రైతు సదస్సులో మాట్లాడుతున్న అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం. సమావేశంలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు, రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర తదితరులు
సాక్షి, అమలాపురం: ‘గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడాది పొడువునా సెక్షన్ 30 పెట్టారు. రైతుల సమావేశం అంటే 144 సెక్షన్ ఉందని హెచ్చరించేవారు. సమావేశం పెట్టుకుంటే పోలీసులు వచ్చి మైకులు విరగ్గొట్టారు. సాగు సమ్మె చేయమని పిలుపునిస్తే చూస్తూ ఊరుకోబోమని సాక్షాత్తూ నాటి హోంశాఖ మంత్రి హెచ్చరించారు. అప్పుడెందుకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. మాకెందుకు మద్దతుగా నిలవలేదు. ఇప్పుడెందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు?’ అంటూ కొంతమంది రైతు సంఘం నాయకులు నిలదీయడంతో టీడీపీ అనుకూల రైతు సంఘం నాయకులకు నోరు పెగల్లేదు. అమరావతి రైతులకు అనుకూలంగా తీర్మానం చేయించాలనే ఉద్దేశంతో టీడీపీ అనుకూల రైతులు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సమావేశం నిర్వహించగా వారికి ఝలక్ తగిలింది. స్థానిక విద్యుత్ నగర్‌లో బుధవారం కోనసీమ రైతు పరిరక్షణ సమితి, భారతీయ కిసాన్ సంఘల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తీర్మానంతోపాటు ధాన్యం సొమ్ములు రావడం లేదని, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామనే తీర్మానాలు చేయాలని టీడీపీ అనుకూల రైతులు తలపోశారు. ఈ విషయాలు తెలుసుకున్న రైతు సంఘం నాయకులు కొంతమంది స్పందించారు.
స్థానిక సమస్యలపై చర్చిద్దాం..
‘ఎక్కడో రైతుల సమస్యలు తరువాత.. ముందు ఇక్కడ విషయాలు మాట్లాడదాం?’ అని బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల జమ్మి అన్నారు. కొంతమంది రైతులు ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు రాలేదని ప్రస్తావించగా ‘ధాన్యం బాగానే పండింది. ప్రభుత్వం మంచిగానే కొనుగోలు చేసింది. సొమ్ములు రేపో, ఎల్లుండో వస్తాయి. 2011 సాగు సమ్మె తరువాత నుంచి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాల నుంచి మనకు పంట నష్టం పరిహారం ఇవ్వలేదు. రైతు రుణమాఫీ సొమ్ములు పూర్తిగా అందలేదు. పనిలో పని వాటి మీద కూడా చర్చిస్తే మంచిది’ అని జమ్మి తేల్చిచెప్పారు.
విజయవాడలో రైతులకు కాని, రైతు కూలీలకు కాని నష్టం జరిగితే మాట్లాడదాం, అంతేకాని రాజధాని మార్పు విషయం గురించి ఇక్కడ మాట్లాడతామంటే కుదరదు’ అని తెగేసి చెప్పాడు. ఆయనకు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి), డీసీసీబీ మాజీ డైరెక్టర్ గోదాశి నాగేశ్వరరావు తదితరులు దన్నుగా నిలిచారు. గోదాశి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కేసుల నమోదు, అప్పటి ఆర్డీవో కార్యాలయంలో రైతులతో జరిగిన చర్చలో రైతు సంఘం నాయకుడు రంబాల బోస్‌కు జరిగిన అవమానం గుర్తు చేయడంతో కొంతమంది టీడీపీ అనూకూల రైతులు అభ్యంతరం చెప్పారు. జరిగిన విషయం చెప్పుకుంటే మీకు ఉలికెందుకని కొంతమంది ప్రశ్నించడంతో టీడీపీ అనుకూల రైతులు మిన్నకుండా ఉండిపోయారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర వివిధ కారణాలతో ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలంటూ ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు సొమ్ములు విడుదల చేయాలని, రబీకి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం అధ్యక్షత వహించారు. రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు రంబాల బోస్, బీకేఎస్ నాయకుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతు సంఘం నాయకులు రాయుపురెడ్డి జానకీరామయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment