
పిల్లల్ని ఎలా సాదేది?
* రైతుల ఆత్మహత్యతో కకావికలమైన కుటుంబాలు
* తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులు
* అప్పులు, ఎండిన పంటలతోనే మరణాలు
* లోకాయుక్తకు గోడు వెళ్లబోసుకున్న మహిళలు
* స్వతంత్ర కమిటీ వేయాలన్న రైతుసంఘం
* ఆత్మహత్యల పిటిషన్‌పై విచారణ వచ్చేనెల 24 కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: పంటలు ఎండి, అప్పుల భారం పెరిగి రైతన్నలు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో కరవు పరిస్థితులు రైతుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. చనిపోయినవారిలో ఎక్కువమంది యువరైతులే ఉన్నారు. దీంతో తమ పిల్లలను ఎలా పెంచాలో తెలియక తల్లులు ఆవేదన చెందుతున్నారు. పంటలు పండుతాయన్న ఆశతో అప్పులు చేసి సాగుచేస్తే వర్షాలు రాక ఎండిపోయాయని, వడ్డీవ్యాపారులు బాకీలకోసం వేధిస్తున్నారని బాధితులు తల్లడిల్లుతున్నారు.
సర్కారు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అంతేకాక మంగళవారం లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వేసిన పిటిషన్‌పై లోకాయుక్తలో జరిగిన విచారణకు బాధితకుటుంబాల వారు హాజరయ్యారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని, అనాథలైన పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతోనే విద్య చెప్పించాలని రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ కోరారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిటీ వేసి వివరాలు సేకరించాలని కోరారు. అయితే, రైతుల ఆత్మహత్యలపై ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ల నుంచే నివేదికలు అందాయనీ, మిగతా జిల్లాల నుంచి రావాల్సి ఉన్నందున విచారణను వచ్చే నెల 24వ తేదీకి లోకాయుక్త వాయిదా వేసిందని ఆమె చెప్పారు. కుటుంబసభ్యులను కోల్పోయిన మహిళలను ‘సాక్షి’ పరామర్శించి వివరాలు సేకరించింది. వారి మనోవేదన వారి మాటల్లోనే...
నా కొడుకూ కోడలు ఇద్దరూ చనిపోయారు
నా వయస్సు 78 ఏళ్లు. నా కోడలు యాదమ్మ (30) ఆర్థిక సమస్యలు, అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఆమె చనిపోయిన 10 రోజుల్లోనే కొడుకు నరసింహులు (35) పత్తి, మొక్కజొన్న, వరి ఎండిపోవడంతో గత నెల 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. నా మనవళ్లు శ్రీశైలం (7), శ్రీకాంత్ (4)లను అనాధలయ్యారు. నాకు పింఛన్ కూడా రావడంలేదు. నా కొడుకు చేసిన రూ. 2 లక్షల అప్పులు చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారు. ఏం చేయాలి దేవుడా? మమ్మల్ని ప్రభుత్వమే కాపాడాలె.
- చంద్రమ్మ, సిరంగపురం, మహబూబ్‌నగర్ జిల్లా
పంటలు ఎండిపోవడంతో..
నా భర్త రాజేందర్ (35) పంటలు ఎండిపోయి, అప్పులు పెరిగి గత నెల 20న బావి దగ్గర ఉరేసుకున్నడు. మూడెకరాల భూమిలో పత్తి ఏసిండు. మొలకెత్తకపోతే రెండుమూడుసార్లు విత్తనాలు నాటిండు. కౌలుకు తీసుకున్న ఇంకో 3 ఎకరాల్లో మొక్కజొన్న ఏసిండు రూ. 4 లక్షల అప్పు చేసిండు. పంటలు ఎండిపోయి, అప్పు మిగిలిపోగా ఆత్మహత్యే దిక్కనుకున్నడు. నన్ను ఒంటరి దాన్ని చేసిపోయిండు. నాకు ఏడాది కొడుకు, 13 ఏళ్ల బిడ్డ ఉంది. వాళ్లను ఎట్లా సాదాలే. అప్పులెట్ల తీర్చాలే.
- విజయ, పీచుపల్లి, బెజ్జంకి మండలం,
కరీంనగర్ జిల్లా
పురుగుమందు తాగి
నా భర్త శ్రీహరి (63) రెండెకరాల్లో పత్తి, ఒక ఎకరంలో వరి వేశాడు. పత్తి సరిగా మొలకెత్తకపోతే నాలుగుసార్లు విత్తాడు. అయినా అది ఎండిపోయి, రూ. 3.7 లక్షల అప్పులు కావడంతో మనోవేదనకు గురై చేనులోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
- కొల్లిపాక భాగ్యలక్ష్మి, వరంగల్ జిల్లా
పత్తి ఎండిపోయి.. అప్పులు పెరిగి
నా భర్త అంజయ్య (35) రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. పత్తి మొదటిసారి మొలకెత్తకపోవడంతో రెండోసారి వేశాడు. అయినా నీరు లేకపోవడంతో పత్తిపంట పోయింది. సాగు కోసం రూ. 2.50 లక్షలు అప్పులు చేశాడు. పంట ఎండి, అప్పులు పెరిగి మానసిక వేదనకు గురై జూలై 23వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వారిద్దరూ చిన్నారులే. నా జీవితం అంధకారమైంది.
- అనూష, వరంగల్ జిల్లా
పదెకరాలు కౌలుకు తీసుకుంటే..
నా భర్త నరసింహులు పంటలు ఎండిపోవడంతో 20 రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఎకరాలు కౌలుకు తీసుకొని, రూ. 2.5 లక్షలు అప్పు చేసి మొక్కజొన్న వేశాడు. వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది. నా జీవితం చీకటిమయం అయింది.
- విమల, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా