేలైనదిగా గుర్తించారు. తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోనూ పలువురు రైతులు వరి సాగు చేసి మేలైన దిగుబడులు సాధించారు. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల్లో సాధారణ పద్ధతికంటే 50 శాతం తక్కువ నీటితో వరి సాగు చేయడం సాధ్యమేనని రుజువైంది. పైగా బిందు సేద్యం వలన గాలి బాగా తగిలి పైరు బలంగా దుబ్బుకడుతుంది. ఆరుతడితో పండించిన వరిలో హెక్టారు (సుమారు 2.5 ఎకరాలు) సాధారణ 5 నుంచి 6.5 టన్నుల దిగుబడి కంటే అధికంగా 7 టన్నుల వరకు దిగుబడి సాధించారు. దీనితో పాటు విద్యుత్ ఖర్చు 40 శాతం మేరకు తగ్గి, రైతుకు రూ. 6 వేల వరకు అధికాదాయం లభిస్తోందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులంటున్నారు. మెట్ట వరి(ఎరోబిక్) సాగంటే కలుపు సమస్య కళ్ల ముందు భూతంలా నిలబడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఉభయ తారక మంత్రం ఒకటుంది. అదే దబోల్కర్ పద్ధతి. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీపాద దబోల్కర్ పంటను సాగు చేసే ముందు భూసారం పెంచడానికి పచ్చిరొట్ట సాగును సూచించారు. అది కూడా కేవలం ఒక రకం కాకుండా వీలయినన్ని ఎక్కువ రకాలను పచ్చిరొట్టగా సాగు చేసి, భూమిలో కలియదున్నితే అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయని రుజువు చేశారు. దబోల్కర్ పద్ధతి అన్ని రకాల పంటలను సాగుచేసి పచ్చి రొట్టగా కలియదున్నడమే దబోల్కర్ పద్ధతి. చిరుధాన్యాలు (జొన్నలు, సజ్జలు, ఉదలు, కొర్రలు, సామలు), పప్పు దినుసులు (మినుములు, పెసలు, శనగలు, చిక్కుళ్లు), నూనెగింజలు (నువ్వులు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు, ఆముదాలు), పచ్చిరొట్ట విత్తనాలు (జీలుగ, జనుము, ఉలవలు, పిల్లిపెసర) విత్తనాలను ఎకరానికి ఆరేసి కిలోల చొప్పున, సుగంధ ద్రవ్యాలు (మెంతులు, ధనియాలు, ఆవాలు, వాము) కిలో, మొత్తం 26 కిలోలు తీసుకొని ఎకరా పొలంలో అలికి గొర్రుతో ఎదబెట్టాలి. తరువాత నీరు కట్టాలి. ఈ గింజలు పెరగడంతో పాటు నేలలో ఉన్న కలుపు మొక్కలు మొలుస్తాయి. 45 రోజులు పైరు పెరిగిన తరువాత భూమిలో కలియ దున్నుకోవాలి. దీని వలన భూమిలో సేంద్రియ కర్బనం, పోషకాలు పెరుగుతాయి. నేల సారవంతమౌతుంది. కలుపు సమస్య చాలా వరకు తీరుతుంది. పచ్చిరొట్ట పైరు కలియదున్నాక పొలం మీటరు ఎడంతో బోదెలు తోలుకోవాలి. ఈ బోదెలకు మధ్య భాగంలో డ్రిప్పు పైపును వేసుకోవాలి. తొలిరోజు నీరు పెట్టిన తరువాత బెడ్ మొత్తం తడిగా మారుతుంది. ఈ తడి బోదెపై వరుసకు - వరుసకు మధ్య అడుగు, మొక్కకు - మొక్కకు అర అడుగు దూరంతో వరి నాటేసుకోవాలి. అవకాశం ఉంటే పంట వ్యర్థాలతో మల్చింగ్(ఆచ్ఛాదన) చేసుకుంటే కలుపును పూర్తిగా అదుపు చేయవచ్చు. నేలలో తేమ కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. కలుపు తీత చేపట్టినప్పుడు డ్రిప్పు పైపులను తీసి నాగలితో దున్నుకోవచ్చు. గుంటక తోలుకోవచ్చు. మోటార్‌తో నడిచే మినీ వీడర్‌తో పని మరింత సులభమౌతుంది. వీడర్ తిప్పిన తరువాత మొక్కల వద్ద కలుపు చేతితో తీసుకోవాలి. వరిలో అంతరపంటగా పప్పుదినుసుల సాగు! మెట్ట వరి(ఎరోబిక్)లో కంది, పెసర, మినుము, సోయాబీన్‌ను అంతర పంటలుగా పండించుకోవచ్చు. పప్పుదినుసుల పంటలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరింపజేస్తాయి. వీటిల్లో కంది అనుకూలం. ఖరీఫ్ అయినా రబీ అయినా కంది కాపు వేసవి ఆరంభానికే అందుతుంది. బోదెలు ఉత్తర-దక్షిణాలుగా చేసుకోవడం వలన ఉత్తరాయణం, దక్షిణాయనాల్లో సూర్యుడి ప్రయాణం భిన్న మార్గంలో ఉన్నా ఎండ నిండుగా పడుతుంది. ఇలం, ఫలం అన్నట్లు పప్పు దినుసుల సాగుతో వరికి నత్రజని అందడంతో పాటు అదనపు ఆదాయం అందుతుంది. వరిలో అంతర పంటగా కంది సాగుకు ఎల్‌ఆర్‌జీ-41, ఐసీపీఎల్ లక్ష్మి అనుకూలం. ఎండు తెగులున్న చోట మాత్రం ఎల్‌ఆర్‌జీ-41 అనుకూలం కాదు. ఎరువుల వినియోగం పచ్చిరొట్ట కలియ దున్నిన తరువాత వీలును బట్టి ఘనజీవామృతం వేసుకోవడం లేదా పంచగవ్య పిచికారీ చేసుకోవడం చేయాలి. పైరు నాటిన తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి వడకట్టిన జీవామృతం డ్రిప్పు ద్వారా అందించవచ్చు. లేదా 5 శాతం పంచగవ్యను పిచికారీ చేసుకోవచ్చు. జీవామృతం, పంచగవ్య వినియోగం వలన ఏదేని కారణంగా పంటకు నీరందించలేకపోయినా బెట్టకు రాకుండా నిలదొక్కుకుంటుంది. పైరు బలంగా రావడమే కాక పొడవైన వెన్ను వేసి, గింజ బరువు పెరుగుతుంది. - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్ ఫొటోలు: మోర్ల అనిల్‌కుమార్ -
నాలుగో వంతు కూడా ఇవ్వలేదు!
ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.32,909 కోట్లు జూన్ వరకు ఇచ్చింది రూ.7,263 కోట్లే రుణ మాఫీ జాప్యంతోనే రైతుకు రుణం కరువు మహిళా సంఘాలకూ నామమాత్రంగానే మంజూరు నేడు సీఎం అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. అయినప్పటికీ ఖరీఫ్ రుణాల లక్ష్యంలో నాలుగో వంతు మేరకు కూడా బ్యాంకులు రైతులకు రుణాలను మంజూరు చేయలేదు. దీనికంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయకుండా జాప్యం చేయడమేనని బ్యాంకర్లు అంటున్నారు. రుణ మాఫీ హామీతో రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదని, రైతులు కానీ.. ప్రభుత్వం కానీ రుణ మొత్తాలను బ్యాంకులకు చెల్లించకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట రుణాలు అందలేదని పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో వ్యవసాయ రంగానికి మొత్తం రూ.32,909 కోట్లు రైతులకు రుణాలుగా అంజేయూలని బ్యాంకులు లక్ష్యంగా నిర్ధారించుకున్నాయి. అరుుతే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ వరకు వ్యవసాయ రంగానికి కేవలం రూ.7,263 కోట్లు మాత్రమే రుణాలిచ్చారుు. ఇక కౌలు రైతులకు రుణ మంజూరు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌లో కౌలు రైతులకు కేవలం రూ.3.81 కోట్లు మాత్రమే రుణంగా మంజూరు చేశారు. మరోపక్క పంటల బీమా గడువు కూడా ఈ నెల 15వ తేదీతోనే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం తొలి త్రైమాసికంలో రుణ పరపతి అమలుపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో సమీక్షించనున్నారు. ఇలావుండగా మహిళా సంఘాలకు రుణ మంజూరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. గ్రామీణ మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.12,275 కోట్ల మేరకు రుణాల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం రూ.610 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. పట్టణ మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.1,516 కోట్లు మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం రూ.176 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. పంటల బీమా.. దక్కని పరిస్థితి రుణ మాఫీ వ్యవహారంతో రైతులకు రుణం దొరకపోగా పంటల బీమా కూడా లేకుండా పోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంటల బీమా కింద ఇటీవల రూ.68 కోట్లు విడుదల కాగా బ్యాంకులు ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వకుండా రుణాలకు జమ చేసుకున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి చెందిన పంటల బీమా కింద ఏపీకి రూ.680 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు పైసా రాలేదు. రుణ మాఫీ చేస్తున్నందున పంటల బీమా సొమ్మును సర్కారే తీసుకుంటుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ముదిరిన నారుతో ముప్పే
సిద్దిపేట రూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి గడ్డు కాలాన్నే మిగిల్చింది. ఇప్పటి వరకూ జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. వరి నాట్ల కోసం పోసిన తుకాలు ముదిరిపోయాయి. ఈ క్రమంలో రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో 70 రోజుల నారును సైతం నాటేస్తున్నారు. ఇదే వీరి పాలిట శాపంగా మారుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నారు పోసిన 25 నుంచి 35 రోజుల్లోపు నాట్లు వేయాల్సి ఉన్నా మండలంలోని కొన్ని గ్రామాల్లో అవగాహన లేని పలువురు రైతులు ముదిరిన నారు కొనలను కత్తిరించి నాటేస్తున్నారు. బంజేరుపల్లికి చెందిన ఓ రైతు ఏకంగా సుమారు 70 రోజుల వరి నారును నాటు వేయడం కనిపించింది. ఇలాగైతే సరైన దిగుబడులు రాక నష్టపోయే ప్రమాదం ఉంది. నారు ముదిరితే తెగుళ్లు వస్తాయి వరి నారు పోసిన 25 నుంచి 35 రోజుల మధ్యలో నాటేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 35 నుంచి 45 మించి వాడకూడదు. దీన్ని కూడా చివర్లు కత్తిరించి దగ్గర దగ్గరగా ఎక్కువ పిలకలు నాటాలి. దుక్కి మందును అధికంగా వాడాలి. ముదురు నారును నాటితే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. - అనిల్‌కుమార్, ఏఓ, సిద్దిపేట, సెల్: 8886612490 -
పూర్తి వివరాలు ఇవ్వండి: ఆర్బీఐ
* రుణాల రీ షెడ్యూల్‌పై మరింత సమాచారం కోరిన ఆర్బీఐ * ఎస్ఎల్బీసీ సహకారం కోరిన హైదరాబాద్ ఆర్బీఐ శాఖ * ముందు రీషెడ్యూల్కు అనుమతి కోసం ఆర్బీఐకి లేఖ రాయనున్న సీఎం బాబు సాక్షి, హైదరాబాద్: రుణాల రీషెడ్యూలు విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రాష్ట్రం నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడింది. గత ఖరీఫ్‌లో కరవు, తుపాను ప్రభావిత మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌ను ప్రభుత్వం కోరుతుండగా.. ఆ మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌ను అనుమతించడంపై ఆర్బీఐ(ముంబాయి) మరిన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ వివరాలను పంపాల్సిందిగా హైదరాబాద్‌లోని ఆర్బీఐ శాఖను కోరింది. మండలాల వారీగా రుణాల మంజూరు వివరాలతో పాటు.. సాగు చేసిన పంటలు, వాటికి మంజూరు చేసిన రుణాలు, ఆ పంటల దిగుబడి.. తదితర వివరాలను అందించాల్సిందిగా స్థానిక ఆర్బీఐ శాఖను కోరింది. దాంతో ఆ వివరాలు అందివ్వాల్సిందిగా స్థానిక ఆర్బీఐ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ)ని కోరడంతో వారు రాష్ట్రంలోని వివిధ బ్యాంకు బ్రాంచీలను ఆ సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రెండు మూడు మండలాలకు చెందిన రుణాల మంజూరు వివరాలు మాత్రం ఉన్నాయని బ్రాంచీలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా మంజూరు చేసిన రుణాల వివరాలను మాత్రం ఇవ్వగలమని, మండలాల వారీగా ఆ వివరాలివ్వలేమని బ్యాంకర్ల కమిటీ హైదరాబాద్‌లోని ఆర్బీఐకి లేఖ రాసింది. ముందు అనుమతివ్వండి! మండలాల వారీగా రుణాల మంజూరు సమాచారం అందే వరకు ఆర్బీఐ నుంచి రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీంతో మండలాల వారీ సమాచారం అంతా ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని, తొలుత రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్బీఐకి లేఖ రాయాలని భావిస్తున్నారు. గత ఖరీఫ్‌లో కరవు, తుపాను ప్రభావిత ప్రాంతాలుగా 572 మండలాలను ప్రకటించామని, అయితే 90 రోజుల దాటిన తరువాత జీవో విడుదల చేశామని, ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదని, ఇదే సమయంలో ఒరిస్సాలో కూడా తుపాను వచ్చిందని, అక్కడ రుణాలు రీ షెడ్యూల్ చేశారని ఆర్బీఐకి రాయనున్న లేఖలో సీఎం వివరించనున్నారు. రుణాలు రీ షెడూల్‌కు అనుమతిం చాలని, 572 మండలాల్లో రుణాలు 10,500 కోట్ల రూపాయలున్నాయని బాబు వివరించనున్నారు. -
ఇప్పుడు మొక్కల సాంద్రత పెంచాలి
పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేసే పప్పు జాతి పంటల్లో కంది ముఖ్యమైనది. అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కంది సాగుపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ కో-ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ) డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సంప్రదించవచ్చు) అందిస్తున్న సూచనలు... ఎప్పుడు-ఎలా వేయాలి? కందిని తొలకరిలో జూన్, జూలై నెలల్లో విత్తుకోవాలి. అయితే వర్షాలు ఆలస్యంగా కురిస్తే ఆగస్టులో కూడా విత్తనాలు వేసుకోవచ్చు. అప్పుడు వరుసల మధ్య దూరాన్ని తగ్గించుకొని, మొక్కల సాంద్రత పెంచాలి. కంది సాగుకు మురుగు నీటి పారుదల సౌకర్యం కలిగిన నేలలు అనువుగా ఉంటాయి. ఖరీఫ్‌లో వేసుకునేందుకు ఎల్‌ఆర్‌జీ-41, 30, 38, ఐసీపీయల్-85063 (లక్ష్మి), 332 (అభయ), 87119 (ఆశ), 84031 (దుర్గ), డబ్ల్యూఆర్‌జీ-27 రకాలు అనువైనవి. కందిని నాగలి వెంబడి లేదా సాళ్లలో గొర్రుతో విత్తుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో వరుసల మధ్య 150/180 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. ఎర్ర నేలల్లో వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు వేయడానికి ముందు ఎకరానికి 3 కిలోల విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. విత్తిన 24 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1-1.25 లీటర్ల పెండిమిధాలిన్ కలిపి పిచికారీ చేసుకుంటే ప్రధాన పంటలో, అంతరపంటలో నెల రోజుల వరకూ కలుపు సమస్య ఉండదు. పైరు 100 రోజుల దశకు చేరుకునే లోపు మొక్కల పైన ఉండే కొమ్మలను తుంచితే పక్క కొమ్మలు విస్తారంగా వస్తాయి. దిగుబడులు బాగుంటాయి. పోటీ పడకూడదు కందితో పోటీపడే స్వభావమున్న పైరును అంతరపంటగా ఎంచుకోకూడదు. కంది వేర్లు భూమి లోపలికి వెళతాయి. కాబట్టి వేర్లు తక్కువ లోతు వెళ్లే పైరును అంతరపంటగా వేసుకోవాలి. కందిలో జొన్న, మొక్కజొన్న (ఆహార ధాన్యపు పంటలు), పెసర, మినుము, సోయాచిక్కుడు (పప్పు ధాన్యపు పంటలు), వేరుశనగ (నూనె గింజల పంట), రాగి, సజ్జ, కొర్ర (చిరు ధాన్యపు పంటలు) పైర్లను అంతరపంటగా వేసుకోవచ్చు. కందిలో పెసర, మినుము, వేరుశనగను 1:7 నిష్పత్తిలోనూ, చిరు ధాన్యపు పంటలను 1:8 నిష్పత్తిలోనూ వేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట మొక్కజొన్న, గోరుచిక్కుడు వంటి పంటలను కందిలో 1:2 నిష్పత్తిలో వేయాలి. కంది పైరు 100 రోజుల వరకూ నిదానంగా పెరుగుతుంది. మనం వేసే అంతరపంట 110 రోజుల లోపే చేతికి వస్తుంది. కాబట్టి అది కంది పంటకు ఏ విధమైన పోటీ కాదు. కంది కొమ్మలు 100 రోజుల వరకూ పక్కకు వ్యాపించవు కనుక అంతరపంటకు గాలి, వెలుతురు బాగా తగిలి మంచి దిగుబడి వస్తుంది. అంతరపంటను కోయగానే గొర్రు/గుంటకతో ఒకసారి కంది వరుసల మధ్య అంతరకృషి చేయాలి. దీనివల్ల అంతరపంట ఆకులు భూమిలో కలిసి, పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పంట చేలో ఏర్పడిన పగుళ్లు కలిసిపోతాయి. కంది పైరు బెట్టకు గురికాదు. కలుపు మొక్కల బెడద కూడా తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం కంది పైరుకు చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల భాస్వరాన్ని అందించే ఎరువు వేయాలి. ఎనిమిది కిలోల నత్రజనిని అందించే ఎరువును 3 సమాన భాగాలుగా చేసుకొని దుక్కిలో, పైరు 100 రోజుల దశలో, 140 రోజుల దశలో ఉన్నప్పుడు వేయాలి.భూమిలో తేమ ఉన్నప్పుడు రసాయన ఎరువులు వేసుకుంటే మొక్కలకు పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో అందుతాయి. అంతరపంట వేసినప్పుడు పైరును బట్టి ఎరువుల మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు, అంతరపంటకు వేర్వేరుగా ఎరువులు వేసుకోవాలి. దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి? కంది దీర్ఘకాలిక పంట. కాబట్టి పూత, కాయ దశల్లో ఈ పైరులో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మరుకా మచ్చల పురుగు, ఎండు తెగులు, వెర్రి తెగులు వంటి చీడపీడలు దాడి చేస్తాయి. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. మొక్కలు సరైన సాంద్రతలో లేకపోయినా దిగుబడులు తగ్గుతాయి. అలాగే సకాలంలో, సరైన మోతాదులో ఎరువులు వేయకపోవడం వల్ల దిగుబడులు దెబ్బతింటాయి. చాలా మంది రైతులు కందిని సహ పంటగా, మిశ్రమ పంటగా వేస్తుంటారు. అయితే ప్రధాన పంటను కోసిన తర్వాత కందిని అశ్రద్ధ చేస్తుంటారు. దీనివల్ల దిగుబడులు ఆశించిన మేరకు లభించవు. పైరు చివరి దశలో బెట్టకు గురైనప్పుడు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. -
తొలి దశ నుంచే దాడి చేస్తాయి
పాడి-పంట: జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటను వర్షాధారంగా, నీటి వనరుల కింద సాగు చేస్తున్నారు. అయితే ఈ పైరుపై తొలి దశ నుంచే చీడపీడలు దాడి చేసి నష్టపరుస్తున్నాయి. వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటయ్య. ఆ వివరాలు... మొక్క మొలకెత్తిన తర్వాత... ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న దిగుబడులను ప్రభావితం చేసే పురుగుల్లో ప్రధానమైనది మచ్చల కాండం తొలుచు పురుగు. ఈ పురుగు మొక్క మొలకెత్తిన 10-12 రోజుల నుంచే పైరును ఆశిస్తుంది. కాండానికి నష్టం కలిగిస్తుంది. రెక్కల పురుగులు ఒక దానిపై ఒకటిగా, గుంపులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన, కాడ దగ్గర గుడ్లు పెడతాయి. అవి చేప పొలుసు మాదిరిగా కన్పిస్తాయి. గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటికి వచ్చి ముందుగా ఆకుల పత్రహరితాన్ని తినేస్తాయి. ఆ తర్వాత కాండాన్ని తొలుస్తాయి. కాండం అడుగు భాగం నుంచి రంధ్రం చేసుకుంటూ లోపలికి ప్రవేశిస్తాయి. అక్కడ ఎదిగే అంకురాన్ని తింటాయి. దీనివల్ల మొవ్వులు చనిపోతాయి. లేకుంటే మొక్క మొదలు నుంచి నాలుగైదు పిలకలు వస్తాయి. అయితే వాటిలో ఏ ఒక్క పిలకకూ ఉపయోగపడే కంకులు రావు. పురుగు ఆశించిన మొక్క కాండాన్ని చీల్చి చూస్తే లోపల గుండ్రని లేదా ఇంగ్లీషు ‘ఎస్’ ఆకారంలో సొరంగాలు కన్పిస్తాయి. ఈ పురుగును నివారించాలంటే... ముందుగా పురుగు ఆశించిన మొక్కల అవశేషాలను కాల్చేయాలి. చేలో కలుపు మొక్కలు, చెత్తా చెదారం లేకుండా చూడాలి. పైరులో వరుసల మధ్య కంది/బొబ్బర్లు/సోయాచిక్కుడును అంతరపంటగా వేసుకుంటే కాండం తొలుచు పురుగుకు సహజ శత్రువులైన పురుగుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఈ పురుగు తాకిడి తగ్గుతుంది. ట్రైకోగ్రావూ ఖిలోనిస్ అనే పరాన్నజీవి గుడ్లను ఎకరానికి 2-3 ట్రైకోకార్డుల రూపంలో రెండు విడతలుగా... విత్తిన 12, 22 రోజులప్పుడు వేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 3 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఆకు సుడుల్లో వేయాలి. రసాన్ని పీలుస్తాయి మొక్కజొన్న పైరును రసం పీల్చే పేనుబంక, నల్లి ఆశిస్తే మొక్కలు గిడసబారతాయి. వాటి ఎదుగుదల సరిగా ఉండదు. పేనుబంక పురుగు చాలా చిన్నదిగా, సూది మొన మాదిరిగా ఉంటుంది. ఆకుపచ్చ లేదా నీలి రంగులో ఉండే తల్లి, పిల్ల పురుగులు మొక్కల లేత ఆకులు, కాండాన్ని ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు వాడినట్లుగా పసుపు రంగుకు వూరి వుుడుచుకుపోతారుు. మొక్క మొలిచిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు పైరుపై దాడి చేస్తుంది. ఇది విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం వల్ల కాండం, లేత ఆకులను శిలీంద్రాలు ఆశిస్తాయి. ఈ తీపి పదార్థం కోసం నల్ల చీమలు చేరతాయి. శిలీంద్రాల కారణంగా మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. మొక్కలకు పూత (జల్లు) రాక దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా అక్షింతల పురుగులు, స్పిరిడ్స్, లేస్ వింగ్ బగ్స్ వంటివి పేనుబంకను అదుపులో ఉంచుతాయి. కాబట్టి పురుగు తాకిడి తక్కువగా ఉన్నప్పుడు మందులు వాడకూడదు. ఒకవేళ పేనుబంక దాడి ఎక్కువగా ఉన్నట్లయితే అవసరాన్ని బట్టి లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నెల రోజుల దశను దాటిన మొక్కజొన్న పైరును నల్లి పురుగు ఆశిస్తుంది. తల్లి, పిల్ల నల్లులు ఆకుల కింది భాగంలో సావుూహికంగా లేదా విడివిడిగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులపై సన్నని, తెల్లని వుచ్చలు ఏర్పడతారుు. ఆగస్ట్-అక్టోబర్ మధ్యకాలంలో పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. నల్లులు ముందుగా పై ఆకులను ఆశించి, ఆ తర్వాత కింది ఆకులకు వ్యాపిస్తాయి. దీంతో మొక్క పాలిపోయి ఎండుతుంది. ఈ మొక్కను తాకిన మనుషులకు దురద పుడుతుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు సోకితే... మొక్కలు జల్లు దశకు వచ్చిన తర్వాత, కంకి దశలో ఉన్నప్పుడు మొక్కజొన్న పైరుకు ఎండు తెగులు సోకుతుంది. తెగులు సోకిన మొక్కలు పై నుంచి కిందికి వడలిపోతాయి. ఆకులు లేతాకుపచ్చ రంగుకు వూరి తర్వాత ఎండిపోతారుు. మొక్క కణుపులు సహజ రంగును కోల్పోరుు, ఎరుపుతో కూడిన గోధువు రంగుకు వూరి కుంచించుకుపోతారుు. ఆ తర్వాత మెత్తబడతాయి. చివరికి ఎండిపోయి బెండుగా తయారవుతాయి. తెగులు కారక శిలీంద్రాలు భూమిలో, పంట అవశేషాలలో, విత్తనాలలో జీవిస్తాయి. పైరు పూత దశకు వచ్చిన తర్వాత నీటి ఎద్దడి ఏర్పడితే తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు నివారణకు పంట మార్పిడి చేయాలి. కిలో ట్రైకోడెర్మా విరిడెను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండిలో కలిపి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. చేలో పరిశుభ్రత పాటించాలి. విత్తడానికి ముందు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ పట్టించి శుద్ధి చేయాలి. పుష్పించే దశ నుంచి పైరుకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలి. -
పొంచివున్న కరువు!
సంపాదకీయం: కీడెంచి మేలెంచాలని నానుడి. చినుకు రాల్చకుండా చోద్యం చూస్తున్న మబ్బుల తీరును గమనిస్తే వర సగా నాలుగో ఏడాది కూడా ఖరీఫ్ కాలాన్ని కరువు కబళిస్తుందేమోనన్న కలవరపాటు కలుగుతున్నది. అప్పుడే అంత నిరాశ అవసరం లేదు...జూలై రెండోవారం దాకా చూడవచ్చన్నది కొందరి ఆశావహుల మాట. నిజమేనా? జూన్ నెలాఖరులోనూ భగభగలాడుతున్న సూర్యుణ్ణి చూసినా...ఊపిరాడనీయకుండా చేస్తున్న ఉక్కబోతను గమనించినా నమ్మకం కలగడంలేదు. పెళ్లి నడకలతో వచ్చిన రుతుపవనాలు ఎలాగో పద్ధతిగా విస్తరించాయిగానీ కాలం కలిసిరాక కదల్లేకపోతున్నాయి. వానమ్మ జాడలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికి సాధారణం కంటే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు లెక్కలుగడుతున్నారు. మన స్థితి మరింత అధ్వాన్నం...ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కన్నా దాదాపు 70 శాతం తక్కువగా, తెలంగాణలో 46 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రధాన జలాశయాలన్నిటా నీరు ఆవిరవుతున్నదంటున్నారు. కనుక సామాన్యుల మాటెలా ఉన్నా, ప్రభుత్వాలు మేల్కొనవలసిన తరుణం మాత్రం ఆసన్నమైంది. ప్రమాదాన్ని శంకించకతప్పని స్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటాయి. జూన్ నెల ఇక పూర్తికావొచ్చినట్టే గనుక మిగిలిన మూడు నెలల్లోనే దండిగా వర్షాలు పడాలి. కానీ, కరువుకాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఎల్ నినో ప్రతాపం చూపించే సమయం కూడా ఈ మూడు నెలలే. అందువల్ల దుర్భిక్షం ఏర్పడ్డదని వాతావరణ విభాగం గుర్తించి ప్రకటించకముందే అందుకవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మన ప్రభుత్వాల గత చరిత్ర తిరగేస్తే ఇలాంటి ముందుచూపు ఉన్నట్టు కనబడదు. ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయడం, అరకొరగా పనికానిచ్చేయడం...విషమ పరిస్థితులు ముంగిట్లోకొచ్చాక నెపం ప్రకృతిపైకి నెట్టి అమాయకత్వం నటించడం మామూలైపోయింది. 2002నాటి తీవ్ర దుర్భిక్షాన్ని తలుచుకున్నప్పుడు గుర్తొచ్చేది ఇదే. ఆరుగాలం శ్రమించే రైతుకు ప్రభుత్వాలు కుడిఎడమల దన్నుగా నిలవకపోతే, అవసరమైన సలహాలు, సూచనలతో ఆదుకోకపోతే ముప్పేట ఇబ్బందులు చుట్టుముడతాయి. పంట నష్టానికిచ్చే పరిహారం బకాయిలేమైనా ఉంటే వెనువెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలి. అలాగే ఏ పంటలు వేయాలి...ఏవి వేయకూడదు...ఇప్పటికే అదునుదాటి, వర్షాలస్థితి అగమ్యగోచరంగా ఉన్న స్థితిలో పత్తి వంటి పంటల విషయంలో ఏంచేయాలి అన్న అంశాల్లో సలహాలు అందజేయాలి. ఏంచేస్తే ఉన్నంతలో లాభమో, ఏది అనర్ధమో తెలపాలి. అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ విస్తరణ సేవలు మూలమూలనా పరుచుకునేలా వ్యవసాయ సిబ్బందిని అప్రమత్తంచేయాలి. క్షేత్రస్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణ కొరవడుతున్నదని గత అనుభవాలు చెబుతున్నాయి. కనుక ఆ లోటుపాట్లను సమీక్షించుకుని మండల స్థాయి అధికారులను సైతం కదిలించి రైతులకు అవసరమైన సహాయసహకారాలు అందేలా చూడాలి. తక్కువ వర్షపాతం కారణంగా నిరుటితో పోలిస్తే వరి సాగు 53 శాతం తగ్గిందని అంచనా. వరినాట్ల పరిస్థితి ఇలావుంటే నూనెగింజల పంటల స్థితి మరింత అధ్వాన్నం. వాటి సాగు విస్తీర్ణం 85 శాతం తక్కువగా ఉన్నదని చెబుతున్నారు. పత్తి సాగు 28.9 శాతం తక్కువగా ఉంది. కరువు పరిస్థితి ఏర్పడితే పత్తి సాగుచేసిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సివస్తుంది. వ్యవసాయం ఇలావుంటే దానిపై ఆధారపడే కూలీల స్థితి మరీ ఘోరంగా మారుతుంది. అందువల్లే ఉపాధి హామీ పథకంవంటివి పకడ్బందీగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. బాబు ప్రభుత్వం 15,000మంది ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి పంపుతూ జీవో జారీచేసిన నేపథ్యంలో ఈ పథకం అమలు ఎలా ఉంటుందోనన్న సందేహాలు కలుగుతున్నాయి. పశుగ్రాసం అందుబాటులో ఉంచడం మరో సమస్య. ఇంతకుముందు కరువు నెలకొన్నప్పుడల్లా పెద్ద సంఖ్యలో పశువులు కబేళాలకు తరలినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి ఆ దుస్థితి దాపురించకుండా పశుగ్రాసం అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉంచడమెలాగో ప్రణాళికలు రచించాలి. అసలే ఆర్ధిక స్థితి గత కొన్నేళ్లుగా సవ్యంగా లేదు. వృద్ధిరేటు కుంగుతుంటే ద్రవ్యలోటు విజృంభిస్తున్నది. ఆహారద్రవ్యోల్బణం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతున్నది. తిండి గింజల నుంచి కూరగాయల వరకూ అన్నీ ప్రియమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా గమనించి ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాలి. వరసబెట్టి ఖరీఫ్ సీజన్లు దెబ్బతిన్నా రబీ సీజన్లు ఎంతో కొంత కాపాడాయి. అందువల్లే తిండిగింజల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయి. వీటిని సకాలంలో తరలించి పేద ప్రజానీకానికి పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోనట్టయితే బ్లాక్ మార్కెటింగ్ పెరిగి ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏంచేయాలన్న విషయంలో యూపీఏ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడంలో విఫలమైంది. ఎన్డీయే ప్రభుత్వమైనా దీనిపై దృష్టిపెట్టాలి. అలాంటి మార్గదర్శకాలుంటే కిందిస్థాయినుంచే సకాలంలో నివేదికలందుతాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంలోనూ స్పష్టత ఉంటుంది. చురుగ్గా స్పందించడానికి వీలుకలుగుతుంది. జూలైలో వర్షాలు పడతాయన్న ఆశాభావంతో ఉంటూనే ప్రత్యామ్నాయాలపై కూడా పాలకులు దృష్టిసారిస్తారని, కష్టకాలంవస్తే రైతులకు అండదండలందించి ఆదుకుంటారని ఆశిద్దాం. -
రుణ మాఫీ కోసం రైతుల ఎదురు చూపులు
-
ఏరువాక పిలుస్తోంది.. అప్పు ఆపుతోంది !
* పంట రుణాల మాఫీ ఇంకెప్పుడంటూ రైతుల్లో ఆందోళన * స్పష్టత లేనందున ఏమీ చేయలేమంటున్న బ్యాంకర్ల కమిటీ సాక్షి నెట్వర్క్: ఖరీఫ్ సీజన్ తరుముకొస్తోంది. వారం రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పంట సాగుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన సమయం. కానీ వ్యవసాయ రుణాల మాఫీపై నెలకొన్న గందరగోళం, మరోవైపు బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నారుు. వాస్తవానికి ఈ సమయూనికే రైతులు తమ రుణాలు తిరిగి చెల్లించి కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు తాము తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆ పార్టీ నేతలైతే రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. కొన్ని చోట్ల పోస్టర్లు ముద్రించి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే అధికారం చేపట్టనుండటంతో రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ రుణ మాఫీపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పలుచోట్ల బ్యాంకులు రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారుు. బంగారం తాకట్టుపెట్టి రుణాలు పొందిన రైతులకు సదరు బంగారాన్ని వేలం వేస్తామంటూ బ్యాంకులు ప్రకటనలు జారీ చేస్త్తున్నారుు. అనంతపురం జిల్లా పుట్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ‘పంట రుణాలు రెన్యూవల్ చేయబడును’ అని నోటీస్ బోర్డులో అతికించారు. మరోవైపు రూ.46 వేల రుణం తిరిగి చెల్లించకపోతే నగలు వేలం వేస్తామని కొత్తచెరువు మండలం లోచర్లకు చెందిన రైతు శంకర్‌రెడ్డికి నోటీసు జారీ చేశారు. బ్యాంకుల నోటీసుల నేపథ్యంలో రుణాలు సకాలంలో మాఫీ అవుతాయా? ఆలస్యమైతే పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. సాధారణంగా జూన్ నుంచి మొదలుపెట్టి ఆగస్టు వరకు బ్యాంకులు వ్యవసాయ రుణాలు పంపిణీ చేస్తాయి. కానీ ఈసారి రైతులు ఎలాగైనా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో.. బ్యాంకులకు తాము బకాయి ఉన్నామనే విషయూన్నే పూర్తిగా మర్చిపోయారు. ‘మామూలుగా అయితే వడ్డీ కలుపుకుని రుణం మొత్తం ఎంత అరుు్యందో తెలుసుకునేందుకు రైతులు ఈ పాటికే బ్యాంకుల్లో ఆరా తీస్తారు. కానీ ఈసారి ఇప్పటిదాకా ఒక్కరూ బ్యాంక్ వైపు కన్నెత్తి చూడలేదు’ బ్యాంకుల సిబ్బంది చెబుతున్నారు. రైతులు రుణమాఫీ కోసం ఎదురుతెన్నులు చూస్తుండటమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. పాత రుణాలు మాఫీ చేస్తే తప్ప... బ్యాంకులు రైతులకు కొత్త వ్యవసాయ రుణాలు పంపిణీ చేసే పరిస్థితి లేదు. జూన్ 8న కొలువు దీరే కొత్త ప్రభుత్వం.. ఆ తర్వాత గానీ రుణమాఫీపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థారుు బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చిట్టచివరి సమావేశం ఇదే. ఈ సమావేశంలో రైతులకివ్వాల్సిన కొత్త రుణాలపై బ్యాంకర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అరుుతే రుణమాఫీ అంశంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేని కారణంగా కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు అశక్తత వ్యక్తం చేశారు. రుణాల మొత్తం రూ. 1,37,176 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ. 1,37,176 కోట్లు ఉంది. ఇందులో 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర రైతులు తీసుకున్న రుణమొత్తం రూ.87,612 కోట్లు. మిగతా రూ. 49,564 కోట్ల మొత్తం తెలంగాణ జిల్లాల రైతులది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు రుణ మాఫీ హామీ ప్రకారం సీమాంధ్రకు చెందిన రూ. 87,612 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. కానీ దీనిపై సందిగ్ధత కొనసాగుతుండటం, ఎస్ఎల్బీసీ భేటీ సైతం కొత్త రుణాలపై ఏమీ తేల్చకుండానే ముగియడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘రైతులు రుణమాఫీపై ఆతృతతో ఎదురుచూస్తున్నారు. రుణాలు మాఫీ అవగానే ఖరీఫ్ రుణాలు తీసుకోవాలని ఆశతో ఉన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో రెండో పంట సాధ్యం కాదనే భావంతో వీలైనంత త్వరగా రుణం తీసుకుని ఖరీఫ్‌లో మొదటి పంట అయినా పొందాలని చూస్తున్నారు..’ అని ఎస్ఎల్బీసీ చైర్మన్ రాజేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళనకు నిదర్శనం. ప్రభుత్వం హామీ ఇస్తేనే..: ఎస్ఎల్బీసీ స్పష్టీకరణ రైతుల రుణ మాఫీపై కొత్త ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఈ ఖరీఫ్‌లో రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని ఎస్ఎల్బీసీ తే ల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అధ్యక్షతన గురువారం ఎస్ఎల్బీసీ 183వ సమావేశం జరిగింది. రైతుల రుణమాఫీ చేస్తామంటూ నేతలు ఇచ్చిన హామీని ఎస్ఎల్బీసీ చైర్మన్ రాజేంద్రన్ గుర్తు చేశారు. రైతులకు సంబంధించి పంట రుణాలు (క్రాప్‌లోన్స్), బంగారం తనఖా పెట్టి వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలు కూడా ఉన్నాయని.. ఏయే రుణాలు రద్దు చేస్తారో ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘సక్రమంగా రుణాలు చెల్లించిన వారికా? లేక రుణాలు చెల్లించకుండా బకాయి పడిన రైతులకా? రుణమాఫీకి ఎవరెవరు అర్హులు..?’ అనే అంశాలపై స్పష్టత అవసరమన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ.. ’ఖరీఫ్ అత్యంత ముఖ్యమైన సీజన్. రైతులకు సకాలంలో రుణాలు అందకపోతే వ్యవసాయ ఉత్పత్తి మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతాంగానికి ఇది మరీ సంక్లిష్టమైన సమయం. అందువల్ల రుణమాఫీ వరకు వేచి చూడకుండా కనీసం అర్హులైన రైతులకైనా రుణాలు మంజూరును వేగవంతం చేయాలి’ అనిబ్యాంకర్లకు సూచించారు. దీంతో రుణ మాఫీపై స్పష్టత ఇచ్చే వరకూ బకాయిదారులకు కొత్త రుణాలు ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పిన బ్యాంకర్లు.. ఇప్పటివరకు రుణాలు తీసుకోని, అప్పులు చెల్లించిన రైతులకు మాత్రం యథాప్రకారం ఖరీఫ్ రుణాలు ఇస్తామని తెలిపారు. కాగా, సాధారణంగా ప్రతియేటా జూన్ నుంచి కొత్త రుణాలు తీసుకుంటుంటారని, కానీ ఈ ఏడాది ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా అప్పు చెల్లించలేదని కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన బ్యాంకర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. -
అంగట్లో అద్దెకు ఎడ్లు
బాల్కొండ, న్యూస్‌లైన్ : ఇప్పుడు ఎడ్లు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్నాయి. ఖరీప్ సీజన్ ముంచుకు వస్తుండటంతో రైతులు విత్తనాలు వేసేందుకు వీటిని ముందస్తుగా అద్దెకు తీసుకుంటున్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సంతలో చాలామంది రైతులు ఎడ్లను కొనుగోలు చేయకుండా అద్దెపైనే తీసుకెళ్లారు. గత ఏడాది నెలవారీగా కిరాయిపై ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి సంవత్సరం లెక్కన గుత్తాగా అద్దెకు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఖరీప్ విత్తనాలు వేయడం పూర్తయ్యే వరకు ఎడ్లను తీసుకెళ్తే 10 వేలు చెల్లించాలి. ఎడ్లు మార్కెట్లో విక్రయిస్తే ఎంత ధర పలుకుతుందో అంత సొమ్మును వ్యాపారి వద్ద డిపాజిట్ ఉంచాలని నిబంధన పెడుతున్నారు. పశుగ్రాసం కొరతతో పశుగ్రాసం కొరత వల్ల సన్న, చిన్నకారు రైతులు తమ పశువులను సాకటం కష్టమవ్వడంతో ముందుగానే విక్రయించుకున్నారు. ప్పుడు వ్యవసాయ పనులు దాదాపు యంత్రాలతోనే చేపడుతున్నారు. రైతు ఇంట సిరులు కురిపించె పసుపు పంటను విత్తాలంటే తప్పనిసరిగా రైతు నాగలి పట్టి దుక్కి దున్నాల్సిందే. ఇందుకోసం రైతులు ఎడ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అద్దెకు తీసుకుపోయిన ఎడ్ల మేత, అవి ఉండటానికి నివాసం అంతా రైతులే ఏర్పాటు చేసుకోవాలి. అంగట్లో నుంచి పశువులను తీసుకెళ్లేప్పుడు ఎట్లా ఉన్నాయో.. అప్పగించేప్పుడు అట్లాగే ఉండాలి. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే డిపాజిట్ తిరిగి ఇవ్వరు. వ్యాపారులు ఇన్ని నిబంధనలు పెట్టినా రైతులు ఎడ్లను కిరాయికి తీసుకుపోతున్నారు. ఎడ్లను గుత్తగా అద్దెకు తీసుకోవాలని నిబంధన లేదు. అవసర నిమిత్తం ఎనిమిది రోజుల నుంచి నెలరోజుల వరకు తీసుకెళ్లవచ్చు. పసుపు పంట సాధారణంగా జూన్ మధ్యలో నుంచి విత్తుతారు. ఒకే రైతుకు ఎనిమిది రోజుల పాటు పసుపు విత్తె అవసరం ఉండదు. కనుక ముగ్గురు నుంచి నలుగురు రైతులు కలిసి రెండు ఎడ్లను అద్దెకు తీసుకుం టున్నారు. యంత్రాలను, వాహనాలను అద్దెకు ఇచ్చినట్లు.. మూగ జీవాలను సైతం కిరాయి ఇవ్వడం విచారకరమే. ఒకప్పుడు పాడితో వ్యవసాయాన్ని చేసుకునే రైతు ఇప్పుడు కిరాయి పశువులతో సాగుచే యడం బాధాకరమే.